Site icon Prime9

Nelson Mandela: ప్రపంచపు మనో ఫలకం మీద చెరగని ముద్ర.. నల్లజాతి ధిక్కార బావుటా.. మండేలా

Nelson Mandela An indelible mark on the tablet of the world’s mind: ఆధునిక ప్రపంచ చరిత్రలో వివక్షకూ, నిరంకుశత్వానికీ చిరునామాగా నిలిచిన దేశాలలో దక్షిణాఫ్రికా ఒకటి. దీర్ఘకాలం వలస పాలకుల చేతిలో మగ్గిన ఈ దేశంలో స్వాతంత్ర్యం కోసం ఒక యోధుడు చేసిన పోరాటం మానవజాతి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. నల్లజాతి వారు మనుషులే కాదనే అహంకారంతో పాలన చేసే అక్కడి ప్రభుత్వాన్ని, శ్వేతజాతి పాలకులను తన సంకల్పబలంతో తలవంచేలా చేసిన ఆ పోరాట వీరుడే.. నెల్సన్ మండేలా. మొదటి ప్రపంచయుద్ధం తర్వాత దాని ప్రతికూల ప్రభావంతో ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు కరువు, కాటాకల బారిన పడ్డాయి. ఆ కాలంలోనే పలు దేశాలలో ప్రత్యామ్నాయ రాజకీయ నాయకత్వాలు పుట్టుకొచ్చాయి. అయితే, ఆ యుద్ధంలో ఇంగ్లండ్ గెలుపుతో, దక్షిణాఫ్రికాలో మాత్రం ఎలాంటి మార్పులు రాకపోగా, అక్కడి బ్రిటిష్ పాలకుల బలం మరింత పెరిగి, ప్రజలను మరింత పీడించటం మొదలైంది. అయితే, అప్పటికే అక్కడ మహాత్మా గాంధీ నాయకత్వంలో సాగిన హక్కుల పోరాటం.. ప్రజల్లో రాజకీయ చైతన్యానికి, పోరాటాలకు ఒక భూమికను ఏర్పాటు చేశాయి. ఈ పోరాటాలు.. తెల్లవారి పెత్తనాన్ని ప్రశ్నించేలా అక్కడి నల్లవారిని సమైక్యంగా నిలబెట్టే రోజుల్లో 1918 జులై 18న మండేలా జన్మించారు.

ఈయన అసలు పేరు.. నెల్సన్‌ రోలిహ్లాహ్లా మండేలా. మాడిబా అనేది ఆయన ముద్దుపేరు. తల్లిదండ్రులు.. గాడ్లా హెన్నీ, నోసెకెని ఫాన్నీ. వీరిది థెంబు తెగ. మాతృ భాష.. హోసా. మండేలా తండ్రి థెంబు తెగలో పేరున్న నాయకుడు. ఈయనకు నలుగురు భార్యలు కాగా, మండేలా తల్లి మూడవ భార్య. అక్షర జ్ఞానమే లేని ఈ థెంపు తెగలో తొలిసారి బడిలో చేరింది మండేలాయే. అక్కడి క్రైస్తవ టీచరు తొలిరోజు రిజిష్టర్‌లో పేరు రాస్తూ ‘నెల్సన్’అనే పేరు చేర్చి.. నెల్సన్ మండేగా మార్చింది. పాఠశాల విద్య తర్వాత పైచదువులకు వెళ్లటానికి తెగ ఆచారాలు ఒప్పుకోలేదు. దీంతో రాబోయే రోజుల్లో తెగకు నాయకత్వం వహించే అవకాశాన్ని వదులుకుని ఆయన విట్‌వాటర్‌సాండ్‌ విశ్వవిద్యాలయంలో లా చదివారు. వర్సిటీ రాజకీయాల ప్రభావంతో నల్లజాతీయుల విముక్తికోసం అప్పటికే ఉద్యమిస్తున్న ఆఫ్రికన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌లో మండేలా సభ్యుడయ్యారు. 1944లో ఆ సంస్థ యూత్ వింగ్ అధ్యక్షుడిగా పేరొందారు. చదువు పూర్తి కాగానే నల్లజాతి వారికి న్యాయ సలహాలిచ్చేందుకు ఒక సంఘాన్ని ఏర్పాటు చేశారు. 1948 నుంచి తన బాల్యమిత్రుడు, ఆఫ్రికన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ సభ్యుడు అలీవర్‌ టాంబోతో కలిసి దక్షిణాఫ్రికా అంతా పర్యటిస్తూ.. జాతి వివక్ష, ప్రభుత్వపు దుర్మార్గపు చట్టాల మీద ప్రచారం చేస్తూ ప్రజల్లో చైతన్యం తెచ్చారు. నల్లజాతీయులకు పూర్తి స్థాయి పౌరసత్వం ఇవ్వాలని అహింసా పద్ధతులలో సమ్మెలు, బాయ్‌కాట్లు, శాసనోల్లంఘనలకు చొరవ చూపారు. నల్లజాతీయుల స్వేచ్ఛ కోసం 1955లో ‘ఫ్రీడమ్‌ చార్టర్‌’ అనే హక్కుల పత్రాన్ని మండేలా రూపొందించి, ప్రకటించారు. దీంతో కన్నెర్ర జేసిన సర్కారు ఆ పత్రాన్ని నిషేధించటమే గాక డిసెంబర్‌ 5,1956న మండేలాతో బాటు 155 మంది ఉద్యమకారులను దేశద్రోహం కేసు కింద అరెస్టు చేసింది. కానీ, ఈ కేసును 1961లో న్యాయస్థానం కొట్టివేసింది.

