Site icon Prime9

Manda Jagannadham: మాజీ ఎంపీ మందా జగన్నాథం కన్నుమూత

Former Nagarkurnool MP Manda Jagannadham Passed Away: నాగర్‌కర్నూల్‌ మాజీ ఎంపీ డాక్టర్ మందా జగన్నాథం (73) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో ఆయనను ఇటీవల హైదరాబాద్‌ నిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం కన్నుమూశారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ఇటిక్యాలలో 1951 మే 22వ తేదీన జన్మించిన జగన్నాథం.. మెడిసిన్ చదివి కొంతకాలం వైద్యుడిగా పనిచేశారు. ఆయనకు భార్యతో పాటు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఆయన మృతిపై సీఎం రేవంత్ రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని కోరారు.

కాగా, 1996లో అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు ఆహ్వానం మేరకు టీడీపీలో చేరారు. ఈ మేరకు 1996, 1999, 2004 ఏడాదిలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరఫున గెలిచారు. అనంతరం 2009లో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని ఆ పార్టీ నుంచి విజయం సాధించారు. ఇలా వరుసగా నాగర్ కర్నూల్ నుంచి నాలుగు సార్లు ఎంపీగా గెలుపొందారు. అనంతరం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీని వీడి అప్పటి టీఆర్ఎస్ పార్టీలో చేరి అక్కడి నుంచి పోటీ చేశారు. కానీ అనూహ్యంగా తొలిసారి ఓటమి చెందారు. ఆనాటి నుంచి ఆ పార్టీలో కీలకంగా పనిచేస్తున్నారు. ఈ తరుణంలో ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ప్రతినిధిగా నియమించింది. అనంతరం 2019లో టికెట్ రాకపోవడంతో కాంగ్రెస్‌లోకి వెళ్లారు. 2023లో కాంగ్రెస్‌లో టికెట్ రాకపోవడంతో బీఎస్పీలో చేరారు. కానీ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.

ఇదిలా ఉండగా, నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి మందా జగన్నాథం 6 సార్లు ఎంపీగా పోటీ చేశారు. ఇందులో నాలుగు సార్లు గెలిచి రెండుసార్లు ఓటమి చెందారు.1996లో టీడీపీ నుంచి ఓటమి చెందారు. అలాగే 2014లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేయగా ఓడిపోయారు. 2024లో బీఎస్పీ నుంచి ఎంపీగా పోటీ చేయగా.. ఈసీ నామినేషన్ పత్రాలు తిరస్కరించారు.

Exit mobile version