Justin Trudeau announces resignation as Canada’s prime minister: కెనడా ప్రధాన మంత్రి ట్రూడో సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. లిబరల్ పార్టీ నాయకుడిగా తప్పుకోవాలంటూ ట్రూడో మీద సొంత నేతలే నిరసనకు దిగటంతో ఆయన కుర్చీ దిగక తప్పలేదు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మార్చి 24 వరకు పార్లమెంటును సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అసోసియేటెడ్ ప్రెస్ నివేదిక ప్రకారం, కొత్త నాయకుడిని పార్టీ తరపున ఎన్నుకునే వరకు ఆయన తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
భారత్‌తో కయ్యం
ట్రూడో 2013లో లిబరల్ పార్టీ నాయకుడిగా బాధ్యతలు స్వీకరించారు. 2015లో అధికారాన్ని కైవసం చేసుకుని, వరుసగా రెండు ఎన్నికల్లో విజయం సాధించారు. 2023లో, కెనడాలోని భారత వ్యతిరేక శక్తులకు వత్తాసు పలికిన ట్రూడో భారత్ మీద దౌత్య యుద్ధాన్ని ప్రారంభించారు. ఈ సమయంలో, ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యలో భారతీయ ఏజెంట్ల ప్రమేయం ఉందని ఆరోపించటంతో రెండు దేశాల మధ్య సంబంధాలు బొత్తిగా దెబ్బతిన్నాయి.
ఇదే కారణం..
దేశం ఎదుర్కొంటున్న సమస్యల నుంచి ప్రజలను తప్పుదోవ పట్టించటానికి, తమ ప్రభుత్వపు దారుణమైన వైఫల్యాలను దాచటానికి.. భారత్ మీద యుద్ధం చేస్తున్నట్లు ట్రూడో నటిస్తున్నారని కెనడాలోని విపక్ష పార్టీలు చాలా కాలంగా విమర్శలు చేస్తున్నాయి.
కెనడాకు వ్యతిరేకంగా భారత్ కుతంత్రాలకు సంబంధించి ఏవైనా ఆధారాలు బయటపెట్టాలని వారు డిమాండ్ చేసినా, ఆయన మౌనం వహించారు. మరోవైపు, రెండు దేశాల మధ్య ఉమ్మడి సరిహద్దును భద్రతలో పురోగతి సాధించకపోతే, ఉత్పత్తులపై 25% నిషేధం విధిస్తానని కొత్తగా ఎన్నికైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ట్రూడోకు అల్టిమేట్టమ్ జారీచేయటంతో.. ట్రూడో సమస్యలు పెరిగాయి.
సొంత పార్టీలోనే వ్యతిరేకత..
ట్రంప్ ప్రకటన రాగానే, గత డిసెంబరు 16న కెనడా ఆర్థిక మంత్రి, ఉప ప్రధాన మంత్రి క్రిస్టియా తన పదవికి రాజీనామా చేయడంతో ట్రూడో కుర్చీకి ఎసరు రానుందనే వార్తలు వచ్చాయి. దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి బదులుగా, ప్రధాని ట్రూడో దేశం భరించలేని రాజకీయాలు చేస్తున్నారని ఆమె విరుచుకుపడ్డారు. ఈ రాజీనామా తర్వాత, జస్టిన్ ట్రూడోకు సొంతపార్టీలో సహాయనిరాకరణ పెరిగింది. కాగా, క్రిస్టీయా కూడా ప్రధాని పదవికి పోటీదారుగా ఉందని, లిబరల్ పార్టీలో మెజారిటీ ఎంపీలు ఆమెను తమ భవిష్యత్ నేతగా భావిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.