US Elections: ఆ రిజల్ట్స్ సస్పెన్స్.. రెండు రాష్ట్రాలు మినహా అన్నింటా ఫలితాలు

US Presidential Election Results: అమెరికాలో అధ్యక్షఎన్నికలు ముగిశాయి. అంతా సర్దుకుంది. ఎవరికి వాళ్లు ప్రశాంతంగా తమ పనులు చేసుకుంటున్నారు. డొనాల్డ్ ట్రంప్ అయితే జనవరిలో అధ్యక్ష బాధ్యతలు తీసుకునేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. అంతా బాగానే ఉంది కానీ ఇంకా రెండు రాష్ట్రాల్లో ఫలితాలు వెలువడలేదు. ఆరిజోనా, నెవడా రాష్ట్రాలు నేటికీ ఫలితాలు రావాల్సి ఉంది.

ఎందుకలా?
ఫలితాల ఆలస్యం పోస్టల్ బ్యాలెట్లే కారణమని పలువురు అంటున్నారు. అవి అందడానికి ఇంకా 10 రోజుల సమయం పడుతుందని చెబుతున్నారు. అవి వచ్చేవరకు ఫలితాలు ప్రకటించరు. 2020లో అయితే ఐదురోజుల్లోనే ప్రకటించారు. ఇప్పుడు ఎక్కువ సమయం పడుతోంది. అయితే రెండుచోట్ల కూడా డొనాల్డ్ ట్రంప్ ఆధిక్యంలో ఉన్నారు.

నెవడాలో 94 శాతం కౌంటింగ్ పూర్తయింది. పోస్టల్ బ్యాలెట్లు వస్తే సంపూర్ణమవుతుంది. ఇక్కడ ట్రంప్ కి 51 శాతం ఓట్లు వస్తే, కమలా హారిస్‌కు 47.2 శాతం ఓట్లు వచ్చాయి. ఇక ఆరిజోనాలో చూస్తే ఇప్పటి వరకు 70 శాతం ఓట్లు లెక్కించారు. ఇందులో ట్రంప్‌కు 52.3, ప్రత్యర్థి కమలా హారిస్‌కు 46.8 శాతం ఓట్లు పోలయ్యాయి.

ఫలితాలు ఎలా ఉన్నా, కమలా హారిస్ కి పెద్దగా కలిసి వచ్చేది లేదు. ఎందుకంటే ట్రంప్.. విజయానికి అవసరమైన 270 ఓట్లను దాటి 295 సాధించారు. అటు కమల హారిస్ అయితే 226 ఓట్లు మాత్రమే సాధించారు. అందుకే ఇవి నామ్ కే వాస్తేగా మారిపోయాయి. అందరూ అనుకున్నట్టు పోటాపోటీ జరిగి, ఈ రెండు సీట్లే కీలకమైతే మాత్రం భలే టెన్షన్ నడిచేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.