Kaleshwaram Commission: ఏమైనా డీల్ చేశారా? కాళేశ్వరం కమిషన్ విచారణ.. ఓపెన్ కోర్టులో పీసీ ఘోష్ ప్రశ్నలు

Kaleshwaram Commission Investigation: కాళేశ్వరం కమిషన్ విచారణ గురువారం కూడా హాట్‌హాట్‌గా సాగింది. రెండవరోజు విచారణలో భాగంగా గురువారం రిటైర్డ్ ఐఏఎస్, మాజీ సీఎస్ సోమేశ్ కుమార్, గత సీఎంవోలో కీలకంగా పనిచేసిన స్మిత సబర్వాల్ కమిషన్‌ ముందు విచారణకు హాజరయ్యారు. కాగా, ఓపెన్ కోర్టులో వారిని కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ ప్రశ్నించారు. అయితే, ఈ విచారణ సందర్భంగా మాజీ సీఎస్ సోమేశ్ కుమార్‌ వ్యవహార శైలిపై కమిషన్ ఛైర్మన్ పీసీ ఘోష్ సీరియస్ కావటంతో బాటు ఆయన జవాబులిచ్చిన తీరుపై అసహనం వ్యక్తం చేశారు.

కొద్ది కాలమే ఉన్నా..
విచారణ సందర్భంగా.. కాళేశ్వరం బ్యారేజ్‌లకు సంబంధించి అనుమతులపై పీసీ ఘోష్ ప్రశ్నిస్తూ, 3 బ్యారేజీల విషయంలో సీఎస్, ఇరిగేషన్ సెక్రెటరీగా ఉన్నప్పుడు ఏమైనా డీల్ చేశారా అని కమిషన్ ప్రశ్నించింది. దీనికి సోమేష్ బదులిస్తూ.. ఇరిగేషన్ సెక్రెటరీగా తాను కొంత కాలమే పనిచేశానని, చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడు కేబినెట్ నిర్ణయాల మేరకు ముందుకు వెళ్లానని బదులిచ్చారు. ‘నిబంధనలకు వ్యతిరేకంగా 3 బ్యారేజీల నిర్మాణాలు జరిగినట్లు ఏమైనా నోట్స్ గుర్తించారా’ అని కమిషన్ ప్రశ్నించగా, దానికి సోమేష్ నేరుగా జవాబు చెప్పలేదు. దీంతో మాజీ సీఎస్‌పై కమిషన్ చీఫ్ సీరియస్ అయ్యారు. అడిగదానికి నేరుగా జవాబులు చెప్పకుండా అనవసరమైన సమాచారం ఇస్తారేంటని మండిపడ్డారు. ‘మీరు ఒక న్యాయ విచారణ కమిషన్ ముందు హాజరయ్యారు. టీవీ డిబేట్‌కు రాలేదు.’ అంటూ చురకలంటించింది. మొత్తంగా కమీషన్ అడిగిన ప్రశ్నలకు ‘గుర్తులేదు, మర్చిపోయాను, చాలా సంవత్సరాలు అయింది’ అని సోమేశ్ కుమార్ సమాధానం చెప్పారు.