BRS Working President KTR speaking at Telangana Bhavan: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది గడిచిన అన్నిరంగాల్లో వెనుకబడి ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఏడాది పాలన ప్రజల దృష్ణికోణంలో ఓ విపత్తు అని ఆరోపించారు. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ ఇచ్చిన 420కి పైగా వాగ్ధానాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. హామీల అమలు కోసం తెలంగాణ ప్రజల తరఫున ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. ఏడాది కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరించిందన్నారు. అయినా తాము ప్రజా సమస్యలపై పోరాటం ఆపబోమన్నారు. ఈ మేరకు శనివారం ఓ న్యూస్ ఏజెన్సీతో మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో నేడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో శాసనసభాపక్షం సమావేశం అవుతున్నదన్నారు. అసెంబ్లీలో లేవనెత్తే ప్రజాసమస్యలపై నిర్ణయం తీసుకుంటామన్నారు.
బీఆర్ఎస్ అధికారం మాత్రమే కోల్పోయింది..
బీఆర్ఎస్ అధికారం మాత్రమే కోల్పోయిందని, పోరాడే తత్వాన్ని కాదని కేటీఆర్ అన్నారు. మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ రూపొందించిన షార్ట్ ఫిల్మ్‌ను శనివారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని విధంగా ఓడిపోయామని, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఒక్క సీటు కూడా రాలేదని గుర్తు చేశారు. ఎమ్మెల్సీ కవితను ఐదు నెలలు జైలులో పెట్టారన్నారు. కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారెంటీలను నమ్మి ప్రజలు ఓట్లు వేసి గెలిపించారని, కానీ బీఆర్ఎస్ పై ప్రజలకు అభిమానం తగ్గలేదన్నారు. కాంగ్రెస్‌లో చేరిన పదిమంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తే ఒక్కరు కూడా గెలవరని జోస్యం చెప్పారు.
లగచర్లలో భూసేకరణ రద్దు అయ్యేదాకా పోరాటం..
తెలంగాణ భవన్‌లో లగచర్ల భూసేకరణ బాధితులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసి తమ సమస్యలను వివరించారు. కేటీఆర్ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ పోరాటంలో వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం వేధింపులను మానుకొని బాధితుల డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా లగచర్లలో భూసేకరణ రద్దు అయ్యేదాకా బీఆర్ఎస్ ప్రజల పక్షాన నిలబడుతుందని, ఈ పోరాటం కొనసాగుతుందని కేటీఆర్ చెప్పారు. ప్రభుత్వం గిరిజన భూసేకరణ బాధితులపై అన్యాయంగా పెట్టిన కేసులన్నింటినీ బేషరతుగా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
బాధితుల పోరాటంతోనే నోటిఫికేషన్ రద్దు…
లగచర్ల బాధితులు చేసిన పోరాటానికి తలవంచి ప్రభుత్వం దిగి వచ్చిందని నోటిఫికేషన్ రద్దు చేసుకుందని కేటీఆర్ అన్నారు. ప్రజల అభ్యర్థనల మేరకు నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకోవాలన్నారు. గిరిజన భూములను వదిలి, రేవంత్ రెడ్డి కుటుంబానికి చెందిన వెల్దండలో ఉన్న 500 ఎకరాల భూములను సేకరణ చేసి పరిశ్రమల కోసం ఉపయోగించాలన్నారు. గిరిజనుల భూములు గుంజుకోవడం రేవంత్ దుర్మార్గానికి నిదర్శనమని మండిపడ్డారు. జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి తరపున, జైల్లో ఉన్న బాధితుల తరఫున, బీఆర్ ఎస్ న్యాయపోరాటానికి అండగా ఉంటుందని తెలిపారు.