Deputy CM Bhatti Vikramarka: దేశానికే యంగ్ ఇండియా స్కిల్స్ రోల్ మోడల్‌.. ప్రతి నియోజకవర్గంలో ఓ రెసిడెన్షియల్ స్కూల్

Deputy CM Bhatti Vikramarka Announcement Residential school: యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రపంచ స్థాయిలో తీర్చిదిద్దుతామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఈ మేరకు మీడియాతో ఆయన మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ చాలా రెసిడెన్షియల్ స్కూళ్లకు కనీసం భవనాలు కూడా లేవన్నారు. అందుకే ఉచితంగా నాణ్యమైన విద్య కోసం ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను కట్టాలని నిర్ణయించామన్నారు.

ఇందులో భాగంగా తొలుత 20 నుంచి 25 అసెంబ్లీ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా ఈ స్కూళ్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దసరా కంటే ముందే ఈ స్కూళ్ల ప్రారంభోత్సవానికి భూమిపూజ చేయనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం 1023 రెసిడెన్షియల్ స్కూళ్లు ఉండగా.. అందులో 600కు పైగా పాఠశాలలకు సొంత భవనాలు లేవని భట్టి విక్రమార్క తెలిపారు.

దేశానికే యంగ్ ఇండియా స్కిల్స్ రోల్ మోడల్‌గా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అందుకే ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణానికి రూ.5వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకు యంగ్ ఇండియా మోడల్ స్కూల్స్ నమూనాను విడుదల చేశారు. ఒక్కో పాఠశాలను 20 నుంచి 25 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్నట్లు మీడియాకు వెల్లడించారు. ఈ సమావేశంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, అధికారులు సీఎస్ శాంతికుమారి పాల్గొన్నారు.