Site icon Prime9

BRS Working President KTR: ఇదేనా ఇందిరమ్మ రాజ్యం, ప్రజాపాలన? బీఆర్ఎస్ కార్యకర్తల జోలికి వస్తే గుణపాఠం చెబుతాం

BRS Working President KTR demands arrest of Cong leaders for attack on Bhuvanagiri party office: భువనగిరిలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంపై ఎన్ఎస్‌యూఐ కార్యకర్తలు దాడి చేయడం తెలంగాణ రాజకీయాలను వేడెక్కించింది. సీఎం రేవంత్‌రెడ్డిపై యాదాద్రి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యాలయంపై దాడి చేశారు. కార్యాలయం అద్దాలు, ఫర్నీచర్ ధ్వంసం చేశారు. బీఆర్ఎస్ ఆఫీసు ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. దాడి గురించి తెలుసుకున్న బీఆర్‌ఎస్ కార్యకర్తలు పెద్దఎత్తున అక్కడికి చేరుకున్నారు. దీంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు ముట్టడికి బీఆర్ఎస్ శ్రేణులు యత్నించగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో వారంతా పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. భువనగిరి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై దాడిని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు.

దాడులు కాంగ్రెస్‌కు అలవాటే..
ప్రతిపక్ష పార్టీల కార్యాలయాలపై దాడులు చేయడం కాంగ్రెస్ పార్టీ అలవాటుగా మారిందని కేటీఆర్ విమర్శించారు. ఇందిర రాజ్యం పేరుతో అధికారంలోకి వచ్చి తెలంగాణలో గూండారాజ్యం చలాయిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, పార్టీ కార్యాలయాలపై దాడులు చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు త్వరలో తగిన బుద్ధి చెబుతారన్నారు. పదేళ్లపాటు ప్రశాంతంగా కొనసాగిన తెలంగాణ అరాచకాలకు చిరునామాగా మారిందని విమర్శించారు. దాడులు, గూండాగిరి తమ మార్కు పాలన అని కాంగ్రెస్ మరోసారి నిరూపించుకుంటుందన్నారు. బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, కార్యాలయాల జోలికి వస్తే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై దాడి చేసిన కాంగ్రెస్ గూండాలతోపాటు, వారి వెనుక ఉన్న నల్లగొండ జిల్లా కాంగ్రెస్ నాయకులను అరెస్టు వెంటనే చేయాలని డిమాండ్ చేశారు.

పదేళ్లు మేం ఇలాగే చేస్తే పరిస్థితులు ఇట్లా ఉండేవా? : హరీశ్‌రావు
మాజీ మంత్రి హరీశ్‌రావు కూడా దాడిని తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో విమర్శలు, ప్రతివిమర్శలు సహజమని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దాడుల విష సంస్కృతిని ప్రోత్సహిస్తున్నదని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి మాటలతో దాడులు చేస్తే, ఆ పార్టీకి చెందిన నాయకులు భౌతిక దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఇదేనా మీ సోకాల్డ్ ఇందిరమ్మ రాజ్యం అని ప్రశ్నించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో దాడులు జరిగి ఉంటే మీకు అడ్డగోలుగా మాట్లాడే పరిస్థితులు ఉండేవా అని కాంగ్రెస్‌ నాయకులపై మండిపడ్డారు. నిందితులను గుర్తించి, తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Exit mobile version