Site icon Prime9

CM Chandrababu: డ్రోన్స్ ఫ్యూచర్ గేమ్ ఛేంజర్స్.. ‘అమరావతి డ్రోన్ సమ్మిట్‌’లో సీఎం చంద్రబాబు

CM Chandrababu Naidu vows to develop Andhra as drone hub: రాబోయే రోజుల్లో డ్రోన్స్ గేమ్ ఛేంజర్స్ కానున్నాయని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో నిర్వహించిన ‘అమరావతి డ్రోన్‌ సమ్మిట్‌- 2024’ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. రెండు రోజుల పాటు జరగనున్న ఈ సమ్మిట్‌ను సీఎం చంద్రబాబు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ మేరకు అధికారులు చంద్రబాబు, రామ్మోహన్ నాయుడికి ఘన స్వాగతం పలికారు. డ్రోన్‌తో ఈ సమ్మిట్‌కు చెందిన బ్రోచర్‌ను ప్రదర్శించారు. అనంతరం ఆయన మాట్లాడారు. హైదరాబాద్‌లో ఐటీ అభివృద్ధికి కృషి చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరం దేశంలోనే గొప్ప నగరంగా ఉందన్నారు. 1995లో ఐటీ గురించి ఆలోచించి చాలా మల్టీ నేషనల్ కంపెనీలు తీసుకొచ్చినట్లు గుర్తు చేశారు. విదేశాల్లో ఉన్న మనదేశ ఐటీ నిపుణుల్లో 30 శాతం తెలుగువారే ఉన్నారని చెప్పారు.

డ్రోన్ సిటీ అమరావతి..
విజయవాడ వరదల్లో డ్రోన్లు కీలకంగా వ్యవహరించాయని, డ్రోన్లు వినియోగించి ఆహారం, తాగునీరు అందించామన్నారు. రానున్న రోజుల్లో అమరావతి డ్రోన్ సిటీగా మారనుందని చెప్పారు. డ్రోన్ల ఆవిష్కరణలో దేశానికి ఏపీ కేంద్రకానుందని పేర్కొన్నారు. ఇందు కోసం 15 రోజుల్లోనే డ్రోన్ పాలసీని తీసుకొస్తామన్నారు. డ్రోన్ హబ్ ఏర్పాటుకు ఓర్వకల్లలో 300 ఎకరాల భూమిని ఇస్తామన్నారు. ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా సహకారం ఉంటుందన్నారు.

భవిష్యత్తులో డేటానే కీలకం..
భవిష్యత్తులో డేటానే కీలకమని, ఎన్ని డబ్బులు ఉన్నాయనేది కాదని.. ఎంత డేటా ఉందనేది గొప్పగా చూస్తారని సీఎం చంద్రబాబు వెల్లడించారు. డేటాకు ఏఐను అనుసంధానిస్తే అద్భుతాలు సృష్టించవచ్చన్నారు. వ్యవసాయం, మౌలిక వసతుల రంగంలో డ్రోన్లది కీలకపాత్ర ఉందన్నారు. అలాగే నగరాల్లో ట్రాఫిక్‌ నియంత్రణకు వాడొచ్చన్నారు. అభివృద్ధిలో డ్రోన్లను మరింత ఉపయోగించుకోవచ్చని తెలిపారు. భవిష్యత్తులో వైద్యరంగంలో పెనుమార్పులు రానున్నాయని, రోగులు ఇంటినుంచే చికిత్స తీసుకోవచ్చన్నారు. అలాగే డ్రోన్ల సహాయంతో రౌడీషీటర్ల కదలికలపై నిఘా ఉంచి వారికి చెక్‌ పెడతామని చంద్రబాబు తెలిపారు. కార్యక్రమంలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి బీసీ జనార్ధన్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version