Site icon Prime9

Vijayawada Srisailam Sea plane: ఏపీ పర్యాటక, రవాణా రంగంలో సరికొత్త ఆవిష్కరణ.. విజయవాడ టూ శ్రీశైలం ఓ సీ ప్లేన్‌

Vijayawada Srisailam Sea plane start in Andhra Pradesh: దాదాపు 5,400 కిలోమీటర్ల సముద్రతీర ప్రాంతం.. గంగా, యమున, గోదావరి, కృష్ణా, కావేరి తదితర మహానదులు, సరస్సులు కలిగిన సువిశాల భూభాగం మన దేశం సొంతం. అయితే… ఎన్ని అవకాశాలు ఉన్నా, ప్రజల అవరాలకు అనుగుణంగా రవాణా సాధనాలు అందుబాటులో లేవు. ప్రపంచంలో అతిపెద్ద రైల్వే నెట్‌ వర్క్‌, రోడ్డు మార్గాలు కలిగినా, అత్యవసర సమయాల్లో అక్కరకు రావడం లేదు. ఈ సమస్యకు పరిష్కారం చూపి, రవాణా మార్గాలను సుస్సంపన్నం చేయడంతో పాటు పర్యాటక రంగానికి కొత్త హంగులు దిద్దేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ముందడుగు వేసింది. తొలిసారిగా సీ ప్లేన్‌ సర్వీసులను ప్రారంభిస్తూ దేశ రవాణా చరిత్రలో సరికొత్త విప్లవానికి నాంది పలుకుతోంది.

చంద్రబాబు డ్రీమ్‌ ప్రాజెక్టు

ప్రపంచ అభివృద్ధి ప్రక్రియలో రవాణా మార్గానిది కీలకపాత్ర. ఈ దేశంలో అయితే భూ, జల, వాయు రవాణా మార్గాలు పటిష్టంగా ఉంటాయో… ఆయా ప్రాంతాలు ప్రగతి పథంలో దూసుకు పోతుంటాయి. అయితే కొన్ని దేశాల్లో వనరులు లేక, పనామా కెనాల్‌ వంటి కృత్రిమ మార్గాలను అన్వేషిస్తుండగా.. అపరా జల వనరులు ఉన్న మన దేశంలో పరిస్థితి వీటికి భిన్నంగా ఉంది. సువిశాల తీర రేఖ, సమృద్ధిగా నదీ జలాలు, జలాశయాలు, పోర్టులు, ఎయిర్‌ పోర్టులు ఉన్నా… వాటిని వినియోగించుకొనే నాథుడే లేకపోయాడు. అన్ని ఉన్నా, అల్లుడి నోట్లో శని అన్నట్లు అన్ని వనరులు ఉన్నా, మనం వినియోగించుకోలేక పోతున్నాం. ఈ పరిస్థితికి స్వస్తి పలికి, ప్రజలకు అధునాతన రవాణా మార్గాలను అందించడంతో పాటు పర్యాటకంగా అభివృద్ధి పరిచేందుకు అటు కేంద్రం, ఇటు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించాయి. ఇందులో భాగంగా సీఎం నారా చంద్రబాబు డ్రీమ్‌ ప్రాజెక్టుగా భావిస్తున్న సీ ప్లేన్‌ విధానాన్ని రాష్ట్రంలో ప్రోత్సహించేందుకు రంగం సిద్ధం చేశారు. అనుకున్నదే తడవుగా కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రిగా ఉన్న శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడుతో కలిసి సీ ప్లేన్‌ విధానానికి శ్రీకారం చుట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. దీనికి అనుగుణంగా ఇన్నాళ్లూ అడ్డంకిగా ఉన్న వివిధ నిబంధనలను సరళీకరించారు. రాష్ట్ర యువతకు మరిన్ని ఉద్యోగాలు, సరికొత్త ఉపాధి మార్గాలు కల్పించేందుకు మార్గం ఏర్పరిచారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, పర్యాటక శాఖామంత్రి కందుల దుర్గేష్ సైతం దీనిపై ఆసక్తి చూపడంతో చకచకా పనులు ప్రారంభమయ్యాయి.

