Legislative Council Chairman Gutta Sukhender Reddy Commented on PA and PRO: ప్రజాప్రతినిధులు, ప్రజలకు మధ్య దూరం పెరిగి గడానికి, ఎన్నికల్లో ఓడిపోవడానికి వాళ్ల పీఏలు, పీఆర్వోలు ప్రధాన కారణమవుతున్నారని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. బుధవారం ఎంసీహెచ్‌ఆర్‌డీలో శాసనసభ, మండలి సభ్యుల ఓరియెంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో గుత్తా పాల్గొని పలు సూచనలు చేశారు.
పీఏలు, పీఆర్వోల ధోరణితో తిప్పలు
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మాట్లాడానికి ప్రజలు ఫోన్ చేస్తే పీఏలు, పీఆర్వోలు దురుసుగా మాట్లాడుతున్నారని, దీనివల్ల నేతల పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని సుఖేందర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అలాగే, తమను కలిసేందుకు వచ్చే ప్రజలను నేతలతో చనువుగా మాట్లాడనీయకుండా చేసే గన్‌మెన్ల మీద కూడా ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉందన్నారు. ఎన్నికల్లో గెలవగానే వచ్చి వెంట తిరిగుతూ, అనుచరులుగా హల్ చల్ చేసేవారితోనూ నేతలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రజలతో నేరుగా కలిసి, వారి సమస్యలు తెలుసుకుంటేనే క్షేత్రస్థాయి పరిస్థితి అర్థమవుతుందని అన్నారు.
పాడు కాలం వచ్చింది
ప్రస్తుత రాజకీయాలను చూస్తే ఆవేదన కలుగుతోందని, గాలివాటం రాజకీయాల మూలంగా ప్రజలతో సంబంధం లేని వారు ఎమ్మెల్యేలుగా ఎన్నికవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలు ఖరీదైనవిగా మారిపోయాయని, ప్రజాబలం ఉన్నప్పటికీ ధనబలం లేనివారు చట్ట సభ సభ్యులు అయ్యే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాము సభాపతిగా ఉన్నా సభ ఎన్నిరోజులు నడపాలనే నిర్ణయం ప్రభుత్వానిదేనన్నారు.
చర్చ జరగాలి : స్పీకర్
ఉత్తమ పార్లమెంటరీయన్ మాదిరిగా ఉత్తమ అసెంబ్లీ పర్సన్ అవార్డు పరిశీలన చేస్తామని స్పీకర్ గడ్డం ప్రసాద్ వెల్లడించారు. గతంలో ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వెంకయ్యనాయుడు, జైపాల్ రెడ్డి వంటి నేతలు బాగా మాట్లాడి మంచి పేరు తెచ్చుకున్నారని గుర్తుచేశారు. చట్టాలను రూపొందించే హక్కు శాసన సభ్యులకు ఉంటుందన్నారు. గతంలో శాసనసభ సమావేశాలు ఉంటే సినిమా రిలీజ్ వాయిదా వేసుకునేవారన్నారు. మళ్లీ అలాంటి అర్థవంతమైన చర్చలతో కూడిన సమావేశాలు జరుగాలని ఆకాంక్షించారు.
శాసనసభ అందరిదీ..
శాసనసభ అన్ని పార్టీలదీనని, ఈ ట్రైనింగ్ సెషన్స్‌కు అందరికీ ఆహ్వానం పంపామని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. పాత రోజుల్లో సిద్ధాంతపరంగా నేతల మధ్య భేదాభిప్రాయాలు ఉన్నా సభలో ఎవరి పాత్ర వారు పోషించారన్నారు. ఈ అసెంబ్లీలో తొలిసారి గెలిచిన 57 మంది సభ్యులున్నారని, సీనియర్లు బాధ్యతగా ఉంటూ వారికి మార్గదర్శకత్వం వహించాలని సూచించారు. తాను తొలిసారి గెలిచినప్పుడు కాంగ్రెస్ విపక్షంలో ఉందని, దాంతో మాట్లాడేందుకు మైక్ దొరికేది కాదని, ఎంతో సమయం వేచి చూసేవారమని గుర్తుచేసుకున్నారు. తాను నాలుగోసారి సభలో ఉన్నప్పుడు పీఏసీ ప్రతిపక్షానికి ఇవ్వలేదని గుర్తు చేసుకున్నారు. ఎమ్మెల్యేలు సభకు విధిగా హాజరయ్యేలా పద్ధతి రావాలన్నారు. ఎమ్మెల్యేగా గెలిచి సభ రాకుండా దూరంగా ఉండడం రాజ్యాంగ విలువలను అవహేళన చేయడమేనన్నారు.