Hydra: హైడ్రా కమిషనర్ కీలక వ్యాఖ్యలు.. ఆ ఇళ్లను మాత్రమే కూలుస్తాం

Hydra commissioner ranganath comments: హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రా ఏర్పడక ముందు అన్ని అనుమతులతో నిర్మించినటువంటి, ప్రస్తుతం నిర్మిస్తున్న ఇళ్లను కూల్చమని ప్రకటించారు. కానీ హైడ్రా ఏర్పడిన తర్వాత అక్రమంగా నిర్మిస్తున్న ఇళ్లను కూలుస్తామన్నారు. ఈ మేరకు జులై తర్వాత నుంచి నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామని తెలిపారు.

అయితే, కొత్తగా తీసుకున్న అనుమతులను హైడ్రా పరిశీలిస్తుందని పేర్కొన్నారు. పేదల ఇళ్లు హైడ్రా అధికారులు కూలుస్తున్నారనే వార్తలు, ప్రచారాలను నమ్మవద్దని సూచించారు. హైడ్రా.. పేదప్రజలు, చిన్నవాళ్ల జోలికి వెళ్లదని సూచించారు. ఇటీవల ఇల్లు నిర్మించుకునేందుకు తీసుకున్న అనుమతులను హైడ్రా పరిశీలిస్తుందన్నారు. అన్నింటినీ తనిఖీ చేస్తుందని, లోపాలు ఉంటే మాత్రం అడ్డుకుంటామని వెల్లడించారు.

ఇదిలా ఉండగా, కూకట్‌పల్లిలో ఉన్న కాముని చెరువుతో పాటు మైసమ్మ చెరువులను హైడ్రా కమిషనర్ పరిశీలించారు. అనంతరం ఆయన స్థానికులతో మాట్లాడారు. హైడ్రాపై వస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని సూచించారు. ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా చెరువుల పరిరక్షణకు హైడ్రా కృషి చేస్తుందని వెల్లడించారు.