Site icon Prime9

Donald Trump: ఉద్యోగులను సెలవుపై పంపిస్తూ డొనాల్డ్ ఆదేశాలు.. నిలిపివేసిన ఫెడరల్ న్యాయమూర్తి కార్ల్‌ నికోల్స్

Judge blocks Donald  Trump from placing thousands of USAID workers: ప్రపంచంలోని అతిపెద్ద సహాయ సంస్థ అయిన ‘అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ’ (యూఎస్ఏఐడీ)లోని ఉద్యోగులను సెలవుపై పంపిస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా వీటికి బ్రేక్‌ పడింది. అమెరికాలోని ఫెడరల్‌ న్యాయమూర్తి కార్ల్‌ నికోల్స్ ట్రంప్‌ ఆదేశాలను తాత్కాలికంగా నిలిపివేశారు.

విధుల్లోకి తీసుకోవాలని ఆదేశాలు..
ట్రంప్ నిర్ణయంతో విదేశాల్లోని యూఎస్ఏఐడీ ఉద్యోగులు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అసోసియేషన్, అమెరికన్‌ ఫెడరేషన్‌ ఆఫ్ గవర్నమెంట్‌ ఉద్యోగులు వాదించారు. ఈ వాదనలతో కోర్టు ఏకీభవించింది. దీంతో ట్రంప్‌ ఆదేశాలను తాత్కాలికంగా నిలిపివేస్తునట్లు జడ్జి పేర్కొన్నారు. ఇప్పటికే సెలవులో ఉన్న యూఎస్‌ఏఐడీ (యూఎస్ఏఐడీ) సిబ్బందిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించారు. అంతకుముందు ‘యూఎస్ఏఐడీని మూసివేయాలి’ అంటూ ట్రంప్‌ ట్రూత్ సోషల్ వేదికగా రాసుకొచ్చారు.

యూఎస్‌ఏఐడీలో 10వేల మంది ఉద్యోగులు..
యూఎస్‌ఏఐడీలో 10వేల మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. ఈ సంఖ్యను 300 దిగువకు తీసుకురావాలని సూచిస్తున్నారు. అయితే ఇందులో కేవలం 294 మంది మాత్రమే ఏజెన్సీలో పనిచేసేలా ట్రంప్‌ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అందులో భాగంగా 30 రోజుల్లోగా వారంతా ఇళ్లకు తిరిగి వెళ్లాలని ఆదేశించారు. ఆదేశాలకు ముందు ఈ సహాయ సంస్థను తీవ్రవాద ఉన్మాదులు నడుపుతున్నారని, వాళ్లందరినీ వెళ్లగొట్టేస్తానని ట్రంప్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

నేరగాళ్ల సంస్థగా ఆరోపణ..
అటు డోజ్‌ విభాగ సారథి, టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ కూడా దీనిపై మాట్లాడుతూ.. యూఎస్‌ఏఐడీ నేరగాళ్ల సంస్థ అని ఆరోపించారు. దాదాపు 120 దేశాలకు మానవతా దృక్పథంతో సహాయం చేయడానికీ, ఆ దేశాల అభివృద్ధికీ, భద్రతకూ నిధులు సమకూర్చడానికీ యూఎస్‌ఏఐడీను నెలకొల్పారు. ఈ సంస్థ వందల కోట్ల డాలర్లను సహాయంగా అందిస్తోంది.

Exit mobile version
Skip to toolbar