Prime9

Barack Obama : అధ్యక్షుడిగా పనిచేస్తూ మిచెల్‌కు దూరమయ్యా : అమెరికా మాజీ ప్రెసిడెంట్ ఒబామా

Former US President Barack Obama : ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వహించే సమయంలో తన వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఎదురయ్యాయని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా పేర్కొన్నారు. ప్రస్తుతం తమ మధ్య దూరాన్ని భర్తీ చేసేందుకు తన భార్య మిచెల్‌తో ఎక్కువ సమయం గడుపుతున్నట్లు తెలిపారు.

 

 

ఎక్కువ సమయం గడపలేకపోయాను..
హామిల్టన్ కళాశాల అధ్యక్షుడు స్టీవెన్ టెప్పర్‌తో మాట్లాడేటప్పుడు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తాను అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించే సమయంలో తన భార్య మిచెల్‌తో ఎక్కువ సమయం గడపలేకపోయానని తెలిపారు. ప్రస్తుతం ఆ సమయాన్ని భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తున్నానని పేర్కొన్నారు. గతంలో ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇదే తరహాలో వ్యాఖ్యలు చేశారు. ఇక మిచెల్ సైతం తమ వైవాహిక బంధంలో వచ్చిన మనస్పర్థలు గురించి అంతకుముందే ఓ టీవీలో మాట్లాడారు. బరాక్ ఒబామా అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నప్పుడు తాను ప్రథమ పౌరురాలిగా కంటే పిల్లల బాధ్యతలను ఎక్కువగా నిర్వర్తించినట్లు తెలిపారు. తమ వైవాహిక జీవితంలో చిన్నచిన్న మనస్పర్థలు ఎదురయ్యాయని, వాటిని ఎదుర్కొవటానికి తాము కౌన్సిలింగ్ తీసుకున్నట్లు తెలిపారు.

 

 

1992లో వివాహం..
1992లో పెళ్లి బంధంతో ఒక్కటైన బరాక్ ఒబామా దంపతులకు సాషా, మలియా అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఇటీవల ఈ దంపతులు విడాకులు తీసుకుంటున్నారంటూ వార్తలు కూడా వచ్చాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ అంత్యక్రియకు మిచెల్ హాజరుకాకపోవటంతో విడాకుల వార్తలు సోషల్ మీడియాలో వెల్లువెత్తాయి. అయితే వీటిని మిచెల్ టీం కొట్టిపడేసింది. ఆ సమయంలో ఆమె మరో ప్రాంతంలో ఉన్నందువల్ల ఆ కార్యక్రమానికి హాజరు కాలేకపోయినట్లు తెలిపింది. ఒబామా దంపతులు విడాకులు తీసుకుంటున్నారనే వార్తలో ఎలాంటి నిజం లేదని వెల్లడించింది.

 

 

Exit mobile version
Skip to toolbar