R Krishnaiah to File Nomination for Rajya Sabha Elections: బీజేపీ నుంచి రాజ్యసభకు ఆర్.కృష్ణయ్య నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఏనాడూ పార్టీలు మారలేదని, పార్టీలే తన వద్దకు వస్తున్నాయని చెప్పారు. ప్రస్తుతం తన సేవలను గుర్తించి బీజేపీ అధిష్టానం తనకు ఈ అవకాశం ఇచ్చిందని వెల్లడించారు. బీసీలకు న్యాయం జరగాలంటే.. కేవలం బీజేపీతోనే సాధ్యమని, అందుకే బీసీల ప్రయోజనం కోసం బీజేపీ చేరినట్లు స్పష్టం చేశారు. బీసీల కోసం ఎంతదూరమైనా వెళ్తానని, తనకు అవకాశం ఇచ్చిన ప్రధాని మోదీకి ధన్యవాదములు తెలిపారు.
బీసీలకు ఏం చేయాలన్న కూడా కేంద్రం సాయం తప్పనిసరిగా అవసరమని బీసే నేత ఆర్.కృష్ణయ్య అన్నారు. 50 ఏళ్లుగా బీసీలకు చేస్తున్న సేవలకు గాను పార్టీలు గుర్తిస్తున్నాయన్నారు. ముఖ్యంగా బీసీలు చదువుకోవాలని, ఉద్యోగాల్లో వాటా రావాలని, బీసీలకు అన్ని రంగాల్లో వాటా రావాలని పోరాటం చేస్తున్నామన్నారు. అందులో భాగంగానే నా సేవలను గుర్తించి పార్టీలే నా దగ్గరకు వస్తున్నాయని వెల్లడించారు.
అంతకుముందు 2014లో చంద్రబాబు.. తెలంగాణ సీఎం అభ్యర్థిగా ప్రకటించి ఆహ్వానించారన్నారు. ఆ తర్వాత వైసీపీ అధినేత జగన్.. సేవలను గుర్తించి రాజ్యసభలో పదవి ఇచ్చారన్నారు. అందులో రెండేళ్లు ఉన్నానని.. ఇంకా నాలుగేళ్ల పీరియడ్ ఉందన్నారు. అయితే పోరాటం చేసేందుకు సరైన వేదిక కాదని, సమయం కూడా ఇవ్వడం లేదని చెప్పుకొచ్చారు.
దేశ వ్యాప్తంగా ఉన్న బీసీల కోసం పోరాటం చేసి విజయం సాధిస్తానని కృష్ణయ్య అన్నారు. ప్రస్తుతం బీసీలకు ఏం చేయాలన్నా బీజేపీతోనే సాధ్యమన్నారు. ఇటు తెలంగాణ, అటు ఏపీలోనూ బీసీలకు న్యాయం చేస్తామని వెల్లడించారు. బీసీల ప్రయోజనాల కోసం ఎంతవరకైనా వెళ్తానని చెప్పారు. చట్ట సభల్లో రిజర్వేషన్ల కోసం ప్రయత్నిస్తానన్నారు.
ఇదిలా ఉండగా, అచ్చెన్నాయుడు బీజేపీ నామినేషన్ వేసిన కృష్ణయ్య, మస్తాన్ రావు, సతీష్‌లకు పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలిపారు. బీసీలకు టీడీపీ ఎప్పుడూ పెద్దపీట వేస్తుందన్నారు. ఇప్పుడు కూడా ఇద్దరు బీసీలకు అవకాశం కల్పించామన్నారు. ఆర్.కృష్ణయ్య అంటే జాతీయ బీసీ నాయకుడు అని, ఆయనపై కామెంట్స్ చేసే వాళ్లకు బుద్ధి, తెలివి లేదన్నారు.