Site icon Prime9

TGPSC New Chairman 2024: టీజీపీఎస్సీ ఛైర్మన్‌గా బుర్రా వెంకటేశం.. ప్రభుత్వ ఉత్తర్వులకు గవర్నర్ ఆమోదం

Burra Venkatesham Appointed as TGPSC Chairman 2024: తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్‌గా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి బుర్రా వెంకటేశం నియమితులయ్యారు. ఈ నియామకానికి శనివారం గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ఆమోదముద్ర లభించింది. ప్రస్తుతం టీజీపీఎస్సీ చైర్మన్‌గా ఉన్న ఎం మహేందర్‌ రెడ్డి పదవీకాలం డిసెంబర్‌ 3న ముగియనుండటంతో ప్రభుత్వం చైర్మన్‌ నియామకానికి నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

అనేక వడపోతల తర్వాత..
నోటిఫికేషన్ నాటి నుంచి నవంబరు 20 వరకు ప్రభుత్వం ఈ ఛైర్మన్ పదవికి దరఖాస్తులు స్వీకరించింది. ఈ క్రమంలో మొత్తం 45 అప్లికేషన్లు రాగా అందులో పదవీ విరమణ చేసిన ఐఏఎస్‌లు, వర్సిటీల ప్రొఫెసర్లు కూడా దీనికి దరఖాస్తు చేశారు. కాగా, ప్రభుత్వం మాత్రం బుర్రా వెంకటేశంను ఎంపిక చేసింది. దీంతో మరో ఆయనకు మరో నాలుగేండ్ల సర్వీస్‌ ఉన్నప్పటికీ.. ముందుగానే స్వచ్ఛంద పదవీ విరమణ చేయనున్నారు. డిసెంబర్‌ 2న వెంకటేశం టీజీపీఎస్సీ చైర్మన్‌గా బాధ్యతలు తీసుకోనున్నారు. 2030 వరకు ఆ పదవిలో కొనసాగనున్నారు. తెలంగాణ తొలి పబ్లిక్ సర్వీస్ కమిషన్‌గా ఎస్సీ వర్గానికి చెందిన ప్రొ. ఘంటా చక్రపాణి నియమితులు కాగా, రెండవ ఛైర్మన్‌గా జనార్దన్ రెడ్డి పనిచేశారు. కాగా,ఆయనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆయన స్థానంలో మహేందర్ రెడ్డిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియమించారు. ఇప్పుడు బీసీ సామాజిక వర్గానికి చెందిన బుర్ర వెంకటేశం ఆ బాధ్యతల్లోకి రానున్నారు.

ట్యూషన్ మాస్టర్ నుంచి ఛైర్మన్ వరకు..
జనగాం జిల్లా ఓబుల్ కేశవాపురంలోని నిరుపేద బీసీ కుటుంబంలో జన్మించిన వెంకటేశం తన ఏడవ ఏటనే తండ్రిని కోల్పోయారు. వరంగల్, నల్గొండ జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలలోనే పదో తరగతి వరకు చదివి, ఇంటర్ కోసం హైదరాబాద్ వచ్చారు. ప్రభుత్వ కాలేజీలో డిగ్రీ చేసే రోజులలో ఇల్లిల్లూ తిరిగి షేక్‌పేట్ పరిధిలో హోమ్ ట్యూషన్స్ చెప్పారు. డిగ్రీ కాగానే 1990లో సివిల్స్ పరీక్ష రాసి తొలి ప్రయత్నంలోనే సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్‌లో కొలువు సాధించినా, ఐఏఎస్ కోసం 1995లో మరోసారి సివిల్స్ రాసి జాతీయస్థాయిలో 15వ ర్యాంకు కొట్టి, 1996లో ఆదిలాబాద్ జిల్లాలో ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్‌గా చేరారు. ఉమ్మడి ఏపీలో పలు జిల్లాలకు కలెక్టరుగా సేవలందించిన ఆయన తెలంగాణ వచ్చాక హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా, బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పని చేశారు. ప్రస్తుతం ఆయన విద్యాశాఖ ముఖ్యకార్యదర్శిగా, రాష్ట్ర గవర్నర్‌కు ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వహస్తున్నారు. ఇంగ్లిష్‌లో ‘సెల్ఫీ ఆఫ్ సక్సెస్’అనే పుస్తకాన్ని రాసిన వెంకటేశం, బతుకమ్మ, తల్లిదండ్రుల గొప్పతనాన్ని వివరించే ‘అమ్మగీసీన బొమ్మను నేను’ అనే అద్భుతమైన పాటలు రాశారు. అంచెలంచెలగా ఎదిగి నిత్యకృషివలుడిగా పేరుపొందిన వెంకటేశం టీజీపీఎస్సీ బాస్ కావటంపై పలువురు విద్యావేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version