Ration cards: బిగ్ అలర్ట్.. రేపటినుంచి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు

AP New Ration Cards Application starts from tomorrow: ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు, పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రేషన్ కార్డులేని వారంతా కొత్త రేషన్ కార్డు తీసుకునేందుకు, పింఛన్లకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు రేపటినుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. సంక్రాంతి కానుకగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ జనవరిలో కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయనున్నారు.

కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే ప్రభుత్వం మార్గదర్శకాలు కూడా జారీ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇందులో భాగంగానే లబ్ధిదారులకు స్వయంగా అన్ని జిల్లాల కలెక్టర్లు కార్డులు అందించేలా కార్యాచరణ రూపొందించాలని కూటమి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఈ సారి కొత్తగా కార్డులు ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో మాదిరికాకుండా లబ్ధిదారులకు అందించే కొత్త కార్డులపై పాలకుల పేరు లేకుండా రాజముద్ర వేయించి పంపిణీ చేయనున్నట్లు సమాచారం. కాగా, రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1.50లక్షల కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నారు.