Site icon Prime9

TS High Court: గురుకులాల్లో ఫుడ్‌పాయిజనింగ్.. ఆ శాఖ అధికారులు పనిచేస్తున్నారా.. లేదా? .. హైకోర్టు సీజే తీవ్ర వ్యాఖ్యలు

TS High Court Serious On Maganur ZP High School: నారాయణపేట జిల్లా మాగనూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించడంపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వారం వ్యవధిలో మూడుసార్లు భోజనం వికటిస్తే అధికారులు నిద్రపోతున్నారా? అంటూ హైకోర్టు సీజే జస్టిస్ అలోక్ అరాధే అసహనం వ్యక్తం చేశారు. ఇది చాలా సీరియస్ అంశమని సీజే ధర్మాసనం అభిప్రాయపడింది. కాగా, ఫుడ్ పాయిజన్‌‌పై సీనియర్ న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు బుధవారం విచారించింది.

అధికారులూ.. ఉన్నారా?
కళ్లముందు ఇంత ఘోరం జరుగుతున్నా సంబంధిత శాఖ అధికారులు ఎందుకు పట్టించుకోవటం లేదని హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘మీకు పిల్లలు లేరా? వారికీ ఇలాగే జరిగితే ఇలాగే పట్టించుకోకుండా ఉంటారా?’అని ప్రశ్నించింది. నాన్‌ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తే 5 నిమిషాల్లో ఎక్కడెక్కడి నుంచో పరిగెత్తుకుంటూ అధికారులంతా హాజరవుతారని చీఫ్ జస్టిస్ చురకలు అంటించారు. అధికారుల దారుణమైన నిర్లక్ష్యానికి ఇది నిదర్శనమని మండిపడింది. ప్రభుత్వంలో ఉన్న అధికారులు బాధ్యతతో, మానవతా దృక్పథంతో వ్యవహరించాలని తెలంగాణ హైకోర్టు హితవు చెప్పింది.

ఇంత నిర్లక్షమా?
ఫుడ్ పాయిజనింగ్ మీద దాఖలైన పిటీషన్‌‌ను విచారించే క్రమంలో ధర్మాసనం అడిగిన ప్రశ్నలకు.. ప్రభుత్వ న్యాయవాది చెప్పిన జవాబులపై ప్రధాన న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. వరుసగా ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు వెలుగులోకి వస్తున్నా, ప్రభుత్వం స్పందించదా? అని సీజే ప్రభుత్వం తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. దీనికి బదులిస్తూ.. ఈ ఘటనపై వారంలో కౌంటర్ దాఖలు చేస్తామని ప్రభుత్వ న్యాయవాది బదులిచ్చారు. ఆయన జవాబు విని సీజే మండిపడ్డారు. జిల్లా కేంద్రంలోని అధికారిని సంప్రదించి వివరాలు సేకరించడానికి వారం రోజుల గడువు దేనికి? అని నిలదీశారు. హైకోర్టు పట్టించుకుని ఆదేశాలు ఇస్తేనే అధికారులు పనిచేస్తారా? అని ప్రశ్నించారు. దీంతో భోజన విరామం తర్వాత ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అందిస్తామని హైకోర్టుకు ఏఏజీ తెలిపారు.

ఫుడ్ శాంపిల్స్ ల్యాబ్‌కు పంపండి
ఈ పిటిషన్‌పై మధ్యాహ్న భోజన విరామం తర్వాత మరోసారి హైకోర్టు విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా అస్వస్థతకు గురైన పిల్లలు బయటి చిరుతిళ్లు తిన్నారని ఏఏజీ కోర్టుకు తెలిపారు. అస్వస్థతకు గురైన వారిని ఆస్పత్రికి తరలించామని, బాధ్యులపై చర్యలు తీసుకున్నామని తెలిపారు. కాగా, భోజనం వికటించిన అన్ని పాఠశాలల్లో మధ్యాహ్న భోజనపు శాంపిల్స్ సేకరించి, ల్యాబ్‌కు పంపించి సోమవారం నాటికి నివేదికను సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ ఘటనలకు బాధ్యులైన అధికారుల మీద చర్యలు తీసుకోవాలని సూచిస్తూ తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

