Site icon Prime9

Sharmila: అదానీ విద్యుత్ కేసులో జగన్‌ లంచాలు.. విచారణ చేసి నిజాలు బయటపెట్టండి

Sharmila Complaints against jagan to ACB: ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అదానీ విద్యుత్ ఒప్పందంలో భాగంగా జరిగిన అవినీతి మీద విచారణ చేసి, నిందితులెవరో బయటపెట్టాలని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి గురువారం అవినీతి నిరోధక శాఖకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. అదానీ సోలార్ ఒప్పందంపై నిజాలు నిగ్గు తేల్చాలని ఏసీబీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఆంధ్రలో అవినీతి జరిగితే అమెరికాలో బయట పడిందన్నారు. ఈ ఒప్పందంలో భాగంగా చేతులు మారిన రూ.1750 కోట్ల లంచంమీద అమెరికాలో ఛార్జ్‌షీట్ వేయటంతో బాటు విచారణకు రంగం సిద్ధమైందన్నారు.

టీడీపీ మౌనం దేనికి ?
సెకి ఒప్పందంలో జగన్‌ అవినీతిపై అన్ని ఆధారాలూ ఉన్నప్పటికీ, ఈ అంశంపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సిద్ధం కావటం లేదని షర్మిల ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో కాకినాడ, కృష్ణపట్నం పోర్టులను బలవంతంగా రాయించుకోగా, గంగవరం పోర్టును పూర్తిగా అమ్మేశారని ఆరోపించారు. ఈ అంశాలపై సమగ్ర విచారణ జరిపించి చర్యలు తీసుకోవటంతో బాటు సెకితో ఒప్పందాలపై లోతుగా పరిశీలన చేయాలని కేంద్ర విద్యుత్తు నియంత్రణ సంస్థకు లేఖ రాయనున్నట్లు ప్రకటించారు. అలాగే.. అదానీ విద్యుత్ కొనుగోలు వ్యవహారం మీద 2021లో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ హైకోర్టులో పిటీషన్ కూడా వేసిందని, ఇదొక కుంభకోణమని అప్పట్లో నేటి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఆరోపణలు చేశారని షర్మిల గుర్తుచేశారు. ఈ ఒప్పందం వల్ల అటు జగన్‌కు ఎలాంటి నష్టం లేదని, అలాగే నాడు దీనిపై కోర్టుకెక్కిన కేశవ్‌ మీదా ఎలాంటి భారమూ పడదని, కానీ, అంతిమంగా ఈ బరువంతా సామాన్య ప్రజల మీద పడక తప్పదని, కనుక ఇకనైనా ఆర్థిక మంత్రి పయ్యావుల దీనిపై స్పందించాలన్నారు.

జగన్‌ అతి తెలివితేటలు..
ఈ కేసు విషయంలో మాజీ సీఎం జగన్ అతి తెలివి ప్రశ్నలు వేస్తున్నారని షర్మిల మండిపడ్డారు. ఈ ఒప్పందం మీద జరుగుతున్న వివాదంలో ఎక్కడా తన పేరు లేదని, ఇది ఒక సంస్థకు, ప్రభుత్వానికి మధ్య జరిగిన ఒప్పందమని చెప్పటం మీద ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. 2021లో ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన తప్ప మరెవరు దీనికి బాధ్యులని మండిపడ్డారు. ‘ఆయనది అతితెలివా? వెర్రితనమా? ఇలాగే మాట్లాడితే ఇలాంటి వెర్రివాడా ఐదేళ్లు రాష్ట్రాన్ని పాలించింది’ అని ఎద్దేవా చేశారు. ఒకప్పుడు సోలార్ పవర్ యూనిట్ కి 10 రూపాయలు ఉండేది. ఇప్పుడు యూనిట్ ధర 1.99 పైసలకు తగ్గింది. రేపు 50 పైసలకే వచ్చినా తగ్గొచ్చు. సోలార్ పవర్ రెట్లు తగ్గుంటుంటే.. మీరు ఎలా 25 ఏళ్లకు అగ్రిమెంట్ చేశారు ? 2.49 పైసలకు కొని రాష్ట్రం నెత్తిన లక్ష కోట్ల భారం ఎందుకు భారం మోపారు. అని వైఎస్ షర్మిల ప్రభుత్వం పై ప్రశ్నల వర్షం కురిపించారు. స్వయం ప్రతిపత్తి గల ఏసీబీని టీడీపీ పంజరంలో చిలకగా మార్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్‌లో అదానీ స్కాంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చర్చకు తెచ్చారని గుర్తుచేశారు.

Exit mobile version