Immigration: ఆందోళన కలిగిస్తున్న మేధో వలసలు

Immigration: మనిషి సంఘజీవి. అయితే, తాను జీవించే చోట ప్రతికూల పరిస్థితులు ఎదురైననప్పుడు లేదా ఇప్పటికంటే మెరుగైన జీవితాన్ని పొందేందుకు తానున్న చోటు నుంచి మరోచోటికి తరలి పోవటాన్నే మనం వలస అంటున్నాం. సామాజిక మార్పు, సామాజిక కొనసాగింపునకు దోహదపడే అంశాల్లో జననాలు, మరణాలు, వలసలు ప్రధానమైన అంశాలుగా ఉండగా, వాటిలో జనన, మరణాలు జైవికమైనవి. కానీ, వలసలు మాత్రం సామాజిక, ఆర్థిక రాజకీయ, మత సంబంధ కారకాల నేపథ్యంలో జరుగుతాయి. ప్రపంచంలోని అన్ని సమాజాల్లో వలసలున్నప్పటికీ, కొన్ని దేశాలకు ఈ వలసలు వరంగా పరిణమిస్తుండగా, మరికొన్ని దేశాలకు శాపంగా మారుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న అంతర్జాతీయ వలసలను పరిగణనలోకి తీసుకున్న ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ 1990 డిసెంబర్‌ 18న జరిగిన సమావేశంలో అంతర్జాతీయ వలసదారుల హక్కుల రక్షణ గురించి ఒక తీర్మానాన్ని ఆమోదించటమే గాక ఏటా డిసెంబర్‌ 18న అంతర్జాతీయ వలసదారుల దినోత్సవంగా ప్రకటించి, నిర్వహిస్తోంది.

ప్రముఖ సామాజికవేత్త బోగ్ వలసలను.. పుష్ ఫ్యాక్టర్స్, పుల్ ఫ్యాక్టర్స్ అంటూ రెండుగా విభజించారు. తామున్న చోట కనీస ఉపాధి లేకపోవటం, సొంతదేశంలో తమ నేపథ్యం కారణంగా ఎదగలేని పరిస్థితి, యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాల బెడద వంటి కారణాలతో జరిగే వలసలను ఆయన పుష్ ఫ్యాక్టర్స్‌గా చెప్పారు. అంటే సొంత గడ్డపై ఉండాలని కోరిక ఉన్పప్పటికీ.. అక్కడే ఉంటే తమకు మనుగడ, భవిష్యత్తు లేవనే కారణంతో అక్కడి నుంచి మరొక చోటికి తరలిపోవటం అన్నమాట. పాలస్తీనా నుంచి సరిహద్దు దేశాలకు యుద్ధం వల్ల పోయే శరణార్థులు దీనికి ఉదాహరణగా చెప్పొచ్చు. తాము నివసించే చోట చేసే పనిని మరొక చోట చేయటం వల్ల మెరుగైన వేతనం పొందటంతో బాటు వృత్తి, ఉఫాధి పరంగా ఎదిగి కొంతైనా ఆర్థిక స్థిరత్వం పొందొచ్చనే ఆశతో లేదా ఆకర్షణ మూలంగా కష్టంగా భావిస్తూనే వేరే ప్రాంతానికి పోతే.. దానిని పుల్ ఫ్యాక్టర్ అంటారు. తెలంగాణ నుంచి గల్ఫ్ ప్రాంతానికి వెళ్లే కూలీలు ఈ కోవలోని వారుగా చెప్పొచ్చు. బోగ్.. సూత్రీకరణకు బయట మరొక రకమైన అంతర్జాతీయ వలస కేటగిరీ కూడా ఉంది. దానినే మనం మేధోవలస(బ్రెయిన్ డ్రెయిన్) అంటున్నాం. ఇందులో.. ఉన్నత విద్యావంతులు, వృత్తి నిపుణులు, మేధావులు.. ఆకర్షణీయమైన జీతభత్యాలు, ఆధునిక జీవనం, ఆధునిక శాస్త్రసాంకేతిక పరిజ్ఞానం, ఆధునిక పరిశోధనలకు అవసరమైన మౌలిక సదుపాయాల కోసం సంతోషంగా మాతృదేశాలను వదలి పొరుగు దేశాలకు చేరి అక్కడే స్థిరపడిపోవటం జరుగుతుంది. మనదేశం ఇప్పుడు ఎదుర్కొంటున్న అతి పెద్ద సామాజిక సమస్యల్లో ఇదీ ఒకటి.

