Site icon Prime9

World Cancer Day: మానవాళిని పట్టి పీడిస్తున్న అత్యంత ప్రమాదకరమైన వ్యాధి.. క్యాన్స‌ర్‌పై పోరులో జోరు పెరగాలి

World Cancer Day 2025: నేడు మానవాళిని పట్టి పీడిస్తున్న అత్యంత ప్రమాదకరమైన వ్యాధులలో క్యాన్సర్ తొలిస్థానంలో ఉంది. మనదేశంలో గుండెజబ్బుల మూలంగా ఎక్కువ మంది మరణిస్తుంటే, రెండో మరణకారక వ్యాధిగా క్యాన్సర్ ఉంది. ఈ వ్యాధిపై ప్రపంచవ్యాప్తంగా అవగాహన పెంచాలనే సంకల్పంతో 1993లో జెనీవాలో యూనియన్ ఫర్ ఇంటర్నేషనల్ క్యాన్సర్ కంట్రోల్ అనే సంస్థ ఏర్పాటైంది. ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ నిర్మూలన, వైద్య పరిశోధనలను ప్రోత్సహించటమే లక్ష్యంగా ఏర్పడిన ఈ సంస్థ 2000 ఫిబ్రవరి 4న జెనీవాలో మొదటి అంతర్జాతీయ క్యాన్సర్ దినోత్సవాన్ని నిర్వహించింది. నాటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక ప్రసిద్ధ సంస్థలు, క్యాన్సర్ సంఘాలు, చికిత్సా కేంద్రాలను ఈ ప్రచారంలో భాగస్వాములను చేస్తూ ఏటా రకరకాల థీమ్‌లతో క్యాన్సర్ మహమ్మారి మీద ప్రపంచవ్యాప్తంగా ఈ సంస్థ అవగాహనా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈసారి ‘యునైటెడ్ బై యూనిక్’ అనే థీమ్‌ను సంస్థ నిర్ణయించింది.

ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ కేసులలో చైనా, అమెరికా, భారత్ తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఏటా కోటి మంది క్యాన్సర్‌తో మరణిస్తుండగా, మనదేశంలో ఏటా సగటున 8 లక్షలమందికి కొత్తగా ఈ వ్యాధి సోకుతోందని, 2020లో దేశంలో 14 లక్షల క్యాన్సర్ కేసులు ఉంటే, వాటి సంఖ్య 2025 నాటికి 15.7 లక్షలకు చేరిందని గణాంకాలు చెబుతున్నాయి. 2023 కంటే 2024లో మనదేశంలో 12 శాతం అధికంగా కేసులు నమోదయ్యాయని ‘మెడిఅసిస్ట్‌ హెల్త్‌కేర్‌ సర్వీసెస్‌’అనే సంస్థ తన నివేదికలో వెల్లడించింది. క్యాన్సర్లలో అనేక రకాలున్నప్పటికీ, నోటి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, ఊపిరి తిత్తుల క్యాన్సర్, కడుపు క్యాన్సర్ అనే 5 ప్రధాన రకాల బారిన భారతీయులు ఎక్కువగా పడుతున్నారు. మన దేశంలో క్యాన్సర్ బాధితుల్లో ప్రతి ముగ్గురిలో ఇద్దరికి, వ్యాధి పూర్తిగా ముదిరిన తర్వాతే నిర్ధారణ కావటంతో వారు జీవించే అవకాశం బహుస్వల్పంగా ఉంటోంది. అవగాహన లేకపోవడం, నిరక్షరాస్యత, వైద్య పరీక్షలంటే భయం, పలు రకాల అపోహల వల్ల మనదేశంలో ఈ మహమ్మారిని తొలిదశలోనే గుర్తించలేకపోతున్నాం. తరచూ పరీక్షలు నిర్వహించటం వల్ల ముందుగానే ఈ కేసులను గుర్తించవచ్చని, అదే జరిగితే దేశంలో సంభవిస్తున్నక్యాన్సర్‌ మరణాల్లో దాదాపు మూడింట ఒక వంతును అడ్డుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.

