Israeli PM Netanyahu Confirms Hitting Iran Nuke Sites: గత కొన్ని నెలలుగా ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న పరోక్ష యుద్ధం మరింత ముదిరేలా కనిపిస్తోంది. రెండు దేశాలూ తరచూ కవ్వింపు చర్యలతో బాటు దాడులకూ తెగబడుతున్న వేళ.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహూ మరోసారి ఇరాన్ మీద తమ వైఖరిని స్పష్టం చేశారు. తాజాగా, ఆయన ఆ దేశ పార్లమెంట్‌లో మాట్లాడుతూ, ఆరునూరైనా ఇరాన్ ఒక అణుశక్తిగా అవతరించకుండా చూస్తామని ప్రకటించారు.
లక్ష్యం టెహ్రాన్..
ఇరాన్ దూకుడుకు చెక్ పెట్టేందుకు ఇప్పటికే ఆ దేశ రాజధాని టెహ్రాన్, దాని చుట్టుపక్కల ఉన్న సైనిక స్థావరాల మీద తాము దాడిచేశామని, 100 ఫైటర్ జెట్స్‌తో 20 మిసైల్, డ్రోన్ ఫెసిలిటీ సెంటర్లపై మూడు రౌండ్ల ఎయిర్ స్ట్రైక్స్ చేశామని తన ప్రసంగంలో నెతన్యాహూ వెల్లడించారు. ఇరాన్ అణు కార్యక్రమంలో భాగంగా కీలక పరికరాలు తయారుచేసే స్థావరాలపై దాడి చేసి వారి అణుకార్యక్రమం ముందుకు సాగకుండా చెక్ పెట్టామని ఆయన చెప్పుకొచ్చారు.
ఇంధన సరఫరాకు చెక్
ఏప్రిల్‌లో ఇరాన్‌పై తాము చేసిన దాడిలో టెహ్రాన్ చుట్టూ మోహరించిన మూడు ఎస్-300 బ్యాటరీలను ధ్వంసం చేశామని, మరో 3 బ్యాటరీలు ఇరాన్ వద్ద మిగిలి ఉండగా, అక్టోబర్‌లో చేసిన దాడిలో వాటినీ కూడా ధ్వంసం చేసినట్లు నెతన్యాహూ వివరించారు. క్షిపణుల తయారీలో వాడే ఘన ఇంధన తయారీ కేంద్రాన్ని పేల్చేశామన్నారు.
అణు కార్యక్రమాన్ని వీడాలి
ఇరాన్ అణుశక్తిగా మారటం వల్ల ఈ ప్రాంతంలో ప్రాంతీయ ఉద్రిక్తతలు మరింత పెరిగే ప్రమాదముందని, ఇరాన్ అండతో చెలరేగే సంస్థలు ఇజ్రాయెల్ మీద దాడులకు తెగబడతాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఇకనైనా, మొండి వైఖరిని వీడి ఇరాన్ తన అణుకార్యక్రమానికి స్వస్తి పలకకపోతే, దాడులు పునరావృతం కాకతప్పదని నెతెన్యాహూ ఇరాన్ పాలకులను హెచ్చరించారు. ఒకవేళ ఇరాన్ తమ మీద ప్రతిదాడికి తెగబడితే, భీకరంగా ప్రతిస్పందించటం మినహా తమ మందు మరో మార్గం లేదని నెతన్యాహూ స్పష్టం చేశారు.
ట్రంప్ వచ్చాక రంగంలోకి..
అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇరాన్ అణుస్థావరాలు, ఇతర ముప్పులపై సమీక్ష నిర్వహిస్తామని నెతన్యాహూ పేర్కొన్నారు. ఇరాన్ విషయంలో బైడెన్ ప్రభుత్వం తమకు చేస్తున్న సూచనలను పట్టించుకోలేమని, తమ మాట కాదని ముందకు పోతే తాము అండగా నిలవమని బైడెన్ తమతో చెప్పినట్లు వెల్లడించారు. కొత్త అధ్యక్షుడు ఆఫీస్‌లోకి వచ్చేందుకు సమయం ఉందని, అప్పటికి దీనిపై ఒక స్పష్టమైన వైఖరిని తీసుకుంటామన్నారు.