Houseplants: ఇంట్లో మొక్కల్ని పెంచుకోవాలని చాలామంది అనుకుంటారు. కానీ, సరిపోయిన స్థలం లేకపోవడం వల్లనో.. ఇండోర్ ప్లాంట్స్ తో పని ఎక్కువ అనే ఆలోచనతో మొక్కల పెంపకంపై వెనకడుగు వేస్తుంటారు. చిన్న చిన్న భయాలతో ఇష్టమైన పనులకు దూరంగా ఉంటారు. అయితే, పెద్దగా పని అవసరం లేకుండా చాలా తేలిగ్గా పెరిగే మొక్కలు మార్కెట్ లో దొరుతున్నాయి. ఇండోర్స్ కోసం ఈ మొక్కల్ని ట్రై చేయండి. దాంతో ఇంట్లో అందంగా.. హాయిగా ఉంటుంది.
ప్రేయర్ ప్లాంట్(Houseplants)
ప్రేయర్ ప్లాంట్ ఆకులు ప్రేయర్ చేస్తున్నట్టుగా ఉంటాయి. లేత, ముదురు ఆకుపచ్చ రంగులో, మధ్యలో ఈనెలు… అచ్చం ఆర్టిస్ట్ వేసిన పెయింటింగ్ లా ఉంటుంది ఈ మొక్క. ప్రేయర్ ప్లాంట్‌కి కొమ్మలు, ఆకులు తక్కువగా ఉంటాయి. ఒక్కో కాడకు ఒక ఆకు చొప్పున గట్టిగా 10 ఆకులుంటాయి. కానీ చాలా అందంగా ఉంటుంది ఈ మొక్క. రిలాక్స్ అయ్యే ప్లేస్ లో ఈ మొక్క పెట్టుకుంటే ఒత్తిడి దూరం అవ్వడం ఖాయం.
ముత్యాల తీగ(Houseplants)
సెనెసియో రౌలేయనస్ అనే పిలిచే ఈ మొక్కను ముత్యాల తీగ అంటారు. మొక్క మొత్తం ముత్యాల దండలా ఉండి.. బాగా ఆకర్షిస్తుంది. ఈ మొక్కకి సన్ లైట్ అవసరం లేదు. ఇంట్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. బాల్కనీ, హాల్, కిచెల్.. ఇలా ఎక్కడైనా ఓ కెక్కెం తగిలించి ఈ మొక్క కుండీని వేలాడదీస్తే.. ఇంటికే అందం వస్తుంది. ఈ స్ట్రింగ్ ఆఫ్ పెర్ల్స్ మొక్కకి మట్టి గుల్ల గుల్లగా ఉండాలి. నీళ్లు కూడా తక్కువ పోస్తే సరిపోతుంది.
చైనీస్ వాటర్ బ్యాంబూ
ఇంట్లో పెట్టుకునేందుకు అనుకూలమైన మరో మొక్క చైనీస్ వాటర్ బ్యాంబ్. ఈ మొక్క మట్టిలోనే కాకుండా నీళ్లలో కూడా పెరుగుతుంది. ఈ ప్లాంట్ కాండం వెదురులా ఉంటుంది. నీళ్లలో పెట్టుకుంటే వారానికి ఒకసారి తప్పనిసరిగా నీళ్లను మార్చాలి. ఈ చైనా నీటి వెదురు మొక్కని అదృష్టంగా అనుకుని లక్కీ ప్లాంట్ అని పిలుచుకుంటారు. చాలామంది తాము పెంచుకోవడమే కాకుండా బంధుమిత్రులకూ కానుకగా ఇస్తుంటారు. మట్టి లో పెంచుకుంటే.. మొక్క మొదట్లో చిన్న చిన్న రంగు రాళ్లను పెడితే చాలా అందంగా కనిపిస్తుంది.
అరేకా పామ్స్
ఇంటి లోపల మూలల్లో అరేకా పామ్ మొక్కలను పెట్టుకోవచ్చు. వీటితో పాటు స్నేక్ ప్లాంట్ కూడా ఇండోర్స్ లో సాధారణంగా కనిపించే మొక్క. ఇవి ఆకర్షణీయమైన పొడవాటి ఆకులతో ఉంటాయి. మైక్రో టోన్డ్ సిరామిక్ పాట్స్ లో ఈ మొక్కలు బాగా కనిపిస్తాయి. ఈ మొక్కల కుండీలు ఎక్కడ పెట్టినా ఆ ప్రదేశానికే అందం వస్తుంది.
కలాంచో
ఇండోర్ ప్లాంట్స్ చాలా కలర్ ఫల్ గా కనిపించే మొక్క కలాంచో. సాధారణంగా ఈ మొక్క రంగులు రంగుల పువ్వులు పూస్తుంది. దాని వల్ల ఇంట్లో ఏ ప్రాంతానికి అందం వస్తుంది. ఎక్కువగా వంటగది లేదా పడకగదిలో ఉంచకోవచ్చు. ఈ మొక్కకు తక్కువ తేమ సరిపోతుంది. ఇది చలి కాలంలో కూడా బాగా పువ్వులు పూస్తుంది.