Najib Razak: మలేసియా మాజీ ప్రధాని నజీబ్​ రజాక్​కు 12 ఏళ్ల జైలు శిక్ష

అధికార దుర్వినియోగం, అవినీతి కేసుల్లో దోషిగా తేలిన మలేసియా మాజీ ప్రధాని నజీబ్​ రజాక్​కు జైలు శిక్ష ఖరారైంది. లోయర్‌ కోర్టు తనకు విధించిన 12 ఏళ్ల శిక్షను రద్దు చేయాలంటూ నజీబ్​ చేసిన విజ్ఞప్తిని మలేసియా ఫెడరల్​ కోర్టు మంగళవారం తోసిపుచ్చింది.

  • Written By:
  • Publish Date - August 24, 2022 / 07:44 PM IST

Malaysia: అధికార దుర్వినియోగం, అవినీతి కేసుల్లో దోషిగా తేలిన మలేసియా మాజీ ప్రధాని నజీబ్​ రజాక్​కు జైలు శిక్ష ఖరారైంది. లోయర్‌ కోర్టు తనకు విధించిన 12 ఏళ్ల శిక్షను రద్దు చేయాలంటూ నజీబ్​ చేసిన విజ్ఞప్తిని మలేసియా ఫెడరల్​ కోర్టు మంగళవారం తోసిపుచ్చింది. నజీబ్ అప్పీల్​లో మెరిట్ లేదని, ఆయన శిక్షను వెంటనే అమలు చేయాలని చీఫ్​ జస్టిస్​ మియామున్​ ట్వాన్​ మాట్ తీర్పిచ్చారు. కోర్టు తీర్పుతో నజీబ్, ఆయన ఫ్యామిలీ, మద్దతుదారులు విచారంలో మునిగిపోయారు. మాజీ ప్రధానులలో జైలుపాలైన తొలి వ్యక్తి నజీబ్​ రజాక్. 1 మలేసియా డెవలప్​మెంట్​ బెర్హాద్(1ఎండీబీ) స్కాం కేసులో హైకోర్టు నజీబ్​కు 12 ఏళ్ల జైలు శిక్ష విధించింది. మూడు శిక్షలను ఏకకాలంలో అమలు చేయాలని అధికారులను ఆదేశించింది. దీనిపై నజీబ్​ ఫెడరల్​ కోర్టుకు అప్పీల్‌కు వెళ్లారు. అక్కడా చుక్కెదురైంది. నజీబ్​కు శిక్ష విధించడం సబబేనని ఫెడరల్​ కోర్టు ప్యానెల్​ తేల్చి చెప్పింది. ఈ కేసులో ఇదే తుది తీర్పు కావడంతో నజీబ్​ ఇక జైలుకెళ్లక తప్పదని అధికారవర్గాలు తెలిపాయి.

ఇక మలేసియా ప్రధానిగా 2009లో నజీబ్​ రజాక్​ బాధ్యతలు చేపట్టారు. ఆ వెంటనే 1ఎండీబీ పేరుతో డెవలప్​మెంట్​ ఫండ్​ను ఏర్పాటు చేశారు. ఈ ఫండ్​లో అక్రమాలు జరిగాయని, నిధులను నజీబ్ తన సొంత ఖాతాల్లోకి మళ్లించుకున్నాడని ఆరోపణలు వచ్చాయి. దాదాపు 4.5 బిలియన్​ అమెరికన్​ డాలర్లు కాజేశారని ఆడిట్‌లో తేలింది. 1ఎండీబీకి అనుబంధంగా ఏర్పాటు చేసిన ఎస్​ఆర్​సీ ఇంటర్నేషనల్​సంస్థ నిధుల్లోనూ గోల్​మాల్​ జరిగిందని, 9.4 మిలియన్​డాలర్లు అక్రమంగా వాడుకున్నారని బయటపడింది.

ఈ డబ్బును విదేశాల్లో విలాసవంతమైన జీవితం గడిపేందుకు, ఖరీదైన వాహనాల కొనుగోలుకు ఉపయోగించినట్లు విచారణలో వెల్లడైంది. దీనిపై సొంత ప్రభుత్వంలోని పలువురు సభ్యులు ఆరోపణలు గుప్పించగా, వాళ్లందరినీ నజీబ్​ పదవుల నుంచి తొలగించారు. ఈ ఆరోపణల నేపథ్యంలోనే నజీబ్​ పదవిని కోల్పోయారు. చివరకు ఈ వ్యవహారం కోర్టుకు చేరడంతో 2020లో కోర్టు నజీబ్​ను దోషిగా తేల్చింది. హైకోర్టు ఆయనకు జైలు శిక్ష విధించింది. ఇక ఆయన రాజకీయ జీవితం సమాప్తం అయ్యింది. తదుపరి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కూడా కోల్పోయారు.