ఆహ్లాదం.. అత్యావసరం లోనూ…
సీ ప్లేన్‌ అంటే నీటి లోనూ, గాలి లోనూ ప్రయాణించే రవాణా సాధనం. కేవలం 2, 3 అడుగుల లోతు, 300 మీటర్ల వెడల్పున నీరు ఉంటే చాలు.. ఈ సీ ప్లేన్‌ లు సులభంగా టేకాఫ్‌ చేసి, కిందకు చేరుకోగలవు. రైలు, రోడ్డు మార్గాలు లేకపోవడంతో మన రాష్ట్రంలోని ఎన్నో గిరిశిఖర ప్రాంతాలు, నదీ తీరాల్లో ఇప్పటికీ ప్రజలు మైదాన ప్రాంతానికి చేరుకోవడానికి అవస్థలు పడుతున్నారు. నీటి వనరుల ఆధారంగా ఆయా ప్రాంతాల్లో సీ ప్లేన్‌ లను ఏర్పాటు చేయడం ద్వారా అత్యవసర సమయాల్లో ఉన్న వారిని సులభంగా ఆస్పత్రులు.. విశాఖ, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి వంటి నగరాలకు చేర్చవచ్చు. దీనితో పాటు ఆహ్లాదకరమైన ప్రయాణంతో పర్యాటకులను కూడా ఆకర్షించి, సులభంగా ఆదాయ మార్గాలను పెంపొందించుకోవచ్చు. గుజరాత్‌, తమిళనాడు తరువాత 972 కిలోమీటర్ల మేర సువిశాల సముద్ర తీరం… కృష్ణా, గోదావరి నదులు, డ్యామ్‌ లు కలిగి ఉన్న మన రాష్ట్రంలో. సీ ప్లేన్‌ విధానం ఎన్నో విధాలుగా ప్రయోజనాలు చేకూర్చుతుంది.

వివిధ దేశాల్లో పర్యాటకంగా…
అభివృద్ధి చెందిన చాలా దేశాల్లో పర్యటించే పర్యాటకులు… కొత్త అనుభూతి కోసం సీ ప్లేన్‌ లోనే విహరిస్తుంటారు. అమెరికా, బ్రిటన్‌, కెనడా, డెన్మార్క్‌, ఇటలీ, (గ్రీస్‌, మాల్టీవ్స్‌, న్యూజిలాండ్‌, ఆఫ్రేలియా తదితర దేశాల్లో ఈ తరహా సేవలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. మన దేశంలోని కేరళ, గుజరాత్‌ ఈ సీ ప్లేన్‌ సర్వీసులు ఉన్నా, వాటిని పర్యాటక పరంగానే పరిమితం చేస్తున్నారు. మన రాష్ట్రంలో ఈ సర్వీసులు ప్రారంభించడంతో అటు పర్యాటకాన్ని, ఇటు ప్రజా రవాణాను మెరుగు పరిచే లక్ష్యంగా ముందుడుగు వేస్తున్నామని సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు చెబుతున్నారు. తొలి విడతగా విజయవాడ – శ్రీశైలం మార్గాన్ని పరిశీలించి, అనంతర కాలంలో విశాఖపట్నం – శ్రీకాకుళం సముద్ర తీరం, రాజమండ్రి – గోదావరి నదీ పరీవాహకం, నాగార్జున సాగర్, దక్షిణ కోస్తా జిల్లాల్లో వీటిని తీసుకొచ్చేందుకు యోచిస్తున్నారు. తద్వారా ఈ రంగంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.

