Dy CM Pawan kalyan Seeks Pending Cases Reports in His Departments with in three weeks: ఏళ్ల తరబడి కేసులు పెండింగ్‌లో ఉంచడానికి కారణాలు, ఎన్ని కేసులు పెండింగ్‌లో ఉన్నాయో వాటి వివరాలపై నివేదిక సిద్ధం చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీశాఖ ముఖ్య కార్యదర్శులకు జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఉద్యోగుల పనితీరుపై సున్నితమైన విజిలెన్స్ ఉండాలని కోరారు. ఉద్యోగులు అప్రమత్తంగా, అత్యుత్తమంగా పనిచేయడానికి ఇది ఉపయోగపడుతుందన్నారు. ఉద్యోగుల నిజాయతీ, పనితీరు, నిబద్ధతకు ఓ సూక్ష్మదర్శినిలా పనిచేస్తుందన్నారు. ఉద్యోగులపై నమోదవుతున్న విజిలెన్స్ కేసులు, శాఖాపరమైన విచారణలు, దర్యాప్తులు ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉండిపోవడం వల్ల ఉద్యోగుల పనితీరుపై ప్రభావం చూపిస్తుందన్నారు.
20 ఏళ్ల నుంచి పెండింగ్..
కొన్ని కేసులు 20 ఏళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్నాయని పవన్ చెప్పారు. ఇలా అపరిష్కృతంగా ఉండటం వల్ల ఉద్యోగ విరమణ తర్వాత ఉద్యోగులు రిటైర్మెంట్ బెనిఫిట్స్ పొందలేకపోతున్నారనే విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. ఈ నేపథ్యంలో క్రమశిక్షణ చర్యలు, శాఖాపరమైన విచారణలకు సంబంధించిన విచారణలు ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉండటంపై పవన్ దృష్టి సారించారు.
పెండింగ్ అంశంపై ఆరా..
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్‌డబ్ల్యూఎస్, అటవీ, పర్యావరణ శాఖల్లో ఉన్న శాఖాపరమైన కేసుల వివరాలు, అవి ఎంతకాలంగా పెండింగ్‌లో ఉన్నాయనే అంశంపై ఆరా తీశారు. అందుకు గల కారణాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని సంబంధిత శాఖల ముఖ్య కార్యదర్శులను ఆదేశించారు. నివేదికను మూడు వారాల్లోగా ఇవ్వాలని ఆదేశించారు. అభియోగాలు వచ్చిన వారిపై విచారణ ప్రారంభించినప్పుడు దానికి తగిన పత్రాలు అందుబాటులో ఉండటం లేదన్నారు. ఇది విచారణలో జాప్యానికి కారణం అవుతోందని అధికారులు పవన్ దృష్టికి తీసుకెళ్లారు.
విచారణ పకడ్బందీగా జరపాలి..
తన శాఖల పరిధిలో విజిలెన్స్ రిపోర్టుల ఆధారంగా తీసుకునే చర్యల్లో వేగం పెంచేందుకు ప్రత్యేక మార్గదర్శకాలు సూచించారు. ఏదైనా విషయంలో అధికారులు, సిబ్బందిపై ఆరోపణలు వస్తే ప్రాథమిక విచారణ పకడ్బందీగా జరపాలన్నారు. ప్రాథమిక విచారణలో బలమైన ఆధారాలు సేకరించాలన్నారు. విచారణ అధికారి, ఆరోపణలు వచ్చిన ఉద్యోగికి మధ్య ఎలాంటి సన్నిహిత సంబంధాలు లేకుండా తొలి దశలోనే నిరోధించాలని స్పష్టం చేశారు. అన్ని విజిలెన్స్, నాన్ విజిలెన్స్ కేసులను సరైన, సక్రమమైన పద్ధతిలో తిరిగి విచారించి వేగంగా వాటిని పరిష్కరించేందుకు ఆయా శాఖల అధిపతులు దృష్టి సారించాలన్నారు.