Site icon Prime9

Deputy CM Bhatti Vikramarka: రైతు కూలీలకు రూ.12వేలు.. ఈ నెల 28 నుంచి అమలు

Deputy CM Bhatti Vikramarka Announced 12 thousand for landless poor: భూమిలేని పేద కూలీలకు కాంగ్రెస్‌ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీమేరకు ఈ నెల 28 నుంచి రూ.12 వేల మొత్తాన్ని అందించనున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

సంక్రాంతి నుంచి రైతుభరోసా..
సంక్రాంతి నుంచి రైతుభరోసా డబ్బులు అందజేస్తామని డిప్యూటీ సీఎం తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయానికి, రైతుల కోసం రూ.50,953 కోట్లు ఖర్చు చేసిందని గుర్తుచేశారు.రాష్ట్రవ్యాప్తంగా పరిశ్రమల విస్తరణకోసం కొత్తగూడెం, రామగుండం, ఆదిలాబాద్‌, వరంగల్‌ ప్రాంతాల్లో విమానాశ్రయాలు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు తలమానికంగా మూసీని అభివృద్ధి చేయడానికి మూసీ పునరుజ్జీవ కార్యక్రమం చేపట్టామన్నారు. అన్ని జిల్లాలను కలుపుతూ రీజినల్‌ రింగ్‌రోడ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఔటర్‌ రింగ్‌రోడ్డు, రీజినల్‌ రింగ్‌రోడ్డు మధ్య ఇండస్ట్రియల్‌, హౌసింగ్‌ క్లస్టర్లు ఏర్పాటు చేసి భవిష్యత్‌ తరాలకు అందించబోతున్నామని ప్రటించారు. సన్నాలపై క్వింటాకు ఇస్తున్న రూ.500 బోనస్‌ మూలంగా రైతులకు ఎకరానికి రూ.10వేల నుంచి 15వేల వరకు అదనంగా ఆదాయం వస్తోందని గుర్తుచేశారు. ప్రజా ప్రభుత్వం రైతుల పక్షపాతిగా పనిచేస్తోందన్నారు.

బీఆర్ఎస్ అబద్ధాలు..
పదేళ్లు బీఆర్‌ఎస్ రైతులకు ఒరగబెట్టింది ఏమీ లేదని, నేడు ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు మాట్లాడుతూ ప్రజలను మభ్యపెడుతోందని మండిపడ్డారు. తమ హయాంలో తెచ్చిన అప్పులపై బీఆర్‌ఎస్ నాయకులు అబద్ధాలు చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ గద్దె దిగేనాటికి రూ.40,154 కోట్ల బకాయిలు పలు శాఖలకు చెల్లించాల్సి ఉందని గుర్తుచేశారు. పదేళ్లలో రూ.7,11,911 కోట్లు అప్పులు చేసి ప్రజలపై భారం మోపిందన్నారు. 2014 నాటికి తెలంగాణ ఏడాదికి రూ.6,400 కోట్లు చెల్లించాల్సి ఉండగా, పదేళ్లలో బీఆర్‌ఎస్ పాలన తర్వాత ఇది ఏడాదికి రూ.66,782 కోట్లకు చేరిందని మండిపడ్డారు.

అసెంబ్లీ చర్చకు రెడీ
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని డిప్యూటీ సీఎం ఫైర్ అయ్యారు. రాష్ట్ర అప్పులకు సంబంధించి తమ దగ్గర పక్కా లెక్కలు ఉన్నాయని తెలిపారు. బీఆర్ఎస్ సర్కారు చేసిన అప్పులను కొంచెం కొంచెంగా తీర్చే ప్రయత్నం చేస్తున్నామని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రూ.54 వేల కోట్లు అప్పులు చేసిందని తెలిపారు. అసెంబ్లీలో ఎవరు ఎన్ని అప్పులు చేశారో చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు.

 

Exit mobile version