Site icon Prime9

Global debt burden: అదుపు తప్పుతున్న ప్రపంచ రుణభారం.. మరోసారి ఆర్థిక సంక్షోభం తలెత్తే ప్రమాదముందా?

Global debt burden: ప్రపంచ వ్యాప్తంగా మరోసారి ఆర్థిక సంక్షోభం తలెత్తే ప్రమాదముందని గత ఏడాది కాలంగా ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకు వారు చెబుతున్న కారణాలు వారి అనుమానాలు నిజం కాబోతున్నాయనే రీతిలో ఉన్నాయి. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా పెరిగిన మిలిటరీ వ్యయాలు, ఆధిపత్యం కోసం సాగుతున్న యుద్ధాలతో బాటు ప్రకృతి విపత్తులు, సైబర్ దాడులు, కొవిడ్ వంటి ఆరోగ్య సమస్యలు ప్రపంచాన్ని వేగంగా మరో మహా ఆర్థిక సంక్షోభం వైపు నెడుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే ప్రపంచ రుణభారం అసాధారణమైన రీతిలో 97 ట్రిలియన్‌ డాలర్లకు చేరిందని, ఈ మొత్తం ప్రపంచ వార్షిక ఆర్థిక ఉత్పతి కంటే ఎక్కువని గణాంకాలు చెబుతున్నాయి. ఒక్క 2023లోనే అభివృద్ధి చెందుతున్న దేశాలు 847 బిలియన్‌ డాలర్ల వడ్డీని సమర్పించుకున్నాయని, ఇంతటి ఆర్థిక ఒత్తిడి నెత్తిన ఉండటంతో ఆయా దేశాలు అభివృద్ధి విషయంలో కిందామీదా అవుతున్నాయని, ముఖ్యంగా ఈ దేశాల్లో విపత్తులు వంటివి సంభవిస్తే ప్రభుత్వాలు వెంటనే స్పందించలేకపోతున్నాయని, పెరిగిన రుణభారంతో పలు దేశాలు నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు, ప్రాథమిక సేవలకు అప్పులు పొందలేకపోతున్నాయని ఐఎంఎఫ్ వాపోయింది.

మరోవైపు అగ్రరాజ్యం అమెరికా అప్పుల ఊబిలో దిగిబడిపోయింది. 2023 చివరినాటికి దేశ రుణం రూ.2,840 లక్షల కోట్లుగా ఉండగా, ఒక్కో అమెరికన్‌ నెత్తిన రూ. 83 లక్షల బాకీ ఉంది. అటు ఆదాయానికి, ఖర్చుకూ అంతరం అంతకంతకూ పెరుగుతోంది. అఫ్ఘాన్‌, ఇరాన్‌ యుద్ధాలు, 2008 ఆర్థిక మాంద్యం, 2019 కొవిడ్‌ సంక్షోభం, కొవిడ్ అనంతరం పరిస్థితులు, భారీ సైనిక వ్యయం, నిరుద్యోగంతో పన్నుల రాబడి తగ్గటం, అమెరికా ఖర్చు 50 శాతానికి పైగా పెరగటంతో దేశం అప్పుల కుప్ప అయింది. 2023లో దేశ జిడిపి 26.97 ట్రిలియన్‌ డాలర్లుగా ఉండగా, రుణం 33.17 ట్రిలియన్‌ డాలర్లు. జీడీపీ కంటే ఇది 123 శాతం ఎక్కువ. ఏ దేశమైనా తన జీడీపీకి మించి బాకీలు చేస్తే, ఆర్థికంగా కోలుకోవటం అంత ఈజీ కాదని ఆర్థిక నిపుణులు చెబుతున్న మాట అమెరికన్లను కలవరపెడుతోంది. అనేక పేద, అభివృద్ధి చెందిన దేశాలు ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూ, మిగులు వనరులను మానవాభివృద్ధికి వాడుకుంటుంటే, తమ దేశం మాత్రం పెద్దన్న పెత్తనం కోసం యుద్ధాలు, మిలిటరీ ఖర్చులంటూ డబ్బు తగలేస్తోందని అమెరికన్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లోనూ ఈ అంశం గట్టిగా వినిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అనవసరపు జోక్యాలు తగ్గించుకుంటూ డబ్బును పొదుపుచేయటమే గాక, కార్పొరేట్ టాక్స్‌లు తగ్గించి, వ్యాపారాన్ని రెట్టింపు చేసి ఆర్థిక వ్యవస్థను గాడిన పెడతానని ట్రంప్, సంపన్నుల నుంచి వసూలు చేసే కార్పొరేట్ టాక్స్‌ను మరింత పెంచి సామాన్యులకు మెరుగైన సదుపాయాలు కల్పిస్తానని కమలా హ్యారిస్ చెబుతున్నారు.

మరోవైపు, సంపన్న జి-7 దేశాల రుణాలూ భారీగా పెరిగిపోయాయి. జపాన్ దేశపు జీడీపీలో దాని రుణం 254.6 శాతంగా ఉండగా, ఇటలీలో 139.2 శాతంగా, ఫ్రాన్స్‌లో 111.6 శాతంగా, కెనడాలో 104.7 శాతంగా, బ్రిటన్‌‌లో 104.3 శాతంగా, జర్మనీలో 63.7 శాతం, అమెరికా రుణం జిడిపిలో 123 శాతంగా, భారత్‌లో 62 శాతంగా ఉంది. మొత్తం జి-7 దేశాల సగటు రుణం వాటి జీడీపీలో 128 శాతం ఉంది. ఇంత మొత్తంలో అప్పులు దీర్ఘకాలంలో వృద్ధిరేటును, ఆర్థిక స్థిరత్వాన్ని ప్రభావితం చేస్తాయని, సరిగ్గా రెండవ ప్రపంచయుద్ధానంతర కాలంలోనే ప్రపంచంలో ఇలాంటి ఆర్థిక పరిస్థితులే నెలకొన్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

