Maha Kumbh stampede twenty members died: యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళాకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. మౌని అమావాస్య సందర్భంగా వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించేందుకు త్రివేణి సంగమం వద్దకు చేరుకుంటున్నారు. ఈ మేరకు బస్టాండ్స్, రైల్వేస్టేషన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. అధికారులు సైతం ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. కాగా, మహా కుంభమేళాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తొక్కసలాటలో 20మంది మృతి చెందినట్లు సమాచారం. దీనిపై అధికారులు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.
అయితే, ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో తొక్కిసలాట జరిగింది. త్రివేణి సంగమం ఘాట్ వద్ద జరిగిన ఈ ఘటనలో మహిళలు, చిన్నారులు గాయపడ్డారు. అయితే ఘటనాస్థలంలో భక్తుల బ్యాగులు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. గాయపడిన భక్తులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.
ఈ తొక్కిసలాటపై ప్రధాని నరేంద్ర మోదీ ఆరా తీశారు. వెంటనే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు ఫోన్ చేసి ప్రమాదానికి సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే తొక్కిసలాటపై హోం మంత్రి అమిత్ షా ఆరా తీశారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో మాట్లాడారు. కేంద్రం తరఫున అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. భక్తులకు ఇబ్బంది లేకుండా పటిష్టంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడారు. ప్రయాగ్‌రాజ్‌లో 8 నుంచి 10 కోట్ల మంది భక్తులు ఉన్నారన్నారు. మంగళవారం దాదాపు 5 కోట్ల మంది భక్తులు స్నానాలు చేశారని, రాత్రి మౌని అమావాస్య ఘడియలు రాగానే భక్తులు ఒక్కసారిగా బారికేడ్ల ముందుకు వచ్చారని తెలిపారు. తొక్కిసలాట జరగ్గానే అధికారులు స్పందించి సహాయ చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ప్రస్తుతం పరిస్థితి నియంత్రలోనే ఉందని, ప్రజలు సహకరించాలని కోరారు.
ఇదిలా ఉండగా, తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఈ తొక్కిసలాట జరిగిందని సాక్షులు చెబుతున్నారు. రద్దీ ఎక్కువగా ఉండడంతో భక్తులు ఎక్కడకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఈ సమయంలో చెత్త బుట్టలు భక్తుల కాళ్లకు తగిలాయి. చీకటిగా ఉండడంతో చాలామంది కిందపడడంతో తొక్కిసలాట జరిగిందని చెబుతున్నారు.