Minister Uttam Kumar reddy Convoy Accident in the Urs for John Pahad: తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాన్వాయ్‌కు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మంత్రి ఉత్తమ్ తృటిలో తప్పించుకున్నాడు. నల్గొండ జిల్లాలోని హుజూర్ నగర్ నుంచి జాన్ పహాడ్ ప్రాంతానికి ఉర్సు ఉత్సవాల సందర్భంగా బయలుదేరారు. ఈ సమయంలో మంత్రి కాన్వాయ్ నడుపుతున్న డ్రైవర్ సడెన్ బ్రేక్ వేశాడు. దీంతో ఒక్కసారిగా వాహనాలు ఒకదానికొకటి వరుసగా ఢీకొట్టుకున్నాయి.
గడిడేపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అభివాదం తెలుపుతున్న సమయంలో డ్రైవర్ ను మంత్రి ఆపాలని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే కొంచెం వేగంగా వెళ్తున్న కారును డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడంతో వెనక వస్తున్న 8 కార్లు బలంగా ఢీకొట్టాయి. ఈ ప్రమాదంలో మంత్రి ఉత్తమ్ సురక్షితంగా బయటపడ్డాడు. అలాగే ఎవరికి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
అక్కడ కాంగ్రెస్ నాయకులు ఒక్కసారిగా గుమిగూడారు. ఈ ప్రమాదంలో మంత్రికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో కాంగ్రెస్ నాయకులు, అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అందరికీ అభివారం చేసి మంత్రి అక్కడినుంచి వెళ్లిపోయారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్ అంతరాయాన్ని క్లియర్ చేశారు. అయితే ఈ ప్రమాదంలో కార్లు ధ్వంసమయ్యాయి.
కాగా, ఈ ప్రమాదం జరిగిన అనంతరం మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు. అనంతరం ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. బావుంది.. ఇబ్బంది ఏమీ లేదు అంటూ ఉత్తమ్ కోమటిరెడ్డితో చెప్పారు.