మండేలా ఈ కేసులో జైలులో ఉండగా జరిగిన ఓ ఘటన మండేలాను సాయుధుడిగా మార్చింది. అదే.. షార్ప్‌విల్లే హత్యాకాండ. దేశంలోని పెరుగుతున్న స్వాతంత్ర్య ఆకాంక్షలను అణిచివేసేందుకు పదహారేళ్లు దాటిన నల్లజాతి యువత అంతా ప్రభుత్వం జారీ చేసే గుర్తింపు పత్రాన్ని ఎప్పుడూ వెంట ఉంచుకోవాలంటూ బ్రిటిష్ సర్కారు ఓ చట్టం తెచ్చింది. దీనికి వ్యతిరేకంగా ఆఫ్రికన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ క్రమంలోనే 1960, మార్చి 21న సుమారు ఏడువేల మంది నల్లజాతి ఉద్యమకారులు ‘మా దగ్గర ఎలాంటి పత్రాలు లేవు. మమ్మల్ని వెంటనే అరెస్టు చేయండి!’ అని నినదిస్తూ.. శాంతియుతంగా షార్ప్‌విల్లే పోలీసుస్టేషన్‌ను ముట్టడించగా, వారిపై బ్రిటిష్ అధికారులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 69 మంది చనిపోగా, 29 మంది చిన్నారులతో సహా 260 మంది వరకు గాయపడ్డారు. దీంతో అహింసా పోరాటంతో లాభం లేదనే భావన అక్కడి నల్లజాతి యువతలో ఏర్పడిపోయింది. ఆ ఘటన జరిగిన కొన్నాళ్లకు మండేలా జైలు నుంచి విడుదల కావటం, అదే ఏడాది ఏర్పాటైన ఉఖంటో వి సిజ్వే (జాతి చేతిలోని బల్లెం) లేదా ‘ఎమ్‌ కె’ అనే సంస్థలో సభ్యుడయ్యారు. ఆఫ్రికన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌కు అనుబంధంగా పనిచేసే సాయుధ సంస్థగా ఇది గుర్తింపు పొందింది. గెరిల్లా పంథాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలనేది దీని లక్ష్యం. దీనికోసమే మండేలా అల్జీరియా వెళ్లి కొద్దికాలం గెరిల్లా యుద్ధతంత్రంలో శిక్షణ పొంది వచ్చారు. కానీ దేశంలో అడుగుపెట్టగానే 1962, ఆగస్ట్‌ 5న సర్కారు ఆయనను అరెస్టు చేసింది. విచారణ తరువాత మండేలాను జూన్‌ 12, 1964న కేప్‌టౌన్‌కు సమీపంలోని రూబెన్స్‌ ఐలెండ్‌ జైలుకు తరలించారు. అలా జైలు వెళ్లిన మండేలా.. తిరిగి బయట అడుగు పెట్టటానికి 27 ఏళ్లు పట్టింది.

