Site icon Prime9

Vizianagaram: రిటైరైన టీచర్‌ను వెళ్లొద్దని బతిమాలుకున్న విద్యార్థులు.. రామభద్రపురం పూడివీధి స్కూల్‌లో భావోద్వేగ ఘటన

Students Emotional on Teacher Retirement School in Vizianagaram: మన సమాజంలో ఉపాధ్యాయులు, విద్యార్థులకు మధ్య ఉండే అనుబంధమే వేరు. తల్లిదండ్రుల తర్వాత విద్యార్థులకు దగ్గరగా ఉండేది టీచర్లే. విద్యార్థులకు ఏం కావాలి? చదువుతో బాటు వారికి ఏమి నేర్పిస్తే వాళ్లు రాణిస్తారు? అనేది తల్లిదండ్రులకంటే టీచర్లకే బాగా తెలుస్తుంది. ఈ ప్రయాణంలో టీచర్లతో విద్యార్థులకు ఏర్పడే అనుబంధం.. మాటల్లో చెప్పలేనిది. మరి.. అలాంటి తమ ఫేవరెట్ టీచరమ్మ ఉన్నట్టుండి తమను వీడి వెళ్లిపోతుంటే, ఆ చిన్నారులు తట్టుకోలేకపోయారు. వెళ్లొద్దంటూ కాళ్లమీడ పడి కన్నీటితో వేడుకున్నారు.

రామభద్రపురంలో..
విజయనగరం జిల్లా రామభద్రపురం, పూడివీధిలోని ప్రాథమిక పాఠశాలలో హెడ్మాస్టర్‌గా పనిచేస్తున్న విజయ గౌరి ఇటీవల ఆమె వాలంటరీ రిటైర్‌మెంట్ తీసుకున్నారు. రాబోయే ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలుగా ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. గురువారం ఎప్పటిలాగే బడికి వచ్చిన ఆ టీచర్.. అసలు విషయం చెప్పటంతో బడిలోని విద్యార్థులంతా బోరుమని విలపిస్తూ… వెళ్లొద్దంటూ కాళ్లావేళ్లాపడ్డారు. వారందరినీ ఆమె సముదాయించటంతో అతి కష్టమ్మీద విద్యార్థులు తమాయించుకుని, కన్నీటి వీడ్కోలు పలికారు.

మళ్లీ వస్తా.. మీతో మాట్లాడతా
తన నిర్ణయంతో తీవ్ర భావోద్వేగానికి గురైన విద్యార్థులను చూసి ఉపాధ్యాయురాలు విజయ గౌరి కూడా కన్నీటి పర్యంతమయ్యారు. పదవీ విరమణ తర్వాత కూడా పాఠశాలకు వచ్చి, విద్యార్థుల బాగోగులు చూసుకుంటానని ఆమె హామీ ఇచ్చారు. 2023 జూన్ నుంచి ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలుగా పని చేస్తున్న విజయ గౌరి, ఎప్పటికప్పుడు చదువులో వెనబడిన విద్యార్థుల మీద శ్రద్ధ పెట్టటం, క్రీడా పోటీలు నిర్వహించటం, జాతీయ పండుగల వేళ.. వివిధ ప్రాజెక్టుల్లో పాల్గొనేలా విద్యార్థులను ప్రోత్సాహించటం, విద్యార్ధుల అభిరుచికి అనుగుణంగా వారిని పలు పోటీలకు పంపటం వంటి పలు అంశాలలో చొరవ తీసుకోవటంతో ఆమె అనతి కాలంలోనే అక్కడి విద్యార్థులందరికీ ఫేవరెట్ టీచర్‌గా మారారు.

Exit mobile version