Food Machine:పేద ప్రజలు, కార్మికులు ఆకలితో అలమటించకూడదు. సమయానికి భుజిస్తూ జీవనం సాగించాలి. ఇందుకోసం అన్నదానాలే చేయాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం కళ్లు తెరిస్తే ఆకలితో నకనకలాడే వారికి ఇబ్బందులే ఉండవు. దీంతో దుబాయ్ ప్రభుత్వం ఆహార యంత్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఏటిఎం మిషన్ పోలిన ఈ యంత్రం ద్వారా ప్రజలే నేరుగా కావాల్సిన ఆహారాన్ని తృప్తిగా తినేయవచ్చు…
వివరాల్లోకి వెళ్లితే.. దుబాయి ప్రభుత్వం ఆకలిగా ఉన్న వారి కోసం ఓ మిషన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. మాల్స్, ముఖ్యమైన 7 ప్రదేశాల్లో ఈ మిషన్లను ఏర్పాటు చేసింది. దీని ద్వారా రుచికరమైన, పరిశుభ్రమైన ఆహారాన్ని తినేలా మిషన్ ను రూపుదిద్దారు. ఈ మిషన్ ద్వారా చపాతి, బ్రడ్, ఫింగర్ రోల్సును ఉచితంగా పొందవచ్చు. వేడివేడిగా పొందేలా టచ్ స్క్రీన్ సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేశారు. నచ్చిన పదార్ధాన్ని సెలక్ట్ చేసుకొన్న తర్వాత, మిషన్ ఆహార తయారీని ప్రారంభిస్తుంది. ఎంత సేపటికి తయారౌతుందో తెలిపే సమయం కూడా డిస్ప్లేలో కనపడుతుంది. ఒకటి నుండి ఒకటిన్నర నిమిషం లోపే ఎంచుకొన్న ప్రత్యేక డోర్ ద్వారా బాక్స్ లో పెట్టిన ఆహార పదార్ధం బయటకు వస్తుంది.
నిర్మాణ రంగంలోని కార్మికులకు ఈ ఉచిత తయారీ ఆహార మిషన్ ఎంతో ఉపయోగకరంగా ఉందని అక్కడి ప్రాంతవాసులు పేర్కొంటున్నారు. ఎమిరేట్ వైస్ ప్రెసిండెంట్, దుబాయ్ పాలకులు షేక్ మహ్మద్ బీన్ రషీద్ ఈ పధకాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. ఎమిరేట్స్ లోని పేద కుటుంబాలు, ఆటోమేటిక్ యంత్రాల ద్వారా ఈ ఆహారాన్ని అందిస్తున్నారు. దీన్ని దుబాయ్ లో 7 ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. కాగ, ఈ ఆహార యంత్రాన్ని కరోనా కాలం నుండి అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రభుత్వానికి కొన్ని స్వచ్ఛంధ సంస్ధలు, కంపెనీలు కూడా సహకరిస్తూ, ఏడాది పొడువునా పేదలకు ఉచితంగా ఆహారాన్ని అందిస్తున్నారు.
ఈ పధకాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కూడా మిషన్ లో ప్రత్యేక సౌలభ్యాన్ని ఏర్పాటు చేశారు. ఎవరైనా దాతలు నగదు ఇవ్వదలిస్తే వెంటనే స్కీన్ లో పేర్కొన్న మేర నగదును బదిలీ చేయవచ్చు. లేదా ఆన్ లైన్ ద్వారా సంబంధిత బ్యాంకు ఖాతాకు దాతలు నేరుగా విరాళాలు అందించే సౌకర్యాన్ని కూడా కల్పించారు. యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్ ప్రాంతంలో ఎవ్వరూ ఆకలితో ఉండకూడదన్న ఆలోచనతో ఈ ఆహార యంత్రాన్ని అందుబాటులోకి తీసుకొని రావడాన్ని అక్కడి ప్రజలు స్వాగతిస్తున్నారు.
ఇది కూడా చదవండి:Japan: జపాన్ పై ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగం…హింసాత్మక ప్రవర్తనగా పేర్కొన్న జపాన్