మన శరీరంలోని కణాలు.. నియమితమైన పద్ధతికి భిన్నంగా అసాధారణంగా పెరగటాన్నే వైద్యులు క్యాన్సర్‌గా చెబుతుంటారు. తొలుత ఒక కణంతోనే మొదలయ్యే ఈ ప్రక్రియ ఎప్పటికప్పుడు రెట్టింపు అవుతూ పోతుంది. ఈ క్రమంలో ఇది 20వ సారి ఒక మిలియన్‌ కణాలుగా వృద్ధి చెందుతుంది. మిలియన్‌ కణాల సముదాయంగా పెరిగినప్పటికీ ఆ టైమ్‌లోనూ దాన్ని కనుక్కోవడం కష్టమే. అదే 30వసారి రెట్టింపు అయ్యే సమయంలో అందులో బిలియన్‌(100 కోట్లు) కణాలకు పైగా ఉంటాయి. అప్పుడు మాత్రమే అది ఓ గడ్డ (లంప్‌)లా రూపొంది గుర్తించడానికి వీలవుతోంది. కొంత సమయానికి ఈ క్యాన్సర్‌ గడ్డలో బిలియన్‌ కణాలు… వందకోట్ల కణాలకు పైనే ఉంటాయి. ఇక 40వ సారి రెట్టింపయ్యాక అందులో ఒక ట్రిలియన్‌ (1000 కోట్ల) కణాలుంటాయి. అప్పటికీ చికిత్స లభించక 42–43వ సారి ఆ కణాల సముదాయం రెట్టింపయినప్పుడు రోగి ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి వెళ్తాడు. అందుకే అన్నిసార్లు రెట్టింపు కాకముందే దానిని గుర్తించటం అవసరం. కనీసంలో కనీసంగా 20వ సారి రెట్టింపయ్యే లోపు కనుక్కోగలిగితే…క్యాన్సర్‌ను జయించటం నేటి పరిస్థితుల్లో ముమ్మాటికీ సాధ్యమే.

మనదేశంలో మహిళలను ఎక్కువగా కబళిస్తున్న రకం.. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్. ఈ వాస్తవాన్ని గుర్తించిన ఏపీలోని కూటమి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 18 ఏళ్ల వయసు దాటిన మహిళలకు క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయాలని సంకల్పించింది. ఏపీలో 18 ఏళ్లు దాటిన మహిళల సంఖ్య 2 కోట్లుగా ఉండగా, వీరిలో ముందుగా యువతులకు రొమ్ముక్యాన్సర్‌ స్వీయపరీక్షపై అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. 30 ఏళ్లు దాటిన మహిళలకు సర్వైకల్‌ క్యాన్సర్‌ నిర్ధారణ టెస్టులు చేస్తున్నారు. చివరి విడత పరీక్షల్లో పీహెచ్‌సీ వైద్యులు క్యాన్సర్‌ కేసులను గుర్తించి, వారికి చికిత్సను అందించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏపీలో ఏటా 73 వేల కొత్త క్యాన్సర్‌ కేసులు, 40 వేల వరకు మరణాలు సంభవిస్తున్నాయి. దేశంలో ఇలా ఇంటింటి సర్వేతో క్యాన్సర్‌ లక్షణాలు గుర్తిస్తున్న మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్​నే కావడం గమనార్హం. ఏపీలో 18 ఏళ్లు నిండిన 3.94 కోట్ల మందికి నోటి, రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ పరీక్షలను వారి ఇళ్ల వద్దే ఉచితంగా నిర్వహించే ఈ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం తొమ్మిది నెలల పాటు సాగనుంది.
ఈ డ్రైవ్‌లో దాదాపు 18 వేల మంది ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బందితో బాటు 15 వేల మంది ఏఎన్ఎంలు, 3 వేల మంది కమ్యునిటీ హెల్త్ ఆఫీసర్లు,125 మంది ఆంకాలజీ స్పెషలిస్టులు భాగస్వాములు కానున్నారు. ఈ డ్రైవ్‌లో గుర్తించిన క్యాన్సర్ బాధితులను రిఫరల్ ఆస్పత్రులకు తరలించి వైద్య సేవలు అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం కోసం ఏపీలోని కూటమి ప్రభుత్వం రూ. 700 కోట్లకు పైగా వెచ్చించనుంది.

