Site icon Prime9

Temperature in earth: పుడమి నొప్పులు పట్టించుకోలేమా?

Records season’s lowest temperature in World: ఇది శీతాకాలమేనా? ఒకప్పుడు ఎలా ఉండేది. హైదరాబాద్‌లో ఈ సమయమంతా గజగజ వణకడమేకదూ? ఇప్పుడు ఆ చలి పులి భయమే లేదు. మూడు, నాలుగు నెలల క్రితం చూడండి. వద్దంటే వర్షాలు.. అచ్చం మేఘాలయలోలాగా. చిరపుంజి, మౌసిన్‌రామ్‌లోలాగా నిత్యం వానే. చిత్తడి చిత్తడే. ఇక ఎండాకాలంలో భరించలేనంత వేడి. అదీ ఒకటి, రెండు నెలలు ముందుగానే. ఏతావతా.. రుతువులు క్రమం తప్పుతున్నాయి. భాగ్యనగరమే కాదు.. ప్రపంచంలో ప్రతిమూలా ఇలాంటి అసాధారణ వాతావరణమే. గత వారం.. మంచు తుఫానుతో అమెరికాలోని పలు నగరాలు గడ్డకట్టుకుపోయాయి. మొత్తంగా చూస్తే.. ఆకస్మికంగా పెరిగే ఉష్ణోగ్రతలు, నిండా ముంచేసే వరదలు, ఆగని కార్చిచ్చులతో జనజీవనమే అతలాకుతలమైపోతోంది. ఒకప్పుడు అరుదుగా కనిపించే విపత్తులు, వాతావరణంలో అనూహ్య మార్పులు నానాటికీ పెరిగిపోతున్నాయి. ఇదంతా మామూలే అన్న ధోరణికి ఆ పరిస్థితులు చేరుతున్నాయి. భూగోళానికి ఏదో జరుగుతోందనే భయం కలుగుతోంది. అయితే, వాతావరణంలో కనిపించే ఈ విపరీతమైన మార్పులకు కారణం మనమే. శిలాజ ఇంధనాలను ఎడాపెడా వాడేయడం ద్వారా గత శతాబ్దకాలంలో కార్బన్ డై ఆక్సైడ్, మిథేన్ వంటి గ్రీన్‌హౌజ్ వాయువులు భూగోళాన్ని పూర్తిగా కమ్మేశాయి. ఫలితంగా భూతాపం పెరిగింది. భూఉష్ణోగ్రతల పెరుగుదల ప్రకృతి విపత్తులకు కారణమవుతోంది. భూతాపం కట్టడికి ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకోకుంటే వినాశనం తప్పదు. వాతావరణంలో అసాధారణ మార్పులు, వాటి పర్యవసానాలను తరచూ చవిచూస్తున్నాం.

