Stock Markets: భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. కారణమేంటంటే?

అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలతో కూడా సోమవారం ఉదయం సూచీలు లాభాలతో ట్రేడింగ్‌ ప్రారంభించాయి. అయితే, కాసేపటికే నష్టాల్లోకి జారుకున్న మార్కెట్లు సమయం గడుస్తున్న కొద్దీ అంతకంతకూ దిగజారాయి.

Stock Markets: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం భారీ నష్టాలతో ముగిశాయి. వరుసగా మూడో రోజూ మార్కెట్లు నష్టాలను చవిచూశాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలతో కూడా సోమవారం ఉదయం సూచీలు లాభాలతో ట్రేడింగ్‌ ప్రారంభించాయి. అయితే, కాసేపటికే నష్టాల్లోకి జారుకున్న మార్కెట్లు సమయం గడుస్తున్న కొద్దీ అంతకంతకూ దిగజారాయి.

ఇంట్రాడే గరిష్ఠాల నుంచి సెన్సెక్స్‌ ఏకంగా 1200 పాయింట్లకు పైగా నష్టపోయింది. మరో వైపు నిఫ్టీ.. ఫిబ్రవరి నెల కనిష్ఠం కంటే కిందకు దిగజారింది.

అమెరికాలో సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌ పతనం, సిగ్నేచర్‌ బ్యాంక్‌ మూసివేతతో ప్రపంచ మార్కెట్ల సెంటిమెంట్‌ తీవ్రంగా బలహీనపడింది.

ఈ సంక్షోభం తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందోననే సందేహాలు మదుపర్లను కలవరపరుస్తున్నాయి.

 

లాభాలతో ప్రారంభమై(Stock Markets)

ఉదయం సెన్సెక్స్‌ 59,033.77 దగ్గర లాభాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 58,094.55 దగ్గర కనిష్ఠాన్ని తాకింది. చివరకు 897.28 పాయింట్ల నష్టంతో 58,237.85 దగ్గర స్థిరపడింది.

నిఫ్టీ 17,421.90 దగ్గర ప్రారంభమై 17,113.45 దగ్గర కనిష్ఠానికి చేరింది. చివరకు 258.60 పాయింట్లు నష్టపోయి 17,154.30 దగ్గర ముగిసింది.

మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.11 దగ్గర నిలిచింది.

సెన్సెక్స్‌ 30 సూచీలో టెక్‌ మహీంద్రా మినహా అన్ని షేర్లు నష్టాల్లో ముగిశాయి.

అత్యధికంగా నష్టపోయిన వాటిలో ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ, టాటా మోటార్స్‌, ఎంఅండ్‌ఎం,

బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, రిలయన్స్‌, ఏషియన్‌ పెయింట్స్‌ షేర్లు ఉన్నాయి.

 

సిలికాన్ వ్యాలీ బ్యాంక్ ప్రభావంతో

సిలికాన్ వ్యాలీ బ్యాంక్ ప్రభావంతో బ్యాంకింగ్‌ రంగ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. బ్యాంక్‌ నిఫ్టీ దాదాపు 850 పాయింట్ల మేర నష్టపోయింది.

ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 7.33 శాతం, ఎస్‌బీఐ 3.15 శాతం, యాక్సిస్‌ బ్యాంక్‌ 2.11 శాతం వరకు నష్టపోయాయి.

సీఎస్‌ ఇండస్ట్రియల్‌ సర్వీసెస్‌లో వాటాను కొనుగోలు చేసేందుకు ఎల్గీ ఎక్విప్‌మెంట్స్‌ అమెరికా యూనిట్‌ ఒప్పందం కుదుర్చుకొంది.

దీంతో ‘ఎల్గీ’ షేరు ఈరోజు 1.81 శాతం లాభపడి రూ. 477.50 వద్ద స్థిరపడింది.

అదానీ గ్రూప్‌నకు చెందిన 10 నమోదిత కంపెనీల్లో ఐదు షేర్లు అప్పర్‌ సర్క్యూట్‌ని తాకాయి. మిగిలినవన్నీ నష్టపోయాయి.

బలహీన మార్కెట్‌లోనూ అదానీ గ్రీన్‌ ఎనర్జీ, అదానీ పవర్‌, అదానీ టోటల్‌ గ్యాస్‌, అదానీ ట్రాన్స్‌మిషన్‌ అప్పర్‌ సర్క్యూట్‌ని తాకడం గమనార్హం. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ 1.49 శాతం నష్టపోయింది.

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు ఇంట్రాడేలో 1.8 శాతానికి పైగా నష్టపోయి రూ. 2,281 వద్ద 52 వారాల కనిష్ఠాన్ని తాకింది. చివరకు 1.65 శాతం నష్టపోయి రూ. 2,284 వద్ద స్థిరపడింది.

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా విధించిన మూడేళ్ల లాకిన్‌ గడువు నేటితో ముగిసిన నేపథ్యంలో యెస్‌ బ్యాంక్‌ షేర్లు నష్టాల్లో ట్రేడయ్యాయి.

ఉదయం ఓ దశలో షేరు 12 శాతం నష్టపోయి 14.40 దగ్గర కనిష్ఠాన్ని తాకింది. చివరకు 4. 85 శాతం నష్టపోయి రూ.15.70 దగ్గర స్థిరపడింది.