Site icon Prime9

Alleti Maheshwar Reddy: కాంగ్రెస్ అవినీతిపై ఆధారాలున్నాయ్.. త్వరలోనే బట్టబయలు చేస్తా

BJP MLA Alleti Maheshwar Reddy Shocking Comments On Congress Ministers: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచినా ఏ ఒక్క హామీని పూర్తిగా అమలు చేయలేకపోయిందని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి విమర్శించారు. గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ నిర్లక్ష్యం వల్ల నిరుడంతా ఎగవేతల నామ సంవత్సరంగా ముగిసిందని, కనీసం ఈ కొత్త సంవత్సరంలోనూనా హామీలను గుర్తు తెచ్చుకుని అమలు చేయాలని సూచించారు.

త్వరలో ఆధారాలతో వస్తా..
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో వేల కోట్ల రూపాయల కుంభకోణాలు జరుగుతున్నాయని, ఏలేటి మహేశ్వర రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. స్కామ్‌లకు సంబంధించి పలు ఆధారాలను సేకరించానని, ఈ అవినీతిలో మంత్రుల హస్తం కూడా ఉందని ఆరోపించారు. మరో రెండు రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి కుంభకోణాన్ని బయట పెట్టబోతున్నానని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

అన్నీ గాలిమాటలు..
సీఎం రేవంత్‌రెడ్డి పాలనను గాలికొదిలేసి, సినిమా డైలాగులతో కాలం గడుపుతున్నారని మండిపడ్డారు. రైతు సమస్యల పరిష్కారంలో రేవంత్ ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని ఏలేటి విమర్శించారు. ప్రభుత్వం ఇచ్చిన మొదటి హామీ అయిన రైతు రుణమాఫీ విషయంలోనూ సర్కారు అబద్ధాలు చెబుతోందని, ఇక.. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క లేనిపోని గొప్పలు చెబుతున్నారని మహేశ్వర్‌రెడ్డి ఎద్దేవా చేశారు.

రైతు కూలీల నిధులు ఏవీ?
ప్రభుత్వం రైతు కూలీలకు కేటాయించిన నిధులు ఏవని ఏలేటి సవాలు చేశారు. 15లక్షల మంది ఉన్నట్లు రెవెన్యూ మంత్రి లెక్కలు చెప్పి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. రూ.9వేల కోట్లను డిసెంబర్ 28వ తేదీలోగా రైతుల ఖాతాల్లో వేస్తామని చెప్పి మంత్రులు తుమ్మల, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో సబ్ కమిటీ ఏర్పాటు వేసినా, దీనిపై కదలిక రాలేదన్నారు. శనివారం జరిగే కేబినెట్ భేటీలో రైతు భరోసాపై సరైన నిర్ణయం తీసుకోవాలన్నారు.

రూ.1,38,117 కోట్ల అప్పు..
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 390 రోజులలో రూ.1.38 లక్షల కోట్ల అప్పు చేశారని ఏలేటి ఆరోపించారు. రోజుకు రూ.354 కోట్ల అప్పు.. గంటకు రూ.14.70 కోట్ల అప్పు చేస్తోందన్నారు. ఎఫ్ఆర్ బీఎం పరిధి దాటి అప్పులు చేస్తూ కేంద్రాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని మండిపడ్డారు. రూ.30వేల కోట్ల కోసం 400 ఎకరాల భూమిని అప్పు తనఖా పెట్టిందని, బాండ్ల రూపంలో మరో రూ.30వేల కోట్ల అప్పు కోసం ప్రణాళికలు సిద్ధం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెచ్చిన అప్పులన్నీ దేనికి ఖర్చు పెడుతున్నారో అర్థం కావటం లేదని, ఇప్పటి వరకు కేవలం రూ.20వేల కోట్లను మాత్రమే రుణమాఫీకి కేటాయించారన్నారు. రూ. 1,18,000 వేల కోట్లను బడా గుత్తేదారులకు చెల్లించేందుకు ఖర్చు చేశారని సంచలన ఆరోపణలు చేశారు.

ఇందిరమ్మ ఇండ్లకు 80లక్షల దరఖాస్తులు..
ఇప్పటి వరకు ఇందిరమ్మ ఇండ్ల కోసం 80 లక్షల పైచిలుకు దరఖాస్తులు రాగా, వాటిపై ప్రభుత్వం తీసుకున్న చర్యలేమిటో వివరించాలని ఏలేటి నిలదీశారు. ఈసారి ఎంత మందికి ఇండ్లు ఇస్తారు? దీనికి సంబంధించిన విధివిధానాలు ఏమిటి? అంటూ ప్రశ్నించారు. సంక్రాంతి నాటికి 4 లక్షల మందికి ఇండ్లు ఇస్తామని మంత్రి పొంగులేటి ఎలా చెప్పారో అర్థం కావటం లేదని, దీనిపై మంత్రి వివరణనివ్వాలని కోరారు.

Exit mobile version