నిబంధనల సడలింపుతో…
కేంద్ర పార విమానయాన శాఖా మంత్రిగా శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడు బాధ్యతలు స్వీకరించిన అనంతరం రవాణా మార్గాలను మెరుగు పరిచేందుకు వివిధ చర్యలు చేపట్టారు. ఈ మేరకు ఇటు పర్యాటకం, అటు రవాణాకు ఉపయోగకరంగా నిలిచే విధంగా సీ ప్లేన్‌ కార్యకలాపాలకు సంబంధించిన నియమావళిని సరళతరం చేశారు. దేశంలోని మారుమూల ప్రాంతాలకు సైతం విమాన సర్వీసులు అందించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఉడాన్‌ పథకంలో సీ ప్లేన్‌ వ్యవస్థను చేర్చారు. దీనికి అనుగుణంగా విమానయాన శాఖ సరళీకృత సర్టిఫైడ్‌ ప్రకియను ప్రవేశ పెట్టారు. దీంతో డైరెక్టరేట్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ సడలించిన నిబంధనలతో వాటర్‌ డ్రోమ్‌ లైసెన్స్‌ లేకుండానే సీ ప్లేన్‌ లు సర్వీసులు నడిపే అవకాశం కల్పించారు. రాష్ట్రంతో పాటు దేశంలోని రవాణా మార్గాలు అంతగా అందుబాటులో లేని అస్సాం, అండమాన్‌ – నికోబార్‌, లక్షద్వీప్‌, హిమాచాల్‌ ప్రదేశ్‌, గోవా తదితర పర్యాటక ప్రాంతాలు సహా 18 మార్గాల్లో వాటర్‌ డ్రోమ్‌ సర్వీసులు ఏర్పాటు చేసే విధంగా విమానయాన శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

ట్రయల్‌ రన్‌ సక్సెస్‌…
ఈనెల  9నుంచి ప్రారంభం కానున్న విజయవాడ -శ్రీశ్లైలం సీ ప్లేన్‌ సర్వీసులకు సంబంధించి శుక్రవారం నిర్వహించిన ట్రయల్‌ రన్‌ విజయవంతమైంది. ప్రకాశం బ్యారేజ్‌ నుంచి ఎగిరి, శ్రీశైలం పాతాళగంగ బోటింగ్‌ పాయింట్‌ లో నిర్మించిన జెట్టీ వద్ద సురక్షితంగా ల్యాండ్‌ అయ్యింది. ఎస్టీఆర్‌ఎఫ్‌, పోలీసు, పర్యాటక శాఖ, ఎయిర్‌ ఫోర్స్‌ అధికారులు ట్రయల్‌ రన్‌ ను పరిశీలించారు.

మూడేళ్లలో 100 మార్గాల్లో…
దేశ ప్రజలకు విమాన ప్రయాణాన్ని మరింత అందుబాటులో ఉంచడంతో పాటు మారుమూల ప్రాంతాలకు సైతం సర్వీసులు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర పార విమానయాన శాఖామంత్రి  కింజరాపు రామ్మోహన్‌ నాయుడు అన్నారు. ఇందులో భాగంగా సీఎం చంద్రబాబునాయుడు సూచనల మేరకు ఆంధ్రప్రదేశ్‌ లో తొలిసారిగా సీ ప్లేన్‌ సర్వీసులను అందుబాటులోకి తీసుకు వస్తున్నామన్నారు. కమర్షియల్‌ పైలెట్‌ లైసెన్స్‌(సీపీఎల్‌) ఉన్న వారు నేరుగా సీ ప్లేన్‌ రేటింగ్స్‌ పొంది, సీ ప్లేన్‌ లను నిర్వహించే విధంగా నిబంధనలు సడలించామన్నారు. ఉడాన్‌ 2.0 కార్యచరణలో భాగంగా వచ్చే మూడేళ్లల్లో దేశవ్యాప్తంగా 100 మార్గాల్లో వీటిని విస్తరించి.. పర్యాటక, రవాణా రంగాలను పరిపుష్టం చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు.

Exit mobile version