CapitaLand to develop ₹450-crore New IT Park in Hyderabad: సీఎం రేవంత్‌రెడ్డి సింగపూర్ పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది. పెట్టుబడి దారులను ఆకర్షిస్తున్నారు. పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకొస్తున్నారు. కొన్ని పెట్టుబడుల ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఈ క్రమంలో మరో కీలక ఒప్పందం జరిగింది. హైదరాబాద్‌లో రూ.450 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ప్రపంచ అగ్రగామి సంస్థ క్యాపిటల్యాండ్ ముందుకొచ్చింది. ఒక మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐటీ పార్కు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. సింగపూర్‌లో సీఎం రేవంత్ అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో క్యాపిటల్యాండ్ కీలక నిర్ణయం ప్రకటించింది. క్యాపిటల్యాండ్ నిర్ణయాన్ని సీఎం రేవంత్ స్వాగతించారు.
హైదరాబాద్‌లో మూడు వ్యాపార పార్కులు..
హైదరాబాద్‌లో ఇప్పటికే మూడు వ్యాపార పార్కులను కాపిటల్యాండ్ నిర్వహిస్తోంది. ఇంటర్నేషనల్ టెక్ పార్కు హైదరాబాద్, అడ్వాన్స్ హైదరాబాద్, సైబర్ పెర్ల్ ఏర్పాటు చేసిన క్యాపిటల్యాండ్ హైదరాబాద్‌లో ఇంటర్నేషనల్ టెక్ పార్క్ రెండో దశ పనులు ఈ ఏడాది ప్రారంభమై 2028నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది.
యువతకు ఉద్యోగావకాశాలు..
రాష్ట్రంలో పెట్టుబడుల ద్వారా యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మంచి ఫలితాలు రాబడుతోంది. మూడురోజుల పర్యటనలో భాగంగా సీఎం బృందం సింగపూర్ పారిశ్రామికవేత్తలతో సమావేశాలు, ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. సీఎం రేవంత్ సింగపూర్ తొలిరోజు పర్యటనలో కీలక ఒప్పందం జరిగింది. సింగపూర్ ఐటీఈ ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్‌తో తెలంగాణలో ఎంగ్ ఇండియా యూనివర్సిటీ ఒప్పందం చేసుకుంది. సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో ఒప్పందం జరిగింది.
సింగపూర్ నదిలో రేవంత్ పడవ ప్రయాణం..
తెలంగాణలో పెట్టుబడుల నేపథ్యంలో సీఎం రేవంత్ బృందం సింగపూర్ పారిశ్రామికవేత్తలతో సమావేశాలు, కీలక ఒప్పందాలు కుదుర్చుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా రేవంత్ సింగపూర్ నదిలో పడవ ప్రయాణం చేసి, అక్కడి నది పునరుద్ధరణ కార్యక్రమాలను పరిశీలించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఎక్స్ వేదికగా పలు విషయాలను పంచుకున్నారు. సింగపూర్ నదిలో పడవ ప్రయాణం చేసి, నదుల పునరుజ్జీవనం సిటీ-స్టేట్ అనుసరించిన ఉత్తమ పద్ధతులు తెలుసుకున్నట్లు తెలిపారు. వరల్డ్ క్లాస్ హైదరాబాద్‌ను క్రియేట్ చేయడానికి మనం ఇంకా ఉత్తమ పద్ధతులను స్వీకరించడం నేర్చుకోవాలి, మనం చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
దావోస్ పర్యటనకు తెలుగు రాష్ట్రాల సీఎంలు
దావోస్‌లో జరుగనున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం-2025 సదస్సుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు హాజరుకాబోతున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ తమ రాష్ట్రాలకు విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు దావోస్ వేదికగా పోటీ పడనుండటం ఆసక్తికర పరిణామం.
పెట్టుబడులే లక్ష్యంగా..
బ్రాండ్ ఏపీ ప్రమోషన్ పేరుతో ఏపీకి భారీ పెట్టుబడులు సాధించేందుకు చంద్రబాబు, రైజింగ్ తెలంగాణ పేరుతో తెలంగాణకు పెట్టుబడుల సాధనకు రేవంత్‌రెడ్డి దావోస్‌లో వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో ప్రపంచ వ్యాపార దిగ్గజ సంస్థల ప్రతినిధులతో భేటీ కానున్నారు. పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా రేవంత్, చంద్రబాబు దావోస్ పర్యటన చేస్తున్నారు. సింగపూర్ నుంచి రేవంత్‌రెడ్డి బృందం దావోస్ బయలుదేరింది. చంద్రబాబు ఆదివారం సాయంత్రం ఢిల్లీ మీదుగా దావోస్ వెళ్లారు.