Site icon Prime9

Europe drought: కరువుకోరల్లో యూరప్ 500 ఏళ్లలో ఇదే మొదటిసారి

Europe drought: ఆఫ్రికా దేశాలు కరువుతో విలవిల్లాడ్డం మనం చూస్తూనే ఉన్నాం. ఇపుడు యూరప్‌కూడా ప్రస్తుతం కరువు కోరల్లో చిక్కుకొని విల్లవిల్లాడిపోతోంది. గత 500 ఏళ్లలో ఎన్నడూ చూడని విధంగా యూరప్‌ను ఈ ఏడాది కరువు వెంటాడుతోంది. ఒక పక్క ఎండలు మండిపోతున్నాయి. మరో పక్క అడవుల్లో కారు చిచ్చు వ్యాప్తించి దహించి వేస్తున్నాయి. మరో పక్క పంటల దిగుబడి గణనీయంగా తగ్గిపోయింది. ఎండలు మండిపోవడంతో విద్యుత్‌ వినియోగం పెరిగిపోయింది. దాని తగ్గట్టు విద్యుత్‌ ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయింది. తాజాగా యూరోపియన్‌ యూనియన్‌ జాయింట్ రీసెర్చి సెంటర్‌ విడుదల చేసిన నివేదిక ప్రకారం 47 శాతం యూరోప్‌ ప్రస్తుతం కరువు కోరల్లో చిక్కుకొని ఉంది. మండుతున్న ఎండలకు భూమిలోని తేమ బాగా తగ్గిపోయింది. యూరోప్‌లోని 17 శాతం హై ఎలర్ట్‌లో ఉంది. ఎండ వేడిమికి పంటలు దెబ్బతింటున్నాయి.

ఈ ఏడాది యూరప్‌లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. అలాగే వందలాది మంది ప్రజలు ఎండ వేడిమికి తట్టుకోలేక మృతి చెందారు. రికార్డు స్థాయిలో ఎండలు మండిపోతుండటంతో యూరోప్‌ మొత్తం కరువు కోరల్లో చిక్కుకుపోయింది. దీంతో డ్యాంలు, రిజర్వాయర్లు, నదుల్లో నీటి మట్టం క్రమంగా తగ్గిపోతోంది. యూరోపియన్‌ ఇన్నోవేషన్‌ కమిషనర్‌ మారియా గాబ్రియేల్‌ తాజా కరువు పరిస్థితుల గురించి స్పందించారు. ప్రస్తుతం అడవుల్లో మంటల సీజన్ కొనసాగుతోందని, సాధారణం కంటే కాస్తా ఎక్కువగా ఉన్నాయన్నారు. దీని ప్రభావం పంట ఉత్పత్తులపై పడుతుందని ఆమె అన్నారు. పశ్చిమ యూరోప్‌- మెడిటరేరియన్‌ రీజియన్‌లలో సాధారణం కంటే ఎండలు నవంబర్‌ వరకు కొనసాగే అవకాశం ఉంటుందని ఆమె వెల్లడించారు.

వాతావరణం సమతుల్యం దెబ్బతినడం వల్ల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో కరువు ఏర్పడుతోంది. కాగా రాత్రి ఉష్ణోగ్రతలు కాస్తా తగ్గుముఖం పట్టడం వల్ల ప్రజలకు ఎండ వేడిమి నుంచి కాస్తా ఉపశమనం లభిస్తోంది. ఎండ వేడిమికి ఈ ఏడాది యూరప్‌లో పంట దిగుబడి తగ్గే అవకాశాలున్నాయి. దీంతో మొక్కజొన్నలు, సోయాబిన్‌, సన్‌ఫ్లవర్‌ పంటలు గత ఐదేళ్ల సరాసరితో పోల్చుకుంటే వరుసగా 16 శాతం, 15 శాతం, 12 శాతం దిగుబడి తగ్గే అవకాశం కనిపిస్తోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వర్షపాతం తగ్గముఖం పట్టడంతో యూరోప్‌ మొత్తం లో నదుల్లో నీటిమట్టం తగ్గుతోంది. నీటి మట్టం తగ్గడంతో విద్యుత్‌ ఉత్పత్తి తగ్గుతుంది. నీటి ద్వారాఉత్పత్తి చేసే హైడ్రో పవర్‌ జనరేషన్‌, కూలింగ్‌ సిస్టమ్స్‌తో పాటు ఇతర పవర్‌ ప్లాంట్ల విద్యుత్‌ ఉత్పత్తి తగ్గిపోతోంది.

నీటి మట్టం తగ్గడంతో యూరప్‌లోని అతి పెద్ద రీన్‌ నదుల్లో రవాణా రకాపోకలు దెబ్బతింటున్నాయి ముఖ్యంగా షిప్‌లలో లోడింగ్‌ తగ్గడంతో పాటు బొగ్గు, చమురు రవాణా తగ్గుముఖం పడుతుంది. ఈ నెలలో కొన్ని ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు కాస్తా ఊరట లభించినా, మరి కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కురసిని వర్షాలకు పంటలు ధ్వంసం అయ్యాయి. యూరప్‌లో కరువు విషయానికి వస్తే బెల్జియం, ఫ్రాన్స్‌, జర్మనీ, హంగేరీ, ఇటలీ, లక్సెంబర్గ్‌, మాల్డోవా, నెదర్లాండ్స్‌, నార్తరన్‌ సెర్బియా, పోర్చుగల్‌, రుమానేయా, స్పెయిన్‌, ఉక్రెయిన్‌, యూకెలు కరువు కోరల్లో సతమతవుతున్నాయి. ఇప్పటికైన ప్రజలు కళ్లు తెరచి వాతావరణ కాలుష్యానికి అడ్డుకట్ట వేయకపోతే భవిష్యత్తులో ప్రపంచం మొత్తం కరువు కోరల్లో మగ్గాల్సి రావచ్చునని శాస్ర్తవేత్తలు హెచ్చరిస్తున్నారు.

Exit mobile version