Site icon Prime9

AP Governor: రాష్ట్రాభివృద్ధే ఏకైక లక్ష్యం.. విజన్ 2047తో పేదరిక రహిత రాష్ట్రంగా ఏపీ

AP Governor Abdul Nazeer Speech At Republic Day 2025: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గణతంత్ర వేడుకలు ఘనంగా జ‌రిగాయి. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ గ్రౌండ్స్‌లో గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ జాతీయ జెండాను ఎగురవేశారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ప్రభుత్వ శాఖల శకటాల ప్రదర్శనను వీక్షించారు. ఈ సంద‌ర్భంగా గ‌వ‌ర్న‌ర్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం భారీగా అప్పులు చేసి సమస్యలు సృష్టించింది. విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు కేంద్రం నుంచి ప్రత్యేక ప్యాకేజ్‌ వచ్చేలా చేశాం. స్వర్ణాంధ్ర విజన్ దిశగా మా ప్రభుత్వం అడుగులు వేస్తోంద‌న్నారు.

విధ్వంసం నుంచి వికాసం దిశగా
గత ప్రభుత్వం భారీగా అప్పులు చేసి సమస్యలు సృష్టించిందని, ఆ విధ్వంసం నుంచి కోలుకుని ఏపీని తిరిగి గాడిలోపెట్టేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని గవర్నర్ తెలిపారు. ప్రజలకు ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం కలగాలనేదే తమ నినాదమని, రైతులు, పరిశ్రమల అవసరాలు తీర్చేలా నీరు అందిస్తామని గవర్నర్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని, వారి ఆకాంక్షలు నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన అన్నారు. అలాగే విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు కేంద్రం నుంచి ప్రత్యేక ప్యాకేజీ వచ్చేలా చేసినట్లు తెలిపారు.

విజన్ 20247 వెలుగులో..
స్వర్ణాంధ్ర 2047 విజన్ అనేది.. మన గణతంత్ర స్ఫూర్తి, మన కలలను ప్రతిబింబిస్తుంది. స్వర్ణాంధ్ర 2047 కోసం రూపొందించిన పది సూత్రాలు మన రాష్ట్ర పరివర్తనలో కీలకమైన పరిణామమని, పేదరికం లేని ఆంధ్ర ప్రదేశ్‌ను రూపొందించడమే కూటమి సర్కారు లక్ష్యమని గవర్నర్ తెలిపారు. రాష్ట్రాన్ని ప్రపంచానికి అనుసంధానించడానికి ఉన్న అపార తీరప్రాంతం.. రాబోయే రోజుల్లో ఏపీని అంతర్జాతీయ వాణిజ్యానికి గేట్‌వేగా మారుస్తుందని గవర్నర్ ప్రకటించారు.

సంక్షేమాన్ని పెంచాం.
కూటమి ప్రభుత్వం వచ్చాక నెలవారీ పెన్షన్‌ను రూ. 3వేల నుంచి రూ. 4 వేలకు పెంచామని, అందరికీ ఇళ్లు, దీపం 2.0 సహా ప్రజలను పేదరికం నుంచి బయటకు తీసుకురావడానికి వంటి పలు కార్యక్రమాలు చేపట్టామని గవర్నర్ తెలిపారు. పేదరిక నిర్మూలన కార్యక్రమాలను పూర్తి చేస్తూ, ‘జీరో పావర్టీ-పీ4 పాలసీని మరింత ముందుకు తీసుకువస్తోంది. ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, ఓబీసీలు, మహిళలు సంక్షేమం, అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని అబ్దుల్ నజీర్ వ్యాఖ్యానించారు. సమ్మిళిత వృద్ధి, సహా బలమైన సామాజిక-ఆర్థిక అభివృద్ధిని పెంపొందింపజేస్తామని గవర్నర్ తెలిపారు.

ఆక‌ట్టుకున్న శ‌క‌టాల ప్ర‌ద‌ర్శ‌న‌..
ఈ సందర్భంగా పరిశ్రమలు, పర్యాటక, సెర్ప్‌, గృహనిర్మాణ శాఖ , పాఠశాల విద్య, నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్ శకటాలు ఆకట్టుకున్నాయి. అదేవిధంగా ఆరోగ్యశాఖ, మహిళాశిశు సంక్షేమం, జలవనరుల శాఖ, అటవీ, వ్యవసాయ, మత్స్య శాఖ , ఏపీసీఆర్‌డీఏ, పంచాయతీరాజ్, ఇంధనశాఖ ఉద్యాన, స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర, ఆర్‌టీజీఎస్ శకటాలు ఆకట్టుకున్నాయి.

Exit mobile version
Skip to toolbar