ఇక తెలంగాణలో రోజూ సగటున 150-160 మంది క్యాన్సర్‌ బారిన పడుతున్నారు. 2016లో 43,129 కొత్త కేసులు నమోదు కాగా, 2018 నాటికి ఆ సంఖ్య 52 వేలకు చేరింది. 2030 నాటికి ఏటా 65 వేల మంది ఈ మహమ్మారి బారిన పడే ప్రమాదం ఉందని సర్కారీ గణాంకాలు చెబుతున్నాయి. క్యాన్సర్‌ కారణంగా తెలంగాణలో ఏటా 20వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే, తెలంగాణలో 1955లో ఏర్పాటు చేసిన ఎంఎన్‌జే ఆస్పత్రి ఒక్కటే క్యాన్సర్ చికిత్స అందే ప్రభుత్వాసుపత్రిగా ఉంది. అందులో 750 పడకలున్నా.. రోగుల రద్దీకి అవి ఏమాత్రం సరిపోవడం లేదు. దాంతో డే కేర్‌ సిస్టమ్‌ను తీసుకొచ్చారు. కీమోథెరపీ చేసిన రోగులను దాదాపు 2 గంటలపాటు అబ్జర్వేషన్‌లో ఉంచుతున్నారు. అనంతరం అదేరోజు డిశ్చార్జ్‌ చేస్తున్నారు. అందుకే తెలంగాణ ప్రభుత్వం నిరుడు 5 జిల్లా కేంద్రాల్లో క్యాన్సర్‌ రీజినల్‌ సెంటర్ల ఏర్పాటుకు ముందుకొచ్చింది. తొలుత కొత్తగూడెం, ఆదిలాబాద్‌, మహబూబ్‌నగర్‌, సంగారెడ్డి, కరీంనగర్‌లో ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో కేంద్రాన్ని రూ.50 కోట్లతో ఆధునిక వసతులతో నిర్మించనున్నారు. అటు కేంద్రం కూడా ఈ బడ్జెట్‌లో వచ్చే మూడేండ్లలో అన్ని జిల్లా దవాఖానల్లో డేకేర్‌ క్యాన్సర్‌ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు ఈ బడ్జెట్‌లో ప్రకటించింది. ఇందులో 200 సెంటర్లను ఈ ఆర్థిక సంవత్సరలోనే ఏర్పాటు చేయనున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. దీనిపై బొత్తిగా అవగాహనే లేకపోవటం, వైద్య పరీక్షలకు ప్రజలు ముందుకు రాకపోవటం, వైద్య చికిత్స కోసం ఖర్చు భరించే స్థోమత లేకపోవడం, ఇతర ప్రాంతాల్లోని ప్రభుత్వ దవాఖానలకు వెళ్లేందుకు గ్రామీణ రోగులు ఇష్టపడక సమీప ప్రాంతాల్లోనే తెలిసిన వైద్యుల వద్ద చికిత్స పొందటం వంటి కారణాల వల్ల క్యాన్సర్ మరణాలు ఏటికేడు పెరుగుతున్నాయి. అందుకే ఈ సమస్యను ప్రభుత్వం గుర్తించి, ఏటా విధిగా క్యాన్సర్ పరీక్షలు నిర్వహించే వ్యవస్థను తీసుకురాగలిగితే, 90 శాతం అవాంఛిత మరణాలను నివారించవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ దిశగా మన ప్రభుత్వాలు అడుగులు వేయాలని అశిద్దాం.

Exit mobile version