Site icon Prime9

Telangana Assembly 2024: అసెంబ్లీలో రగడ.. స్పీకర్‌పై పేపర్లు విసిరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

BRS members threw papers on the Speaker in the House in Telangana Assembly: అసెంబ్లీ రగడ నెలకొంది. ఫార్ములా ఈ రేసు కేసుకు సంబంధించిన అసెంబ్లీలో చర్చించాలని బీఆర్ఎస్ సభ్యులు పట్టుబట్టారు. నల్లా బ్యాడ్జీలు ధరించి సభకు వచ్చారు. ఫార్ములా ఈ రేసు కేసుపై చర్చ పెట్టాలని డిమాండ్ చేశారు. దీంతో స్పీకర్ తిరస్కరించడంతో బీఆర్ఎస్ సభ్యులు నిరసనకు దిగారు.

అయితే బీఆర్ఎస్ నినాదాల మధ్యే భూభారతి బిల్లుపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. కాగా, ఇది ఓ వ్యక్తికి సంబంధించిన కేసు అని స్పీకర్ నచ్చజెప్పినా బీఆర్ఎస్ నేతలు శాంతించలేదు. అంతేకాకుండా రాష్ట్రానికి సంబంధించిన బిల్లులను చర్చించిన తర్వాత చూద్దామని స్పీకర్ సూచించారు. అయినప్పటికీ బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన చేయడంతో స్పీకర్ తెలంగాణ అసెంబ్లీని 15 నిమిషాల పాటు వాయిదా వేశారు.

మరోవైపు అసెంబ్లీ ఆవరణలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారు. స్పీకర్‌ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అవమానించారంటూ ఆందోళన చేశారు. దళితుడైన స్పీకర్ మీద పేపర్లు విసిరి అవమానించారంటూ విమర్శలు చేస్తున్నారు. కాగితాలు చింపి స్పీకర్‌పై వేసి శాసనసభను అగౌరవపరిచారని ఆరోపించారు. ఎలాగైనా సభ నుంచి బయటకు రావాలి అనే విధంగా బీఆర్ఎస్ వ్యవహరిస్తోందన్నారు. చర్చ జరగకుండా సభను తప్పుదారి పట్టిస్తున్నారని ఎమ్మెల్యే రామ్మోహన్ పేర్కొన్నారు.

బీఆర్ఎస్ కోతి చేష్టలను తెలంగాణ సమాజం గమనిస్తోందని వేముల వీరేశం అన్నారు. వెల్‌లోకి రాకూడదు.. పేపర్లు విసరకూడదని బీఆర్ఎస్ రూల్స్ పెట్టిందన్నారు. ఇప్పుడు వెల్‌లోకి వచ్చి స్పీకర్‌పై పేపర్లు విసిరిన బీఆర్ఎస్ సభ్యులను ఎందుకు సస్పెండ్ చేయకూడదని వేముల వీరేశం ప్రశ్నించారు.

ఇదిలా ఉండగా, షాద్‌నగర్ ఎమ్మెల్యేపై బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. దళిత ఎమ్మెల్యేలకు చెప్పు చూపించారని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. శంకరయ్య చెప్పు చూపించాడని, ఆయనపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలన్నారు. అలాగే అసెంబ్లీ వీడియోలు బయటపెట్టాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.

Exit mobile version