Site icon Prime9

Burra Venkatesham: పారదర్శకంగా ఉద్యోగాల నియామకాలు.. టీజీపీఎస్సీపై విశ్వాసం పెంపొందించేందుకు కృషి

Burra Venkatesham took charge as the Chairman of TGPSC: రాష్ట్రంలో ఉద్యోగాల నియామకాలు పారదర్శంగా, వేగంగా చేపడుతామని టీజీపీఎస్సీ చైర్మన్‌ బుర్రా వెంకటేశం తెలిపారు. గురువారం నాంపల్లిలోని కమిషన్‌ కార్యాలయంలో బుర్రా చైర్మన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టారు. కమిషన్‌ సభ్యులు, సిబ్బంది బుర్రాకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పై పూర్తి స్థాయిలో అభ్యర్థుల్లో తిరిగి విశ్వాసం పెంపొందించేందుకు కృషి చేస్తానని చెప్పారు.

ఐఏఎస్ నా కల..
ఐఏఎస్ తన కల బుర్రా వెంకటేశం అన్నారు. కష్టపడి పబ్లిక్ సర్వెంట్‌గా మారానని, నిరుద్యోగ అభ్యర్థుల కోసం మూడున్నరేళ్ల సర్వీస్‌ని వదులుకుని టీజీపీఎస్సీ బాధ్యతలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఎప్పటికప్పుడు జాబ్ నోటిఫికేషన్లు ఇస్తామని తెలిపారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగంగా, పారదర్శకంగా చేపడతామని హామీఇచ్చారు. అభ్యర్థులు కమిషన్‌పై నమ్మకంతో పరీక్షలకు హాజరుకావాలని కోరారు. ఎడ్యుకేషన్​లో ఉన్న సమయంలో 60 రోజుల్లోనే డీఎస్సీ ప్రక్రియ పూర్తి చేస్తామని పేర్కొన్నారు. టీజీపీఎస్సీలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఎవరైనా అంటే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. కమిషన్​కు సమాచారం ఇచ్చేందుకు ప్రత్యేక ఫోన్ నంబర్ కూడా కేటాయిస్తామని ప్రకటించారు. టీజీపీఎస్సీకి స్వయం ప్రతిపత్తి ఉందని, దీంతో ఎవరికీ భయపడకుండా పని చేస్తామని ఉద్ఘాటించారు.

తప్పులు చేస్తే ఉపేక్షించం..
ఎవరూ తప్పులు చేసినా ఉపేక్షించబోమని వెంకటేశం స్పష్టం చేశారు. విద్యాశాఖలో ఉండటం వల్ల ప్రశ్నల తయారీపై మంచి అవగాహన సాధించానని తెలిపారు. పోటీ పరీక్షల్లో ఎలాంటి ప్రశ్నల్లో తప్పులు లేకుండా చూస్తామని పేర్కొన్నారు. పదవిలోకి రావడం ఎంతో సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. తాను కూడా ప్రిపేర్ అయ్యే సమయంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ కరెక్ట్​గా పనిచేయడంతోనే తనకు ఉద్యోగం వచ్చిందని గుర్తు చేసుకున్నారు.

పేద కుటుంబం నుంచి..
జనగామ జిల్లా ఓబుల్‌ కేశవాపురం గ్రామానికి చెందిన బుర్రా వెంకటేశం నిరుపేద కుటుంబం నుంచి వచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని తొలి గురుకుల పాఠశాల సర్వేల్‌లో చదువుకున్నారు. 1989లో హైదరాబాద్‌లోని అంబేద్కర్‌ కళాశాల నుంచి బీఏ, 1992లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు.

1995లో ఐఏఎస్‌కు ఎంపిక..
1995లో ఐఏఎస్‌కు ఎంపికై ఆంధ్రప్రదేశ్‌ కేడర్‌కు వచ్చారు. 2005 నుంచి 2008 వరకు మెదక్‌ కలెక్టర్‌గా పనిచేశారు. ఆయన చేసిన సేవలకు అమెరికాకు చెందిన సోషల్‌ అకౌంటబులిటీ ఇంటర్నేషనల్‌ అనే సంస్థ నుంచి సోషల్‌ అకౌంటబులిటీ-8000 ధ్రువపత్రం పొందారు. అనంతర కాలంలో వివిధ ప్రభుత్వ విభాగాల్లో సేవలు అందించారు. ముగ్గురు ఐఏఎస్‌లతో కూడిన ఏపీ పునర్విభజన కమిటీలో సభ్యుడిగానూ వ్యవహరించారు.

2030 వరకు కొనసాగనున్న బుర్రా..
టీజీపీఎస్సీ చైర్మన్‌గా ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశంను తెలంగాణ ప్రభుత్వం నియమించింది. ఈ నెల 3వ తేదీతో మహేందర్‌రెడ్డి పదవీ కాలం ముగిసింది. ఈ నేపథ్యంలో నవంబర్ 30న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2030 వరకు టీజీపీఎస్సీ చైర్మన్ గా వెంకటేశం కొనసాగనున్నారు. బుర్రా వెంకటేశం నియామకానికి సంబంధించిన ఫైలుపై గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ సంతకం చేయడంతో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విద్యాశాఖ, గవర్నర్ ప్రత్యేక ముఖ్య కార్యదర్శిగా, జేఎన్​టీయూహెచ్ వీసీగా బుర్రా వెంకటేశం రిలీవ్ అయ్యారు.

Exit mobile version
Skip to toolbar