Eagle In Ap: ఉనికిలోకి ‘ఈగిల్’.. గంజాయి, డ్రగ్స్ నిర్మూలనకు జిల్లాకో నార్కొటిక్ సెల్ ఏర్పాటుకు ఉత్వర్వులు

AP to set up ‘Eagle’ headquarters in Amaravati: వైసీపీ హయాంలో రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ అమ్మకం, వాడకం విచ్చలవిడిగా పెరిగిపోయాయని విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. దేశంలో ఏ మూల గంజాయి, డ్రగ్స్ దొరికినా..దానికి ఏపీతో లింకులు ఉండడంపై తీవ్రస్థాయిలో చర్చ జరిగింది. ఈ క్రమంలోనే తాజాగా ఏపీలోని ఎన్డీఏ ప్రభుత్వం గంజాయి, డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతోంది. ఈ క్రమంలో ఎలైట్‌ యాంటీ నార్కోటిక్స్‌ గ్రూప్‌ ఫర్‌ లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌’ (ఈగల్‌)ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రాజధాని అమరావతిలో కేంద్ర కార్యాలయం, జిల్లాల్లో యూనిట్‌ కార్యాలయాలు ఏర్పాటు చేస్తూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్‌ విశ్వజిత్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

స్పెషల్ కమిటీలు..
స్కూళ్లు, కాలేజీలు, సచివాలయాల పరిధిలో 10 మంది సభ్యులతో ఈగల్ కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. ఆ కమిటీల్లో మహిళా సంఘాలు, ఆశా వర్కర్లకు కూడా చోటు కల్పిస్తారు. గంజాయి, డ్రగ్స్ వ్యవహారాల్లో విచారణకు విశాఖ, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, తిరుపతిలో ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ కోర్టుల ఏర్పాటుకు ఏపీ హైకోర్టుకు నివేదించారు. ఈగల్ ఫోర్స్‌కు ముందుగా రూ.8.59 కోట్లు కేటాయిస్తూ హోంశాఖ ముఖ్యకార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు.

జిల్లాకో సెల్..
అమరావతిలో నార్కోటిక్స్‌ పోలీస్‌స్టేషన్‌, 26 జిల్లాల్లో డిస్ట్రిక్ట్ నార్కోటిక్‌ సెల్స్ ఏర్పాటు కానున్నట్టు హోంశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. గంజాయి, డ్రగ్స్ సరఫరా, రవాణా నియంత్రణ, నేరాల దర్యాప్తు, విచారణపై ఈగల్ ఫోర్స్‌ కార్యాచరణ చేపట్టనుంది. ఈగల్ టాస్క్ ఫోర్స్‌లో పనిచేసే సిబ్బందిని డిప్యుటేషన్‌పై తీసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈగల్ ఫోర్స్‌లో చేరిన యూనిఫాం సర్వీసు ఉద్యోగులకు 30 శాతం ప్రత్యేక అలవెన్సు ఇవ్వనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది.