AP Fibernet 410 Employees Removed: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీ ఫైబర్ నెట్‌లో కొంతమంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు 410 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లుగా ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ జీవీ రెడ్డి ప్రకటించారు. అలాగే ఉద్యోగులను నియమించిన వ్యక్తులను సైతం లీగల్ నోటీసులు ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది.
వైసీపీ హయాంలో అర్హత లేకుండా ఉద్యోగులను నియామకం చేసినట్లు గుర్తించారు. ఫైబర్ నెట్‌లో నియమితులైన వారిలో కొంతమంది వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యే ఇళ్లల్లో పనిచేసిన వాళ్లే ఉద్యోగులుగా ఉన్నట్లు గుర్తించారు. అలాగే ఏపీ ఫైబర్ నెట్ నుంచి ఆర్జీవీకి కోటి 15లక్షల అక్రమంగా చెల్లింపులు జరిగినట్లు గుర్తించారు. ఈ నగదును తిరిగి వర్మ చెల్లించకుంటే కేసు నమోదు చేస్తామని జీవీ రెడ్డి వెల్లడించారు.
అర్హత లేని వ్యక్తులకు ఇష్టానుసారంగా జీతాలు ఇచ్చినట్లు ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి వివరించారు. ఎమ్మెల్యేలు, ఎంపీల సిఫార్సు లేఖలతోనే ఉద్యోగాలు ఇచ్చినట్లు గుర్తించారు. అంతేకాకుండా సంస్థలో కాకుండా నేతల ఇళ్లలోనే ఉద్యోగులు పని చేసినట్లు తెలిసిందన్నారు. ఎక్కడో చేసిన పనికి ఫైబర్ నెట్ సంస్థ నుంచి వేతనాలు చెల్లింపులు జరిగాయన్నారు.
2019 నుంచి 2024 మధ్యలో దాదాపు 1200 పైచిలుకు ఉద్యోగులను నియమించుకున్నారన్నారు. అయితే ఇందులో చాలామంది కడప ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు మరో ఇద్దరు వైసీపీ నేతలు రెఫర్ ఇవ్వడంతో ఆనాడు ఎండీగా ఉన్న మధుసూదన్ రెడ్డి నియమించారు. అమితే అవసరాల మేరకు రిక్రూట్ మెంట్ జరగలేదన్నారు. ఇందులో 75శాతం వరకు అవసరం లేదన్నారు.