Lawrence Bishnoi Brother: కాలిఫోర్నియా పోలీసుల అదుపులో అన్మోల్.. వందల నేరాల్లో సూత్రధారి!

Lawrence Bishnoi Brother: గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ సోదరుడు అన్మోల్‌ బిష్ణోయ్‌ అమెరికాలో అరెస్ట్ అయినట్లు సమాచారం. బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌ ఇంటి బయట కాల్పులు జరిపిన ఘటన సహా పలు కేసుల్లో అన్మోల్‌ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఇతని సూచనల మేరకే ఇటీవల ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీని హత్య చేసినట్లు నిందితులు వెల్లడించిన విషయం తెలిసిందే. అన్మోల్‌కు సంబంధించిన సమాచారమిస్తే రూ.10 లక్షలిస్తామని పోలీసులు ఇప్పటికే ప్రకటించారు.

లెక్కలేనన్ని కేసులు​!
కొన్ని నెలల క్రితం హిందీ నటుడు సల్మాన్‌ఖాన్ ఇంటి బయట కాల్పుల జరిపిన ఘటన సహా పలు కేసుల్లో అన్మోల్‌ బిష్ణోయ్​పై ఆరోపణలు ఉన్నాయి. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ గతేడాది రెండుసార్లు సల్మాన్ ఖాన్‌కు సోషల్ మీడియా, ఈమెయిల్స్ ద్వారా హెచ్చరికలు పంపింది. చివరిసారిగా 2023 నవంబర్​లో​ ‘మరణానికి వీసా అవసరం లేదు’ అంటూ సల్మాన్​ను హెచ్చరించారు.2022లో హత్యకు గురైన పంజాబ్‌ గాయకుడు సిద్ధూ మూసేవాలా కేసులోనూ ఇతనే అనుమానితుడిగా ఉన్నాడు. అలాగే ఇటీవల ముంబయిలో సంచలనం సృష్టించిన బాబా సిద్దిఖీ హత్య కేసు నిందితులతో ఇతను టచ్‌లో ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. అన్మోల్ బిష్ణోయ్​ కెనడాలో ఉంటూ, తరచూ అమెరికా వెళ్లి వస్తుంటాడని పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆయన సోమవారం యూఎస్​లో పట్టుబడ్డారని తెలుస్తోంది.

భారత్​కు రప్పించేందుకు!
ముంబయి పోలీసులు ఇటీవలే అన్మోల్‌ను భారత్‌కు రప్పించే ప్రక్రియను ప్రారంభించేందుకు అనుమతి కోరుతూ ప్రత్యేక న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. లారెన్స్‌ బిష్ణోయ్​ తరఫున అన్మోల్ పలు చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో భాగమయ్యాడని సదరు పిటిషన్​లో పేర్కొన్నారు. దీంతో అన్మోల్​పై నాన్‌-బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయ్యింది. ఈ క్రమంలోనే అన్మోల్‌ కదలికల గురించి అమెరికా అధికారులు ముంబయి పోలీసులతో ఎప్పటికప్పుడు సమాచారం పంచుకుంటుండగా, తాజాగా అరెస్టు వార్త బయటికొచ్చింది.

జైల్లోనే హత్యలకు ప్లాన్స్!
గ్యాంగ్​స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ కొన్నేళ్లుగా జైల్లోనే ఉంటున్నాడు. బ్యారక్​ల్లోకి అక్రమంగా వచ్చే సెల్‌ ఫోన్ల ద్వారా అనుచరులతో నిరంతరం టచ్​లో ఉంటూ హత్యలకు ప్రణాళికలు రచిస్తున్నాడని అతనిపై ఆరోపణలున్నాయి. గాయకుడు సిద్ధూ మూసేవాలా, ఎన్ సీపీ నాయకుడు బాబా సిద్ధిఖీపై దాడులు ఈవిధంగానే చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. తన తమ్ముడికి ఫోన్ ద్వారా ఆదేశిస్తూ పలువురిని లారెన్స్ భయభ్రాంతులకు గురిచేస్తున్నాడని పోలీసులు చెబుతున్నారు.

భారత్ వచ్చేది అప్పుడే..
అయితే, అన్మోల్ అరెస్ట్ జరిగినప్పటికీ, అతడిని ఇప్పటికిప్పుడు భారత్ తీసుకురావటం అంత సులభం కాదని, అతడి మీద అనేక కేసులున్నందున ముందుగా అమెరికా పోలీసులు అన్మోల్‌ను విచారిచిస్తారని, తర్వాత ఖలిస్తానీ తీవ్రవాది హర్దీప్‌సింగ్‌నిజ్జర్‌ హత్య కేసులో కెనడా పోలీసులకు అప్పగించే అవకాశం ఉందని ముంబై క్రైమ్‌బ్రాంచ్‌ పోలీసులు చెబుతున్నారు. తర్వాతే భారత్‌కు అన్మోల్‌ను అప్పగిస్తారని ముంబై పోలీసులు భావిస్తున్నారు.