India vs South Africa: తొలి టీ20 భారత్‌దే..సెంచరీతో రాణించిన సంజూ శాంసన్

India beat South Africa by 61 runs: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. భారత్ 61 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. తొలుత టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది.

ఓపెనర్ సంజు శాంసన్ వీరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 47 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. శాంసన్ 107, తిలక్ 33, కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ 21 పరుగులు చేశారు. చివరిలో బ్యాటర్లు విఫలం కావడంతో 202 పరుగులకే పరిమితమైంది. హార్దిక్‌ (2), రింకు సింగ్‌ (11), అక్షర్‌ పటేల్‌ (7) పరుగులు చేశారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో కొయెట్జీ 3 వికెట్లు పడగొట్టగా.. జాన్సెన్, మహరాజ్, పీటర్, క్రూగర్ తలో వికెట్ తీశారు.

అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన దక్షిణాఫ్రికాకు మొదటి ఓవర్‌లోనే ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ ఐడెన్ మార్క్రామ్ అర్ష్‌దీప్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. నాలుగో బంతికి వికెట్‌ కీపర్‌ సంజు చేతికి చిక్కాడు. ర్యాన్ రికెల్టన్(21), క్లాసెన్‌ (25) రాణించగా.. మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో దక్షిణాఫ్రికా 17.5 ఓవర్ల వద్ద 141 పరుగులకే ఆలౌటైంది. వరుణ్‌ చక్రవర్తి, రవి బిష్ణోయ్‌ మూడేసి వికెట్లు పడగొట్టగా.. అవేశ్‌ 2, అర్ష్‌దీప్‌ వికెట్‌ తీశారు. ఈ వియంలో భారత్ 4 టీ20 సిరీస్‌లో 1-0తో ముందంజలో నిలిచింది.