Site icon Prime9

AP Budget 2024-25: మండలిలో.. వాఢీ-వేడి.. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను లెక్కలతో సహా ఎండగట్టిన డిప్యూటీ సీఎం

AP Assembly Budget Session 2024: ప్రతిపక్ష పార్టీ విమర్శలు, అధికార పక్షం ప్రతి విమర్శలతో ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలిలో బుధవారం వాడీవేడిగా చర్చలు సాగాయి. డయేరియా మృతులకు తప్పు ప్రభుత్వానిదే అని వైసీపీ చేసిన ఆరోపణలను అధికార పక్షం ధీటుగా తిప్పి కొట్టింది. ప్రజారోగ్యం, గ్రామీణ నీటి సరఫరా, అభివృద్ధికి వెచ్చిస్తున్న నిధుల వివరాలను ఆధారాలతో సహా వివరించింది. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వ అసమర్థ విధానాలను లెక్కలతో సహా ఎండగట్టింది. ప్రజా భద్రత పట్ల తమకు చెప్పే నైతిక అర్హత ప్రతిపక్షానికి లేదని స్పష్టం చేసింది.

డయేరియా మృతుల సంఖ్యపై పెద్ద ఎత్తున చర్చ
రాష్ట్ర ప్రభుత్వ 2024-25 వార్షిక బడ్జెట్‌ నేపథ్యంలో.. విజయనగరం జిల్లాలో ఇటీవల తలెత్తిన డయేరియా మృతుల సంఖ్యపై పెద్ద ఎత్తున చర్చ సాగింది. మండలిలో ప్రతిపక్ష నేత, బొత్స సత్యానారాయణ, వైసీపీ ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, పండుల రవీంద్రబాబు మాట్లాడుతూ… వందల సంఖ్యలో ప్రజలు డయేరియా బారిన పడినా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. నీరు కలుషితమై డయేరియాతో చీపురుపల్లి నియోజకవర్గంలోని గుర్ల మండల పరిధి (గ్రామాల్లో ప్రజలు అవస్థలు పడ్డారని విమర్శించారు. పినపర్తి, తెట్టంగి, కోటగండ్రేడు, గుర్ల, నాగలవలస, గోసాడ, జగన్నాథపురం గ్రామాల్లో వందలాది మంది అనారోగ్యానికి గురయ్యారని, ప్రభుత్వ మాత్రం నలుగురే మరణించినట్లు చెబుతోందని ఒకానొక దశలో అసహననానికి గురయ్యారు. దాదాపు 202 మంది వివిధ ఆస్పత్రుల్లో చేరి, చికిత్స పొందారని, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ బాధిత గ్రామాన్ని సందర్శించి, 10మంది మరణించినట్లు స్వయంగా ప్రకటించారని గుర్తుచేశారు. అనంతరం దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి సహా, మంత్రులు అచ్చెంనాయుడు, సత్యకుమార్‌ యాదవ్‌… లెక్కలతో సహా ప్రతిపక్ష విమర్శలను తిప్పి కొట్టారు.

ప్రశ్నలు, జవాబులు..
వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో పూర్తిగా దెబ్బతిన్న పంచాయతీరాజ్ వ్యవస్థపై శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు డిప్యూటీ సీఎం, ఆ శాఖ మంత్రి కొణిదల పవన్ కల్యాణ్ సమాధానం ఇచ్చారు. 14, 15 ఆర్థిక సంఘం నిధులను గత ప్రభుత్వం తప్పుదోవ పట్టించిన విషయం వాస్తవమేనని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారుల బృందం వివిధ గ్రామాల్లో పర్యటించగా, పంచాయతీల నిధుల దుర్వినియోగంలో అవకతవకలు గుర్తించినట్లు తెలిపారు. కేంద్రం గత 3 ఏళ్లలో 8 దఫాలుగా నిధులు విడుదల చేయగా.. 5 దఫాలు పూర్తి ఆలస్యంగా పంచాయతీలకు నిధులు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. వాస్తవానికి కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన నిధులు 10 రోజుల్లోగా పంచాయతీ లకు విడుదల చేయాల్సి ఉందన్నారు. అయితే.. వాటిని వివిధ పథకాలు, ఇతర అవసరాల పేరుతో దారి మళ్లించినట్లు అధికారుల బృందం గుర్తించిందని వివరించారు. అవకతవకలు జరిగిన పక్షంలో దీనిపై ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారని సభ్యులు కోరగా.. మరింత సమగ్ర విచారణ అవసరం ఉందని డిప్యూటీ సీఎం సమాధానమిచ్చారు.

సర్పంచ్ లకు పవర్..
92, 93వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీ లకు కల్పించిన అధికారులను వైసీపీ ప్రభుత్వం పూర్తిగా హరించిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ప్రజలు ఎన్నుకున్న సర్పంచ్ లకు పవర్ లేకుండా పోయిందని తెలిపారు. తిరిగి వారికి పూర్తి అధికారం ఇచ్చే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతుందని భరోసా ఇచ్చారు. పంచాయతీ లకు తొలి పౌరుడు సర్పంచ్ అని, వారి స్థానం, గౌరవాన్ని తిరిగి ఇచ్చే బాధ్యత తనదేనని తెలిపారు.

5 ఏళ్ల నిర్లక్ష్యంపై..
బొత్స, వరుదు కల్యాణి ఆరోపణలపై స్పందించిన రాష్ట్ర వ్యవసాయ, పశు సంవర్థక శాఖ మంత్రి కింజరాపు అచ్చెంనాయుడు మాట్లాడారు. గుర్ల డయేరియా బారిన పడిన వారి కంటే.. ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన మీడియాలో అధికంగా పేర్కొనడం గందరగోళానికి కారణమని తెలిపారు. ఒక్కో పత్రిక ఒక్కోలా రాస్తుందని, క్షేత్రస్థాయిలో అధికారుల పర్యటించి తరువాతే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని స్పష్టం చేశారు. గత 5 ఏళ్లలో నీటి సరఫరా పైపులైన్ల మరమ్మతులు, నిర్వహణ సరిగా లేకపోవడమే ఘటనకు కారణమని విమర్శించారు. వైసీపీ నిర్లక్ష్యాన్ని ప్రస్తుత ప్రభుత్వంపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. డయేరియాతో మృతి చెందిన వారు నలుగురు మాత్రమేనని, ఇతర కారణాలతో చనిపోయిన వారిని సైతం డయేరియా బాధితులుగా పేర్కొన్నారని వివరించారు. దీంతో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వివాదం చెలరేగింది. పరస్పర వాదోపవాదాలతో మండలిలో కొద్ది సేపు గందరగోళం నెలకొంది.

Exit mobile version