పెరుగుతున్న ప్రపంచ ఉష్ణోగ్రతల్లాగానే హరికేన్లు కూడా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. సెప్టెంబర్ 2022లో ఫ్లారిడా, ప్యుర్టోరికోలను గాలివానలు చుట్టుముట్టాయి. హరికేన్ ఫ్యూనా చేసిన నష్టం అంతా ఇంతా కాదు. విద్యుత్తు, మంచినీరు లేకపోవడంతో ప్యుర్టోరికో ప్రజలు విలవిల్లాడిపోయారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు అధిక వర్షాలకు దారితీస్తాయి. సాధారణంగా వేడి వాతావరణం వల్ల నీరు ఆవిరై గాలిలో తేమగా మారి, తుంపరులుగా మారి వర్షాన్ని కురిపిస్తుంది. భూవాతావరణంలో వేడి పెరిగితే, మరింత నీరు ఆవిరిగా మారి, మరిన్ని మేఘాలు ఏర్పడి, భారీ వర్షాలు కురుస్తాయి. కొన్నిసార్లు పరిమిత ప్రాంతానికి పరిమిత సమయం మాత్రమే వాన దబదబా దంచేస్తుంది. ఇటీవల హైదరాబాద్‌లో మనం దీనినే తరచూ చూస్తున్నాం. ఈ క్లౌడ్‌బరస్ట్‌ వలనే గతంలో స్పెయిన్, ఆస్ట్రేలియాలను వరదలు ముంచెత్తాయి. బ్రిస్బేన్ వార్షిక సగటు వర్షపాతంలో 80% కేవలం ఆరు రోజుల్లోనే నమోదు అయిందంటే ఆ మార్పుల ప్రభావం ఏ మేర ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఇక.. ఉత్తరార్థగోళంలో కొన్ని ప్రాంతాల్లో కార్చిచ్చుల ముప్పు కూడా వేగంగా పెరుగుతోంది. అమెరికా పశ్చిమ ప్రాంత జనజీవనంలో వైల్డ్ ఫైర్స్ భాగమే అయినా.. దాని వ్యాప్తి, ప్రచండత ఇటీవల బాగా పెరుగుతోంది. ఫ్రాన్స్, స్పెయిన్, పోర్చుగల్, గ్రీస్, క్రొయేషియా, ఆల్బేనియాలను ఇలాంటి కార్చిచ్చులే ఇటీవల చుట్టుముట్టాయి. 1970 నాటితో పోల్చుకుంటే.. 40 చదరపు కిలోమీటర్ల మేర కమ్మేసే కార్చిచ్చులు పశ్చిమ అమెరికాలో ఏడు రెట్లు పెరిగాయని పర్యావరణ శాస్త్రవేత్తల అంచనా. రెండేళ్ల నాడు కెనడాలో వేడిగాలులు అనూహ్య వేగంతో దావానలాన్ని రగిలించగా, అది కార్చిచ్చుగా మారి సమీప ప్రాంతాలన్నీ తగలబడ్డాయి. 2020లో కాలిఫోర్నియాలో 40 లక్షల ఎకరాల మేర భస్మీపటలం కాగా, వారంనాడు మళ్లీ అలాంటిదే భారీ ఆస్తి నష్టానికి కారణమైంది. మరోవైపు, వేడి పెరిగే కొద్దీ వాతావరణం పొడిగా మారిపోతుంది. భూతాపం పెరిగితే.. నీటివనరులు, భూమిపొరల్లోని తేమ త్వరితంగా ఆవిరి అవుతుంది. దాని వల్ల భూమి వేడెక్కే సమయం తగ్గిపోయి.. భూమిపై గాలి వేడెక్కుతుంది. తద్వారా మరింత వేడి పెరుగుతుంది. వేడివాయువులు తీవ్రంగా, సుదీర్ఘకాలం ఉండే కొద్దీ కరువు ఛాయలు పెరుగుతాయి. అమెరికాలో లేదా ఇతర దేశాల్లో దుర్భిక్షం తీవ్రంగా, ఎక్కువ కాలం కొనసాగడానికి కారణం ఇదే. గత 1200 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా పశ్చిమ అమెరికాలో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ప్రాంతమంతా అత్యంత, అసాధారణ కరువును చవిచూస్తోంది. ఉష్ణోగ్రతల్లో స్వల్ప హెచ్చుతగ్గులు వాతావరణంలో అసాధారణ మార్పులకు దారితీస్తున్నాయి.

