Daily Needs Price will increase due to Iran – Israel War: పశ్చిమాసియా పరిణామాల ప్రభావం అనేక దేశాలపై తీవ్రంగా పడనుంది. ఇందుకు భారత్ కూడా మినహాయింపు కాదు. ప్రధానంగా చమురు ధరలు భారీగా పెరగవచ్చు. అంతేకాదు ఆయా దేశాలకు చమురు సరఫరా లో కూడా ఆటంకాలు ఏర్పడే అవకాశాలున్నాయి. వీటన్నిటితో పాటు సామాన్య ప్రజల జీవన వ్యయం కూడా పెరిగే అవకాశాలున్నాయి. పశ్చిమాసియా ప్రస్తుతం రణరంగాన్ని గుర్తుకు తెస్తోంది. ఎటు చూసినా దాడులు,ప్రతి దాడులే కనిపిస్తున్నాయి. ఎవరి నోట విన్నా, డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణుల ప్రస్తావనే వినిపిస్తోంది. అయితే ఘర్షణలు పడుతోంది ఇజ్రాయెల్ , ఇరాన్ దేశాలు మాత్రమే. అయితే ఈ పరిణమాల ప్రభావం కేవలం పశ్చిమాసియా కే పరిమితం కాదు.
పశ్చిమాసియా పరిణామాలు యావత్ ప్రపంచాన్ని ప్రభావితం చేయనున్నాయి. ప్రధానంగా చమురు ధరలపై ఈ ఘర్షణల ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి. ఇజ్రాయెల్, ఇరాన్ ఘర్షణలు ఎక్కువ కాలం కొనసాగితే, చమురు ధర బ్యారెల్ కు దాదాపు 120 డాలర్లు పెరగవచ్చు అంటున్నారు ఆర్థిక నిపుణులు. దీంతో ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకే అవకాశాలున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరిగితే, ఆ ప్రభావం భారత్ పై తప్పకుండా పడుతుందంటున్నారు నిపుణులు. ప్రధానంగా రవాణా రంగంపై ఈ ప్రభావం ఉంటుంది. ఫలితంగా సామాన్య ప్రజల రవాణా ఖర్చులు పెరిగే అవకాశాలున్నాయి. అంతిమంగా ఇంటి ఖర్చులు పెరుగుతాయి.
పెరుగుతున్న ఇంధన ఖర్చులు…అంతిమంగా ప్రజలు దైనందిన బడ్జెట్ ను తగ్గిస్తాయి. నిత్య జీవితంలో సాధారణ ప్రజల జీవన వ్యయం పెరుగుతుంది. అలాగే భారత్ కరెంట్ ఖాతా లోటు కూడా పెరుగుతుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటన్నిటికి తోడుగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కేంద్రమైన హార్ముజ్ జలసంధిపై కూడా పశ్చిమాసియా పరిణామాల ప్రభావం ఉండే అవకాశాలున్నాయి. హార్ముజ్ జలసంధి ఒక కీలకమైన జల మార్గం. ఈ మార్గం ద్వారానే ప్రపంచలోని సముద్ర మార్గ చమురులో మూడింట ఒక వంతు సరఫరా అవుతోంది. ఇక్కడ సమస్యలు ఎదురైతే, చమురు ధరలు పెరగడంతోపాటు సరఫరా లోనూ అనేక సవాళ్లు ఎదురవుతాయి. అలాగే భారత్ చమురు దిగుమతుల్లో మూడింట రెండు వంతులు, లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ దిగుమతుల్లో దాదాపు సగానికి పైగా హార్ముజ్ జలసంధి ద్వారానే రవాణా అవుతోంది. మొత్తం మీద పశ్చిమాసియా పరిణామాల ప్రభావం భారత్ సహా అనేక ప్రపంచ దేశాలపై ఉండటం ఖాయంగా కనిపిస్తోంది.