Site icon Prime9

TG Assembly Session: నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు.. కీలక అంశాలపై చర్చ

Telangana Assembly Session 2024: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి నేటికీ ఏడాది కావొస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహిస్తుంది. ఈ తరుణంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ సమావేశాల్లోనే ప్రధానంగా కొత్త రెవెన్యూ చట్టం, విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు, థర్మల్ పవర్ ప్లాంటుపై న్యాయ విచారణ కమిషన్ ఇచ్చిన నివేదిక, ఫోన్ ట్యాపింగ్ తదితర అంశాలను చర్చకు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఇందులో ప్రధానంగా విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందం విషయంలో జరిగిన అవకతవకలపై కమిషన్ ఇచ్చిన రిపోర్టును కాంగ్రెస్ సర్కార్ సభలో ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు గత బీఆర్ఎస్ ప్రభుత్వ తీరుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే, ఫోన్ ట్యాపింగ్ విషయంలోనూ కేసు పురోగతి, అడ్డంకులు, గత పాలకుల వ్యవహారాలను అసెంబ్లీ వేదికగా ప్రజలకు వివరించేందుకు కాంగ్రెస్ సిద్ధమైనట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా, కాంగ్రెస్ పార్టీని ధీటుగా ఢీకొట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ కూడా సిద్ధమవుతోంది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలును నిలదీసేందుకు ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఆదివారం ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. అంతకుముందు జరిగిన సమావేశంలో ధీటుగా అధికార పార్టీకి సమాధానాలు చెప్పారని, ఇప్పుడు కూడా అదే స్థాయిలో నిలదీయాలని సూచించినట్లు సమాచారం.

Exit mobile version