భూమి వేడెక్కడం వల్ల సముద్రజలాలు కూడా వేడెక్కి మంచుదిబ్బలు కరగడానికి కారణమవుతోంది. శతాబ్దాలుగా గడ్డ కడుతూ వచ్చిన గ్లేసియర్లు వేగంగా కరిగిపోతుంటాయి. అలాస్కాలోని కొలంబియా గ్లేసియర్ ఇందుకు చక్కటి ఉదాహరణ. ప్రస్తుతం ఆ గ్లేసియర్ దాదాపు మాయమైనట్టే. గ్లేసియర్లు సూర్యకాంతిని పరావర్తనం చెందేలా చేస్తాయి. అలా భూమి వేడెక్కకుండా కాపాడుతుంటాయి. భూమిపై ఉన్న స్వచ్ఛమైన నీటిలో అధిక శాతం గ్రీన్‌లాండ్, అంటార్కిటికా మంచు ఫలకాల్లోనే ఉంది. అంటార్కిటికా కన్నా గ్రీన్‌లాండ్ గ్లేసియర్లు శరవేగంగా కరిగిపోతున్నాయి. ఇక్కడి మంచు ఫలకాలు వరుసగా 26వ ఏడు కూడా భారీగా కరిగిపోయాయి. గతంలో లెక్కించిన దాని కన్నా వందరెట్లు వేగంగా మంచుఫలకలు మాయమవుతున్నాయని తాజా పరిశోధనల్లో తేలింది. ఇలా హిమానీనదాలు కరగడం వల్ల సముద్రమట్టాలు పెరుగుతున్నాయి. ఇక.. గ్రీన్‌లాండ్‌లోని గ్లేసియర్లన్నీ కరిగిపోతే.. 6 మీటర్ల మేర సముద్రమట్టం పెరిగేంత నీరు వస్తుందని అంచనా. అంటార్కిటిక్ ఐస్ షీట్ మొత్తం కరిగిపోతే 17 మీటర్ల మేర మట్టాలు పెరిగే ప్రమాదం ఉంది. గత 150 ఏళ్లలో గ్లేసియర్లు కరిగిపోవడంతో ఇప్పటికే 20 సెంటీమీటర్ల మేర సముద్ర నీటి మట్టాలు పెరిగాయి. అమెరికాతీరాన అట్లాంటిక్, గల్ఫ్ ఆఫ్ మెక్సికో సముద్ర నీటిమట్టాల పెరుగుదల ప్రపంచంలోనే అత్యధిక స్థాయిలో ఉన్నాయి. రికార్డు స్థాయి వర్షాలు దీనికి తోడు కావడంతో భీకర వరదలను అమెరికా తీర ప్రాంతాలు చవిచూశాయి. 1993 నుంచి లెక్కిస్తే.. సముద్ర నీటిమట్టాలు రెండింతలు పెరిగాయి. మరోవైపు, వేడి వాతావరణం వల్ల ఆవిరయ్యే నీరు.. ఆ తర్వాత ఉష్ణోగ్రతలు తగ్గినప్పుడు భారీగా మంచు కురవడానికి కారణమవుతోంది. 2021 నాటి మంచు తుఫాను టెక్సస్‌లో 295 బిలియన్ల డాలర్ల నష్టాన్ని కలగజేసింది.

మానవ ప్రమేయం వల్లే పర్యావరణంలో విపరీతమైన మార్పులు సంభవిస్తున్నాయి. అమెరికాలో కార్చిచ్చులు, భారత్, పాకిస్థాన్‌లలో అధిక ఉష్ణోగ్రతలు, ఆసియాలో తుఫాన్లు, బ్రిటన్‌లో రికార్డు స్థాయి వర్షాలను అధ్యయనం చేసిన నిపుణులు, శాస్త్రవేత్తలు ఇదే అంశాన్ని స్పష్టం చేశారు. ప్రకృతి నుంచి తీసుకోవడమే కానీ.. తిరిగి ఇచ్చే అలవాటు తగ్గిపోవటం వల్లే ఈ వైపరీత్యాలన్నీ సంభవిస్తున్నాయని వారు హెచ్చరిస్తున్నారు. వాతావరణంలో చోటుచేసుకుంటున్న పెడ మార్పులపై ప్రపంచవ్యాప్తంగా 400 తులనాత్మక సమీక్షలు జరిగాయి. పర్యావరణ మార్పులకు మానవుల ప్రమేయమే కారణమని 80% సమీక్షలు కుండబద్దలు కొట్టాయి.

Exit mobile version