Teacher MLC: టీచర్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక.. మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే గోపీ మూర్తి విజయం

Gopi Murthy won in Teacher MLC elections: ఏపీలోని కాకినాడ జేఎన్డీయూలో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు ముగిసింది. ఈ బైఎలక్షన్‌లో యూటీఎఫ్ అభ్యర్ధి గోపీ మూర్తి విజయం సాధించారు. ఆయన మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులోనే గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు.

ఈ పోటీలో ఐదుగురు అభ్యర్థులు నిల్చున్నారు. ఇందులో గంధం నారాయణరావు, దీపక్ పులుగు, డాక్టర్ నాగేశ్వరరావు కవల, నామన వెంటకలక్ష్మి, బొర్రా గోపీమూర్తి ఉన్నారు. ఈ ఎన్నికల్లో గెలిచిన గోపీ మూర్తి.. రెండేళ్ల 2 నెలలపాటు పదవిలో కొనసాగనున్నారు. అయితే ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో ఈ ఉపఎన్నిక నిర్వహించారు.

అంతకుముందు జేఎన్టీయూలోని అంబేద్కర్ కేంద్ర గ్రంథాలయంలో జరుగుతున్న ఓట్ల కౌంటింగ్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ షాన్మొహన్, ఎస్పీ విక్రాంత్ పాటిల్ పరిశీలించారు. మొత్తం 9 రౌండ్లలో లెక్కింపు కోసం 14 టేబుళ్లను ఏర్పాటు చేశారు. కాగా, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, పశ్చిమ గోదావరి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో పోలింగ్ జరగగా.. ఇందులో మొత్తం 15,495 మంది ఓటును వినియోగించుకున్నారు.