వారంలో వరుస ఘటనలు..
నారాయణపేట జిల్లా మాగనూరు జడ్పీ పాఠశాలలో ఈ నెల 20న ఫుడ్‌ పాయిజనింగ్‌ కారణంగా వంద మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీనిపై విచారణ జరిగిన తర్వాత ఇదే స్కూలులో మంగళవారం నాడు మళ్లీ స్కూల్‌లో మధ్యాహ్న భోజనం చేయగానే 30మంది పిల్లలు వాంతులు, తలనొప్పి, కడుపు నొప్పి బారిన పడగా, వారిని మక్తల్‌ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సీఎం రంగంలోకి దిగి మండల విద్యాధికారి, జిల్లా విద్యాధికారితోపాటు పలువురుని సస్పెండ్ చేయగా, మరికొంతమంది ఉన్నతాధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. జిల్లా అడిషనల్ కలెక్టర్ స్వయంగా పాఠశాలను సందర్శించారు. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టి, వంట ఏజెన్సీని తొలగించారు. ఇదిలా ఉండగా, ఆసిఫాబాద్ జిల్లాలోని వాంకిడి గురుకుల పాఠశాలలో 60 మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం కారణంగా అస్వస్థతకు లోనయ్యారు. ఈ ఘటనలో చౌదరి శైలజ అనే బాలిక పరిస్థితి విషయమించగా, ఆమెను తొలుత మంచిర్యాల ప్రైవేట్ ఆసుపత్రికి, ఆనక హైదరాబాద్ నిమ్స్‌కు తరలించినా ఆమె ప్రాణాలు కోల్పోయింది.

పది నెలల్లో పలు ఘటనలు.!

జనవరి 22 : నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి ఎస్సీ గురుకులంలో 9వ తరగతి విద్యార్థిని భార్గవి ప్రార్థన సమయంలో కింద పడిపోయింది. దవాఖానకు తరలించే సమయానికే ఆమె కన్నుమూసింది.

ఫిబ్రవరి 4 : భువనగిరి పట్టణంలోని ఎస్సీ గురుకులంలో పదో తరగతి చదివే హబ్సీగూడకు చెందిన బాలికలు భవ్య, వైష్ణవి ఒకేరోజు ఆత్మహత్య చేసుకున్నారు.

ఫిబ్రవరి 10 : సూర్యాపేటలో జిల్లా ఇమాంపేట ఎస్సీ గురుకులంలో ఇంటర్‌ సెకండియర్‌ విద్యార్థిని వైష్ణవి అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయింది. సరిగ్గా.. వారానికి ఫిబ్రవరి 18న ఇదే గురుకులపు విద్యార్థి అస్మిత ఇంటివద్ద బలవన్మరణానికి పాల్పడింది.

ఏప్రిల్‌ 16 : భువనగిరి సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో ఫుడ్‌పాయిజన్‌తో విద్యార్థి ప్రశాంత్‌ చనిపోగా, భువనగిరి జిల్లాలోని బొమ్మలరామారం, గుండాల, భువనగిరి, వలిగొండ, మోటకొండూరు హాస్టళ్లలో ఫుడ్‌ పాయిజన్‌ కేసులు నమోదయ్యాయి.

జూలై 12 : కొత్తగూడెం జిల్లాలోని ఎస్సీ గురుకుల పాఠశాలలో సుజాతనగర్‌ మండలం గరీబ్‌పేటకు చెందిన 5వ తరగతి విద్యార్థి బుర్ర లిడి యా (12) జ్వరంతో ఇంటికి వెళ్లింది. తర్వాత ఊహించని రీతిలో ఆమె ఉరేసుకుంది.

ఆగస్టు 8 : పాలమూరు జిల్లా మహ్మదాబాద్‌ మండలం నంచర్ల బాలికల గురుకుల హాస్ట‌ల్‌లో పుడ్‌ పాయిజనింగ్‌తో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఇదేరోజు ములుగు జిల్లా కేంద్రంలోని సోషల్‌ వెల్ఫేర్‌ బాలికల గురుకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి బాలిక కొయ్యడ కార్తీకశ్రీ స్కూలు భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది.

ఆగస్టు 9 : జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం పెద్దాపూర్‌ గురుకుల పాఠశాలలో ఆరో తరగతి విద్యార్థి అడ్మాల అనిరుద్‌ (11) చనిపోయాడు. అదే తరగతికి చెందిన విద్యార్థులు హేమంత్‌, మొండి మోక్షిత్‌ అస్వస్తతకు గురయ్యారు. జూలై 26న ఇక్కడే మెట్‌పల్లి మండలం అరపేటకు చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థి అద్వైత్‌ అస్వస్థతకు గురై మృతిచెందాడు.

అక్టోబర్‌ 30 : కొమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా వాంకిడి గురుకుల పాఠశాలలో ఫుడ్‌ పాయిజన్‌తో 60మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనలో చౌదరి శైలజ అనే విద్యార్థి చికిత్స పొందుతూ మృతి చెందింది.

నవంబర్ 20 : నారాయణపేట జిల్లా మాగనూరు జడ్పీ పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేసిన పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. 30మంది విద్యార్థులు వాంతులు, తలనొప్పి, కడుపు నొప్పితో బాధపడగా, వారిని మక్తల్‌ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు.

Exit mobile version