India vs Bangladesh: తొలి టీ20లో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన భారత్

స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. గ్వాలియర్‌లోని మాధవరావ్ సింధియా స్టేడియంలో ఆదివారం జరిగిన టీ20 మ్యాచ్‌లో భారత్ ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన బంగ్లాదేశ్.. 19.5 ఓవర్లలో 127 పరుగులకు కుప్పకూలింది. బౌలర్ల దెబ్బకు బంగ్లాదేశ్ బెంబేలెత్తింది.

బంగ్లా బ్యాటర్లలో మెహిదీ హసన్ మిరాజ్(35) పరుగులతో రాణించగా.. కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటో (27) పరుగులు చేశాడు. తౌహిద్ హృదయ్ (12), తస్కిన్ అహ్మద్ (12), రిషాద్‌ హొస్సేన్ (11) పరుగులు చేయగా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. భారత్ బౌలర్లలో ఆర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి చెరో మూడు వికెట్లు పడగొట్టగా.. హార్దిక్ పాండ్యా, మయాంక్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ తలో వికెట్ తీశారు.

స్వల్ప లక్ష్యఛేదనకు దిగిన భారత్.. బ్యాటింగ్‌లోనూ అదరగొట్టింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (16) పరుగులు చేసి రనౌట్ అయి పెవిలియన్ చేరగా.. వికెట్ కీపర్ సంజూ శాం సన్ (29) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. తర్వాత వచ్చిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (29) దూకుడుగా ఆడాడు. నితీశ్‌కుమార్‌ రెడ్డి (16) పరుగులు చేయగా.. చివరిలో హార్దిక్‌ పాండ్య (39) ఆల్ రౌండర్ ప్రదర్శన కనబర్చాడు. దీంతో భారత్ 11.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. భారత్ 3 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. బంగ్లా బౌలర్లలో ముస్తాఫిజుర్, మిరాజ్ చెరో వికెట్ తీశారు.

ఈ మ్యాచ్‌లో మంచి ప్రదర్శన కనబర్చిన అర్ష్‌దీప్‌ సింగ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. అయితే ఈ మ్యాచ్‌లో భారత్ యువ పేసర్ మయాంక్ బౌలింగ్ ఆకట్టుకుంది. తొలి టీ20తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. ఫస్ట్ మ్యాచ్‌లోనే 149 కిలోమీటర్ల వేగంతో నిలకడగా బౌలింగ్ చేసి ఆకట్టుకున్నాడు. ఇక, భారత్ ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యం సాధించింది. ఇక రెండో టీ20 మ్యాచ్ బుధవారం ఢిల్లీలో జరగనుంది.