Site icon Prime9

Kazipet Coach Factory: గుడ్ న్యూస్ చెప్పిన ఎన్డీయే ప్రభుత్వం.. కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ

Kazipet Coach Factory as Manufacturing Unit: విభజన హామీల విషయంలో కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ఎట్టకేలకు మరో వాగ్దానాన్ని నిలబెట్టుకుంది. కాజీపేటలో రైల్వే తయారీ యూనిట్(ఆర్‌ఎంయు) ఏర్పాటు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు కాజీపేటలో ఉన్న ఓవర్ హాలింగ్ వర్క్‌షాప్‌ను కేంద్ర రైల్వేశాఖ అప్‌గ్రేడ్ చేస్తున్నట్లుగా దక్షిణ మధ్య రైల్వే జీఎంకు నిరుడు జులై 5న రైల్వే బోర్డు లేఖ రాసింది. అప్‌గ్రేడ్‌ చేసిన యూనిట్‌లో ఎల్‌హెచ్‌బీ, ఈఎంయూ కోచ్‌లు తయారు చేసేందుకు అనుగుణంగా యూనిట్‌ని అభివృద్ధి చేయాలని ఈ ఏడాది సెప్టెంబరు 9న రైల్వే బోర్డు ఆదేశాలిచ్చింది. కాజీపేట రైల్వో మ్యానుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌లో ఎల్‌హెచ్‌బీ, ఈఎంయూ కోచ్‌ల తయారీకి సౌకర్యాలను అభివృద్ధి చేయడానికి ప్రణాళిక రూపొందించాలని రైల్వే బోర్డు సూచించింది. విభజన హామీల అమలుపై తెలంగాణ అధికారులు, కేంద్ర అధికారులతో హోం శాఖ నిర్వహించిన భేటీలో ఈ విషయం వెల్లడైంది. దీంతో రాష్ట్ర విభజన సందర్భంగా 2014లో విభజన చట్టంలో భాగంగా ఇచ్చిన హామీ మరో అడుగు ముందుకు పడినందుకు తెలంగాణ వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

అనేక పరిమితులు దాటి..
వాస్తవానికి రాష్ట్ర విభజనకు ముందునుంచే కాజీపేటలో కోచ్‌ ఫ్యాక్టరీ కావాలనే డిమాండ్ ఉంది. దానిని విభజన చట్టంలో ప్రస్తావించిన తర్వాత అది తెలంగాణ డిమాండ్‌గా మారింది. ఈ ఫ్యాక్టరీ కోసం నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం 150 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. అయితే 2017లో దేశంలో కొత్త కోచ్‌ ఫ్యాక్టరీల అవసరం లేదని కేంద్రం ప్రకటించటం, తన ప్రకటనకు భిన్నంగా 2018 ఏప్రిల్‌లో మహారాష్ట్రలోని లాతూర్‌లో కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ఆమోదంతో పాటు రూ.625కోట్ల బడ్జెట్‌ను కేటాయించటంతో కేటాయించటంతో కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు అంశం మరోసారి వార్తల్లోకి వచ్చింది. వాస్తవానికి 2019లోనే కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్‌ గోయెల్‌ దీనిపై స్పష్టతనిచ్చారు. కాజీపేటలో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటుకు అవకాశం లేదని లోక్‌సభ వేదికగా వెల్లడించారు. అయినా… రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఈ అంశాన్ని ప్రధాని, కేంద్ర మంత్రుల దృష్టికి తెస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో నిరుడు జూలై 8న ప్రధాని మోదీ కాజీపేటలో 160 ఎకరాల్లో రైల్వే వ్యాగన్‌ తయారీ పరిశ్రమకు భూమిపూజ చేశారు. 2025లోగా పూర్తయ్యేలా రూ.521కోట్లను దీనికి కేటాయించారు. అయితే, తాము 60 వేల మందికి ఉపాధినిచ్చే కోచ్ ఫ్యాక్టరీ అడిగితే.. మోదీ 2 వేల మందికి పనికల్పించే పీరియాడికల్​ ఓవర్​ హాలింగ్​ సెంటర్​ ఇచ్చారని, ఇందులో కేవలం వ్యాగన్లు శుభ్రం, మరమ్మతులు మాత్రమే చేస్తారనే విమర్శలు వినిపించాయి. కాగా, తాజా నిర్ణయంతో వారు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

డివిజన్‌ హోదా ఎప్పుడో?
రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకు రైల్వే కనెక్టివిటీ తక్కువ కావటంతో రాష్ట్రంలో కొత్త రైల్వే లైన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు వెళ్లాయి. ఈ క్రమంలోనే కాజీపేట డివిజన్‌ అంశం తెరమీదికొచ్చింది. కాజీపేట మీదుగా ఉత్తర, మధ్య భారతదేశానికి రైళ్లు నడుస్తున్నాయి. కాజీపేట, వరంగల్‌ స్టేషన్ల మీదుగా నిత్యం సుమారు 200కు పైగా గూడ్స్‌, ప్యాసింజర్‌ రైళ్లు నడుస్తున్నాయి. వీటితో పాటు భూపాలపల్లి, గోదావరిఖని, మణుగూరు, కొత్తగూడెం తదితర ప్రాంతాల్లో ఉన్న బొగ్గు రవాణా కాజీపేట మీదుగానే జరుగుతోంది. ఎక్కువ ఆదాయం వచ్చే జంక్షన్లలో కాజీపేట ముందంజలో ఉంది. తెలంగాణలో ప్రస్తుతం హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ రైల్వే డివిజన్లు ఉన్నాయని, కాజీపేట సికింద్రాబాద్‌ డివిజన్‌కు అతి సమీపంలో ఉండటంతో కాజీపేటకు ప్రత్యేక డివిజన్‌ ఇవ్వలేమని కేంద్రం చెప్పింది. అయితే, విజయవాడకు కేవలం 30కి.మీ. దూరంలోనే ఉన్న గుంటూరును డివిజన్‌ చేసినప్పుడు సికింద్రాబాద్‌కు 120కి.మీ. దూరంలో ఉన్న కాజీపేటను ఎందుకు డివిజన్‌ చేయరు? అని ప్రశ్నలు వచ్చాయి. దీంతో ఇక్కడ కోచ్ ఫ్యాక్టరీ మంజూరుకు కేంద్రం ముందుకు వచ్చింది.

రైల్వే కనెక్టివిటీ ..
భారతీయ రైల్వేలోని 17 జోన్లలో దక్షిణ మధ్య రైల్వే జోన్‌ ఆదాయంలో ముందుంది. అయితే, ఇక్కడ రైల్వే కనెక్టివిటీ చాలా తక్కువగా ఉంది. కానీ… జోన్‌ పరిధిలో కోచ్‌ ఫ్యాక్టరీలు, ఓవర్‌హాలింగ్‌ వర్క్‌షాప్‌లు లేవు. దక్షిణ మధ్య రైల్వే జోన్‌కు అవసరమైన ప్యాసెంజర్‌ కోచ్‌లను పెరంబుదూరు ఇంటెగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీని నుంచి తెప్పించుకుంటున్నారు. ఈ దృష్ట్యా ఇక్కడ కోచ్‌ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలంటూ 1969 తెలంగాణ ఉద్యమ కాలం నుంచే డిమాండ్‌ ఉంది.

Exit mobile version