భారత్ ప్రపంచపు మూడవ ఆర్థిక శక్తిగా ఎదుగుతోందని మన కేంద్రం చెబుతూ వస్తోంది. అయితే, ఈ మాటలకు, ఆర్బీఐ గణాంకాలకు పొంతన కుదరటం లేదు. గత పదేండ్లలో కేంద్రం అప్పులు 150 శాతం మేర, రాష్ట్రాల అప్పులు 200 శాతం మేర పెరగాయని ఆర్బీఐ వెల్లడించింది. 2014 మార్చి చివరి నాటికి మన జీడీపీలో రుణవాటా 23.2 శాతం కాగా, 2023 మార్చి నాటికి ఇది 59 శాతానికి (అంటే 174 శాతం ఎక్కువ) పెరిగింది. 2014లో రూ.58.6 లక్షల కోట్లుగా ఉన్న అప్పు 2023 మార్చి 31 నాటికి 155.6 లక్షల కోట్లకు పెరిగింది. 2014 మార్చిలో తలసరి అప్పు రూ.43,124 ఉండగా 2023 మార్చి నాటికి 1,09,373కి పెరిగింది. నోట్ల రద్దు, జీఎస్టీ వంటి నిర్ణయాలతో ద్రవ్యోల్బణం పెరిగి, బయట అప్పులు చేయాల్సి వచ్చింది. కాగా, 2024 జూన్ నాటికి జీడీపీలో 62 శాతం అప్పులు (రూ. 156 లక్షల కోట్లు) ఉన్నాయని కేంద్ర ఆర్థికశాఖ లోక్‌సభలో వెల్లడించింది. అయితే, దేశవ్యాప్తంగా పెరిగిన డిజిటల్ లావాదేవీలు, స్థిరంగా కొనసాగుతున్న భారతీయుల పొదుపు, దిగుమతులు తగ్గించుకుకుంటూనే ఎగుమతులు పెంచేందుకు కేంద్రం అనుసరిస్తున్న వ్యూహాలు ఇప్పటికి మన ఆర్థిక వ్యవస్థ స్థిరంగా కొనసాగేందుకు దోహదపడుతున్నాయి. అదే సమయంలో జాతీయ స్థాయిలో బలమైన రాజకీయ నాయకత్వం, పొరుగు దేశాలతో ఉద్రికత్తలు అదుపులో ఉండటంతో సైన్యం మీద పెట్టే ఖర్చు కూడా అదుపులో ఉండటమూ మన దేశానికి కలిసొస్తున్న అంశాలు. అయితే, చమురు కోసం నేటికీ విదేశాల మీద ఆధారపడటం, పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, మనకు చమురు సరఫరా చేస్తున్న రష్యా యుద్ధం ఊబిలో దిగబడిపోవటం వంటి అంశాల మూలంగా రాబోయే రోజుల్లో మన చమురు బిల్లులు పెరిగే ప్రమాదం మాత్రం కనబడుతోంది.

సంపన్నదేశాలు తమ అవసరాలు, పెట్టుబడులను తగ్గించుకుని, మిగులు ఆర్థిక వనరులను పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలకు నేరుగా అప్పులుగా ఇస్తున్నాయని చాలా మంది అనుకుంటుంటారు. కానీ, పెద్ద దేశాలు తమ వనరుల్లో కొంత భాగాన్ని ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్, ఇతర ప్రముఖ ద్రవ్యసంస్థల్లో పెట్టుబడి పెడుతుంటాయి. ఈ డబ్బునే ఆయా ఆర్థిక సంస్థలు పేద, వర్థమాన దేశాలకు అప్పులుగా ఇస్తుంటాయి. వాటి మీద వచ్చే వడ్డీతో బాటు అసలును దీర్ఘకాలంలో ఆయా దేశాలు చెల్లిస్తుంటాయి. ఒకవేళ చెల్లించటంలో ఆలస్యమయ్యే పరిస్థితి వస్తే, ఆయా పేద దేశాలు తమ గనులు, ప్రకృతి వనరులు, మానవ వనరులను చౌకగా వాడుకునేలా ఆయా సామ్యాజ్యవాద దేశాలకు అనుమతినివ్వాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. అయితే, ఈ పేద, అభివృద్ధి చెందిన దేశాలు ఒక్కతాటి మీదికి వచ్చి, తక్కువ రేటుకు, తక్కువ నిబంధనలతో రుణాలు పొందే ప్రయత్నం చేయలేకపోతున్నాయి. ఇలా చేయగలిగితే, రుణభారం తగ్గటంతో బాటు పెద్ద దేశాల పెత్తనం.. వీటిపై తగ్గుతుంది. అలాగే, తమ ఆదాయంలో 20 శాతానికి పైగా వడ్డీలు కడుతున్న ఈ దేశాల మీద ఆర్థిక భారం తగ్గి, ఇక్కడి ప్రభుత్వాలు ఆ మిగులు సొమ్మును ప్రజాహితం కోసం వెచ్చించటం వల్ల విద్య, ఉపాధి అవకాశాలు మెరుగుపడి, సమాజంలో ఆర్థిక అంతరాలు తగ్గుతాయి. అయితే, పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలన్నీ కలిసి ముందడుగు వేస్తేనే ఈ మార్పు సాధ్యమవుతుంది.

Exit mobile version