మనదేశం నుంచి ఏటా లక్షలాదిమంది ఉన్నత విద్యావంతులు, వృత్తి నిపుణులు అభివృద్ధి చెందిన దేశాలకు తరలిపోతున్నారు. ఇలా వెళ్లిన వారిలో నూటికి 90 శాతం మంది అక్కడే శాశ్వతంగా స్థిరపడటానికి ఇష్టపడుతున్నారు. ఒక లెక్క ప్రకారం మన దేశం నుంచి సుమారు 2 కోట్ల మంది ఇలా విదేశాల్లో స్థిరపడ్డారు. వీరిలో గల్ఫ్ దేశాలలో 82 లక్షల మంది పనిచేస్తుండగా, వీరిలో మెజారిటీ ఉపాధి కోసమే అక్కడ జీవిస్తున్నారు. కానీ, అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, బ్రిటన్ వంటి దేశాలు వెళ్లేవారిలో మెజారిటీ విద్యావంతులు అక్కడే స్థిరపడుతున్నారు. అక్కడి పౌరసత్వం పొందటానికి ఆయా దేశాలు పెట్టే నిబంధలు కష్టంగా అనిపించినా వాటిని ఇష్టపడి మరీ అంగీకరిస్తున్నారు. వీరు తమ ప్రతిభతో రాణించి మంచి గుర్తింపును, సంపదను ఆర్జించటమే గాక ఆయా దేశాల రాజకీయాలలో తమదైన పాత్రను పోషిస్తూ పలుకుబడి గల వర్గాలుగా చెలామణి అవుతున్నారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో అమెరికాతో 2008లో భారత్ చేసుకున్న అణు ఒప్పందం వెనక ప్రవాస భారతీయులు పాత్ర ఎంతో ఉంది. ఇవన్నీ సంతోషించాల్సిన అంశాలుగా ఉండగా, ఈ మేథోవలస మూలంగా దేశానికి కలుగుతున్న నష్టం గురించి ఆలోచిస్తే, ఆందోళన కలగక మానదు.

తాజా గణాంకాల ప్రకారం.. విదేశాలకు వెళ్లిన భారతీయులలో ఏటా కనీసం సగటున లక్షమంది తమ పౌరసత్వాన్ని వదులుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో విడుదల చేసిన లెక్కల ప్రకారం.. 2015లో 1.31 లక్షలు, 2016లో 1.41 లక్షలు, 2017లో1,33 లక్షలు, 2018లో 1,34 లక్షలు, 2020లో 85,242 మంది భారతీయులు దేశం వీడారు. ఇక.. 2021లో సెప్టెంబర్ వరకు 1.11 లక్షలమంది పొరుగుదేశానికి వెళ్లగా, 2022వ సంవత్సరంలో జనవరి – అక్టోబరు మధ్య కాలంలో ఈ సంఖ్య 1.83 లక్షలుగా ఉండటం ఆందోళన కలిగించే అంశమని చెప్పక తప్పదు. ఈ ఏడాది నవంబరు రెండవ వారంలో పారిస్‌లో విడుదల చేసిన ఇంటర్నేషనల్‌ మైగ్రేషన్‌ ఔట్‌లుక్‌ 2024లోనూ ఇలాంటి గణాంకాలే వెల్లడయ్యాయి. 2022లో 5.6 లక్షల మంది భారతీయులు దేశాన్ని వదిలి అమెరికా, యూకే, కెనడా వంటి ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఎకనమిక్‌ కోఆపరేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌(ఓఈసీడీ) సభ్య దేశాల్లో స్థిరపడ్డారు. 2021లో ఈ సంఖ్య 4.11 లక్షలుగా ఉండగా, ఈ ఏడాది కాలంలో ఇది 35 శాతం మేర పెరిగింది. 2022లో ప్రపంచవ్యాప్తంగా జరిగిన అంతర్జాతీయ వలసలలో 6.4 శాతం వాటా భారతీయులదే. 2022లో అమెరికాకు అత్యధికంగా 1.25 లక్షల మంది, కెనడాకు 1.18 లక్షల మంది, యూకేకు 1.12 లక్షల మంది వలసవెళ్లటం ఖచ్చితంగా ఆందోళనను కలిగిస్తోంది.

మరోవైపు, 2023 హెన్లీ అండ్‌ పార్ట్నర్స్‌ అనే ప్రసిద్ధ కన్సల్టెన్సీ సంస్థ నివేదిక ప్రకారం.. 2022 నుంచి నేటి వరకు 15వేల మంది భారతీయ కుబేరులు భారతదేశ పౌరసత్వానికి స్వస్తి పలికారు. వీరంతా భారత్‌లోని తమ పెట్టుబడులను ఉపసంహరించుకుని దుబాయ్, బ్రిటన్, అమెరికాలలో పెట్టుబడులుగా పెట్టే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇలా వెళ్లిన వారిలో ఐఐటీ, ఐఐఎం, ఎన్‌ఐటీల వంటి ఉత్తమ విద్యాసంస్థలలో చదువుకున్నవారుండటం ఆందోళన కలిగిస్తోంది. 1953 నుంచి ఇప్పటివరకు భారతదేశంలోని ఐఐటీల్లో చదివిన వారిలో సుమారు 25 వేల మంది ఒక్క అమెరికాలోనే స్థిరపడ్డారని గణాంకాలు చెబుతున్నాయి. నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనామిక్ రీసెర్చ్ -2023 ప్రకారం ఐఐటీ మొదటి 100 మంది ర్యాంకర్లలో 62% మంది, తొలి 1000 ర్యాంకర్లలో 36% మంది వేరే దేశాలకు వలస వెళుతున్నారు. ఈ మేధోవలసలను ఆపకపోతే, దేశం రాబోయే రోజుల్లో తీవ్రంగా నష్టపోకమానదని సామాజిక వేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. సమాజపు ఉమ్మడి వనరులతో తయారైన విలువైన మానవ వనరులు ఇకనైనా దేశం దాటిపోకుండా కాపాడుకుని నిలుపుకోగలిగితేనే.. ప్రపంచపు ఆర్థిక శక్తిగా భారత్ నిలవగలుగుతుందనే వాస్తవాన్ని మన పాలకులు గుర్తుంచుకోవాల్సిన అవసరముంది.