Floods on Indonesia’s Java island leave 16 dead: ఇండోనేషియాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు ఆకస్మిక వరదలు వచ్చాయి. దీంతో ప్రధాన ద్వీపం జావాలోని కొండ గ్రామాల్లో వరదలు ఉప్పొంగాయి. ఈ వరదల ధాటికి స్థానికులు కొట్టుకుపోయారు. అయితే ఈ ఘటనలో 16 మంది మృతి చెందగా.. వారి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. కాగా, మరో తొమ్మిది మంది ఆచూకీ గల్లంతైనట్లు సమాచారం.
ఇదిలా ఉండగా, వరదల ప్రభావానికి టన్నుల కొద్దీ బురద పేరుకుపోయింది. ఈ బురద కింద కూరుకుపోయిన మృతదేహాలను సహాయక బృందాలు వెలికితీశాయి. కాగా, కుండపోత వర్షాల కారణంగా పెకలోంగన్ రీజెన్సీలో నదులు పొంగిపొర్లుతున్నాయి. ఈ వరదలకు దాదాపు తొమ్మిది గ్రామాలు దెబ్బతిన్నాయని అంచనా వేస్తున్నారు. మట్టితో పాటు రాళ్లు, చెట్లు పర్వతాలకు సమీపంలో ఉన్న గ్రామాల్లో పేరుకుపోయాయని విపత్తు నిర్వహణ ఏజెన్సీ బెర్గాస్ కతుర్సాసి వెల్లడించారు.