జైలు జీవితం మండేలాను మరింత యోధుడిగా మలచింది. రోజూ వచ్చి తిండిపెట్టే సిబ్బంది మినహా మరో మనిషి కనబడని చీకటి గదిలో ఏకాంత ఖైదీగా గడిపారు. అప్పుడప్పుడూ భార్య విన్నీ మండేలాను తప్ప 27 ఏళ్లలో మరొకరిని చూడలేకపోయారు. ఖైదీ నం. 46664 ముద్రతో జైలులో రాళ్లు కొట్టారు. ఈ కాలంలోనే ప్రపంచవ్యాప్తంగా బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య వీచికలు మొదలయ్యాయి. అటు మండేలా విడుదలకు అంతర్జాతీయ ఒత్తిళ్లూ దక్షిణాఫ్రికా సర్కారు మీద పెరిగాయి. దీంతో స్వస్థలమైన ట్రాన్స్‌కెయికే పరిమితమైతే రిలీజ్ చేస్తామని మండేలాకు ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే,‘జాతి వివక్ష ఎన్ని రూపాల్లో ఉన్నా.. దానిని ద్వేషిస్తున్నాను. దీనిపై చివరి వరకు పోరాడతాను’ అని బదులిచ్చారు. 1973 నుంచి 1988 వరకు పలుసార్లు ఇలా ప్రభుత్వం చర్చలు జరుపుతూనే వచ్చినా, ఆయన మెత్తబడలేదు. మరోవైపు, ఈ జైలు జీవితంతో ఆరోగ్యం క్షీణించి, టీబీ సోకింది. దీంతో భయపడిన బ్రిటిష్ పాలకులు ఎట్టకేలకు దిగివచ్చి, 1990, ఫిబ్రవరి 11న మండేలాను విడుదల చేశారు.

పుట్టినప్పుడు మనుషులంతా ఒకేలా ఉంటారని, పరిస్థితులే మనుషులను మంచి, చెడు వైపు నడిపిస్తాయని నమ్మిన మండేలా 1994 ఎన్నికల్లో దేశానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆ సమయంలోనే ఆయన దేశంలోని తెలుపు, నలుపు రంగుల మనుషుల మధ్య నిలిచిన గోడలను బద్దలు కొట్టారు. తెల్లవారి ఆట అయిన రగ్బీని ఇకపై నల్లవారూ అడాలని పిలుపునిచ్చారు. తన పాలనా కాలంలో దేశంలో భూ సంస్కరణలు, తాగునీటి సదుపాయాలు తీసుకొచ్చారు. దేశవ్యాప్తంగా 500 ఆసుపత్రులు నిర్మించారు. దేశవ్యాప్తంగా ఉన్న 15 లక్షలమంది బాల బాలికలను నాలుగేళ్ల కాలంలో బడిబాట పట్టించారు. ఆయన సుదీర్ఘ పోరాటానికి గుర్తుగా 1993లో నోబెల్‌ శాంతి బహుమతిని అందుకున్నారు. ఆయన పుట్టిన రోజైన జులై 18ని ‘మండేలా డే’ గా ఐరాస జనరల్‌ అసెంబ్లీ 2009 నవంబర్‌లో ప్రకటించింది. 1990లో భారతరత్న పురస్కారాన్ని మండేలా స్వీకరించారు. చివరి రోజుల్లో ఆయన భార్యమీద వచ్చిన అవినీతి ఆరోపణలు, తర్వాత ఆమెతో విడాకులు తీసుకోవటం, కుమారుడి మరణంతో బాగా కుంగిపోయారు. తనను ఒక నేతగా గాక మామూలు మనిషిగానే గుర్తించాలని, ఒక మనిషిగా తనకూ కొన్ని బలహీనతలున్నాయని నిజాయితీగా, సవినయంగా ప్రపంచానికి మనవి చేశారు. జీవితపు చివరి నిమిషం వరకు ప్రపంచం ముందు తన జీవిత పుస్తకాన్ని తెరిచే ఉంచిన అరుదైన నేతగా నెల్సన్ మండేలా ప్రపంచపు మనో ఫలకం మీద చెరగని ముద్ర వేశారు. ఆయన వర్థంతి సందర్భంగా ఆ హక్కుల నేతకు ఘన నివాళి.

Exit mobile version